Preventing prediabetes from turning into diabetes : “మీకు షుగర్ లేదు, కానీ బోర్డర్‌లో ఉన్నారు..” ఈ మాట ఈ మధ్యకాలంలో డాక్టర్ల నోట తరచుగా వినిపిస్తోంది. పని ఒత్తిడి, నిద్రలేమి, శారీరక శ్రమ కొరవడటంతో, యువత సైతం ఈ ‘బోర్డర్‌లైన్ డయాబెటిస్’ లేదా ‘ప్రీ-డయాబెటిస్’ బారిన పడుతున్నారు. ఇది మధుమేహం కాదు కదా అని తేలిగ్గా తీసుకుంటే, భవిష్యత్తులో టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏమిటీ ‘ప్రీ-డయాబెటిస్’ : ప్రీ-డయాబెటిస్ అంటే, రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా, కానీ పూర్తిస్థాయి డయాబెటిస్‌గా నిర్ధారించేంత స్థాయిలో లేకుండా ఉండటం.
పరీక్షా విలువలు: పరగడుపున షుగర్ లెవల్స్ 100-125 mg/dL, భోజనం చేశాక రెండు గంటలకు 140-200 mg/dL మధ్య ఉంటే, దానిని ప్రీ-డయాబెటిస్‌గా నిర్ధారిస్తారు.
హెచ్చరిక సంకేతాలు.. వినకపోతే ముప్పే : ప్రీ-డయాబెటిస్ ఉన్న చాలామందిలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ (Cleveland Clinic) వంటి సంస్థల అధ్యయనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ, శరీరం కొన్ని సూచనలు పంపుతుంది.
పొట్ట భాగంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడం. కారణం లేకుండా నిరంతరం నీరసంగా, నిస్సత్తువగా ఉండటం. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గడం. ఎప్పుడూ ఏదో ఒకటి తినాలనిపించడం, ముఖ్యంగా తీపి పదార్థాలపై కోరిక పెరగడం.
నిర్లక్ష్యం చేస్తే.. సమస్యల సుడిగుండం : “ప్రీ-డయాబెటిస్ అనేది మధుమేహానికి ముందస్తు హెచ్చరిక మాత్రమే కాదు, అదొక తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి,” అని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) హెచ్చరిస్తోంది. నిర్లక్ష్యం చేస్తే, ఇది టైప్-2 డయాబెటిస్‌కే కాకుండా, గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు, కంటి రెటీనా దెబ్బతినడం వంటి అనేక ప్రమాదాలకు దారితీస్తుంది.
వెనక్కి మళ్లించవచ్చా? నిపుణుల మాట..
“ప్రీ-డయాబెటిస్‌ను పూర్తిగా వెనక్కి మళ్లించవచ్చని చెప్పడానికి ఇంకా విస్తృత పరిశోధనలు జరగాలి. కానీ, సరైన జీవనశైలి మార్పులతో, అవసరమైతే మందులతో, దీనిని పూర్తిస్థాయి డయాబెటిస్‌గా మారకుండా కచ్చితంగా నివారించవచ్చు.”
– డా. పి.వి. రావు, మధుమేహ పరిశోధకులు
ఇప్పుడేం చేయాలి : ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే, జీవనశైలిలో కొన్ని కీలక మార్పులు చేసుకోవడం తప్పనిసరి.
ఆహారం: కొవ్వు పదార్థాలు తగ్గించి, దంపుడు బియ్యం, జొన్నలు, రాగులు వంటి పొట్టు తీయని ధాన్యాలు, పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
వ్యాయామం: రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడక, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయాలి.
బరువు అదుపు: అధిక బరువును తగ్గించుకోవడం అత్యంత ముఖ్యం.
రక్తపోటు నియంత్రణ: బీపీని ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవాలి.
ప్రశాంతమైన నిద్ర: రోజుకు 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఈ సమస్యను వ్యక్తిగతంగా కాకుండా, ఒక ప్రజారోగ్య సమస్యగా గుర్తించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ముందస్తు పరీక్షలను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.


