Saturday, September 21, 2024
Homeహెల్త్Skin diseases: మనల్ని వేధించే చర్మ రోగాలివే

Skin diseases: మనల్ని వేధించే చర్మ రోగాలివే

మనదేశంలో చాలామంది ఎదుర్కొంటున్న చర్మ సంబధమైన సమస్యలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా చర్మంపై దురదతో చాలామంది ఇబ్బందిపడుతున్నారు. చర్మంపై దురద తలెత్తడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఆ కారణాన్ని నిర్ధారణ చేసుకొని తదనుగుణంగా దానికి తగిన స్కిన్ కేర్ తీసుకోవాలి. శరీరంలో తేమ లోపించినపుడు ఈ సమస్య ఎదురవుతుంది. పొడి చర్మం ఉన్న వారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. అందుకే చర్మాన్ని ఎల్లవేళలా హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. వాతావరణంలో మార్పులు సంభవించినపుడు, సీజన్లు మారినపుడు కూడా చర్మంపై ఈ సమస్య తలెత్తుతుంటుంది. ఈ దురద సమస్య తీవ్రం కాకుండా ఆదిలోనే నియంత్రించవచ్చు. చర్మ సంరక్షణ కోసం చాలామంది రకరకాల క్రీములు వాడుతుంటారు. అయితే బ్యూటీపార్లర్స్, స్పాలలో వాడే ఉత్పత్తుల్లో నకిలీవి ఉండే ప్రమాదం ఉంది. వీటిని చర్మంపై రాసినపుడు చర్మం దెబ్బతింటుంది. అంతేకాదు అందులోని విషపూరిత రసాయనాలు చర్మం లోపలికి ఇంకి శరీర భాగాలను సైతం దెబ్బతీస్తాయి. అందుకే క్రీముల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంలో చర్మనిపుణుల సలహాలను తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు. సాధారణంగా టీనేజర్లు మొటిమల సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఇటీవల కాలంలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా అన్ని వయసుల వాళ్లూ యాక్నే సమస్యతో వైద్యులను పెద్దసంఖ్యలో సంప్రదిస్తున్నారు.

- Advertisement -

హార్మోన్లలోని తేడాపాడాల వల్ల, పోషకాహారలోపం వల్ల , జన్యు సంబంధమైన కారణాల కారణంగా, అలాగే అనారోగ్యకరమైన జీవనశైలి విధానాల వల్ల , కాలుష్యం కారణంగా ఈ సమస్య చర్మంపై తలెత్తుంది. వైద్య పరీక్షల ద్వారా కారణాన్ని మొదట నిర్థారించుకోవాలి. ఈ రకమైన సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే చర్మం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా మెయిన్ టైన్ చేయాలని చెప్తున్నారు. చర్మం విషయంలో కొందరు ఓవర్ క్లీనింగ్ చేస్తుంటారు. ఇది కూడా యాక్నేకు దారితీస్తుందని చర్మ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇంకొక సమస్య ఏమిటంటే కోవిడ్ పాండమిక్ తర్వాత చాలామందిలో జుట్టూ బాగా రాలిపోతోంది. జుట్టు ఇలా ఊడిపోవడానికి హార్మోన్ల కారణంతోపాటు తరచూ శిరోజాలకు రసాయన ట్రీట్మెంట్లు తీసుకోవడం, పోషకాహారలోపం, రకరకాల మందుల వాడకం, జన్యుసంబంధమైన కారణాలు, విటమిన్లలోపం కారణాలని శిరోజాల నిపుణులు చెప్తున్నారు. సమతులాహారం తీసుకోవడం, జుట్టుకు కఠినతరమైన ట్రీట్మెంట్లు ఇవ్వకుండా జాగ్రత్తపడడం, మాడు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల శిరోజాలు రాలిపోయే సమస్య తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. లేజర్ ఫోటోథెరపీ, ప్రత్యేకమైన హెల్మెట్ల వాడకం వంటి వాటి వల్ల కూడా జుట్టు రాలిపోకుండా సంరక్షించుకోవచ్చు. పిఆర్ పి అంటే ప్లేట్ లెట్ రిచ్ ప్లాస్మా లేదా గ్రోత్ ఫాక్టర్ కాన్సంట్రేట్స్ (జిఎఫ్ సి) వల్ల వెంట్రుకలు ఒత్తుగా అవడంతోపాటు కొత్త జుట్టు పెరుగుతుందని శిరోజాల నిపుణులు చెప్తున్నారు.

మనదేశంలో చాలామంది లైట్, బ్లాక్ స్కిన్ ప్యాచెస్ తో బాధపడడం కూడా ప్రస్తుతం బాగా చూస్తున్నాం. చాలామందిలో చర్మం నల్లగా, లేదా పాలిపోయినట్లు ఉంటోంది. నల్లమచ్చలకు చికిత్స చాలా కాలం పడుతుంది. ఎండోక్రైన్ సమస్య వల్ల, పోషకాలలోపం వల్ల చర్మంపై ఇలాంటి నల్లదనం కనిపిస్తుంది. చర్మంపై ఏర్పడ్డ ఇలాంటి నల్లని ప్యాచులు పోగొట్టుకోవడానికి కొందరు కెమికల్ ట్రీట్మెంట్లను తీసుకుంటారు. ఇంకొందరు కెమికల్ పీల్స్ చేయించుకుంటారు. మరికొందరు చర్మం లో మెరుపు కోసం ఇంట్లోనే స్వంత ప్రయోగాలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల సమస్య మరింత తీవ్రమై చర్మం బాగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కొందరు చర్మాన్ని మెరిసేలా చేసే ఇంజక్షన్లు ఇవ్వమని అడుగుతుంటారని చర్మ నిపుణులు చెప్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ ఫిల్టర్స్, సోషల్ మీడియా యాప్స్ వల్ల నేటి తరంలో శారీరక స్ప్రుహ ఎక్కువైంది. తాము బయట ఎలా కనిపిస్తున్నామన్న ధ్యాస వీళ్లలో ఎక్కువైంది. చర్మం అందంగా కనిపించాలని ఇష్టం వచ్చిన ప్రయోగాలు చేయకుండా, ఇంటర్నెట్ లో చూసి స్కిన్ కేర్ అనుసరించకుండా వైద్యుల సలహాననుసరించి చర్మం పట్ల జాగ్రత్త తీసుకుంటే మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News