Friday, November 22, 2024
Homeహెల్త్Summer care: వేస‌వి వ్యాధులు .. జాగ్ర‌త్త‌లు

Summer care: వేస‌వి వ్యాధులు .. జాగ్ర‌త్త‌లు

విజ‌య‌వాడ .. రామ‌గుండం .. హైద‌రాబాద్ న‌గ‌రం పేరు ఏదైనా స‌రే ఎండ‌లు మాత్రం మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల‌పై సూర్యుడు మండిప‌డుతున్నాడు. ప్ర‌తిరోజూ ఉష్ణోగ్ర‌త 46 డిగ్రీల సెల్సియ‌స్ దాటుతోందంటే .. ఎండ‌లు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. అందుకే, ఇంట్లో నుండి కాలు బైట‌పెట్టాలంటే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు. పెద్ద‌వారు .. చిన్న‌పిల్ల‌ల ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంది. ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా .. ఆఫీసులు, వ్యాపార ప‌నుల‌పై బైట‌కు వెళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. అయితే, తీవ్ర‌మైన ఎండ‌లు న‌మోద‌వుతున్న ఈ స‌మ‌యంలో స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోనిప‌క్షంలో రోగాల బారిన ప‌డ‌క త‌ప్ప‌ద‌ని డాక్ట‌ర్లు హెచ్చ‌రిస్తున్నారు. వేసవికాలంలో మ‌న అజాగ్ర‌త్త‌, అవ‌గాహ‌నాలోపం కార‌ణంగా ప్రాణాంత‌క రోగాల బారిన ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు. ఆ ప్రాణాంత‌క జ‌బ్బులు, వాటికి ప‌రిష్కారాలు తెలుసుకుందాం.

- Advertisement -

ఏప్రిల్ నెల‌లోనే ఎండ‌లు ఎక్కువ‌గా ఉన్నా, మే ప్రారంభం త‌ర్వాత అవి తీవ్ర‌రూపం దాల్చాయి. ఈ సమయంలో మనం ఎంతో జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే.. ప్రాణాంతక‌ వ్యాధులు దాడి చేసే ప్రమాదం ఉంది. సాధారణంగా వర్షకాలం, చలికాలంలోనే వ్యాధులు ఎక్కువగా వస్తాయని అంద‌రూ భావిస్తారు. కానీ, వేసవిలో కూడా కొన్ని వ్యాధులు మ‌న‌ల్ని ముప్పుతిప్పలు పెడతాయి. ఆ వ్యాధులు .. అవి రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్ర‌త్త‌ల గురించి తెలుసుకుందాం.
వడదెబ్బ
వేసవిలో వడదెబ్బ తగిలితే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో శరీరం అదుపు తప్పుతుంది. వేడిని నియంత్రించే వ్యవస్థ విఫలమైతే డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఎండలో ఇష్టానుసారంగా తిరిగినా, నీరు తక్కువగా తీసుకున్నా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఈ సమస్య రాకూడదంటే నీరు ఎక్కువగా తాగాలి. నిమ్మ రసం, కొబ్బరి నీరు, గ్లూకోజ్ తాగుతుండాలి. ఇంట్లో ఎలక్ట్రోరల్ ఫౌడర్ లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుకోండి. అవి అందుబాటులో లేకపోతే చక్కెర, ఉప్పు కలిపిన నీరు తాగండి.

వడదెబ్బతో ప్ర‌మాదం
వ‌డ‌దెబ్బ‌ను నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలు, కాలేయం ప్ర‌ధాన అవ‌య‌వాలు దెబ్బతిని ప్రాణం పోయే ప్రమాదం ఉంది. పిల్లలు, వృద్ధులు, క్రీడాకారులు, మద్యం అతిగా తాగేవాళ్లు ఎక్కువగా వడదెబ్బకు గురవుతారు. కొన్నిరకాల మందులు కూడా వడదెబ్బకు కారణమవుతాయి. శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నా.. అయోమయం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోడంలో ఇబ్బంది, చెమట పట్టకపోవడం, కాళ్లు చేతుల నొప్పులు, శరీరం తిమ్మిరి, వాంతులు, తలనొప్పి, స్పృహ కోల్పోవడం వంటివి వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరాన్ని చల్లబరచాలి. తడిగుడ్డతో శరీరమంతా తుడవాలి. నీళ్లు తాగించి, వెంటనే హాస్పిటల్‌కు తరలించాలి.

చర్మ సమస్యలు

వేసవిలో వేధించే మరో ప్రధాన సమస్య చర్మ సమస్య. వేసవిలో సూర్యుడి నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలు వల్ల చర్మంలోని కణాలు దెబ్బతింటాయి. ఎండలో ఎక్కువగా తిరిగితే చర్మం కమిలిపోతుంది. చెమట వల్ల కూడా చర్మ సమస్యలు తలెత్తుతాయి. శోభి మచ్చల సమస్యతో బాధపడేవారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. వేడి వల్ల చర్మంపై ఫంగస్ మరింత యాక్టీవ్ అవుతుంది. చర్మంపై మచ్చలు మరింత పెద్దవి కావచ్చు. చెమట వల్ల మచ్చలు ఉండే చోట ఎక్కువ దురద, మంట వస్తుంది. చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే వేసవిలో తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్లు ఉపయోగించాలి

టైఫాయిడ్‌, అతిసార, కామెర్లు

వేసవిలో టైపాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. వేసవిలో జ్వరం వచ్చినట్లయితే సొంత వైద్యంతో నిర్లక్ష్యం చేయొద్దు. జ్వరంతోపాటు తలనొప్పి, నీరసంగా ఎక్కువగా ఉన్నట్లయితే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అపరిశుభ్ర ఆహారం, నీరు తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. కాబట్టి, వీలైనంత వరకు బయటి ఆహారాన్ని తినకపోవడమే మంచిది . ఇంట్లో కూడా పరిశుభ్రత పాటించాలి. అపరిశుభ్రత వల్ల కేవలం టైఫాయిడ్ మాత్రమే కాదు, అతిసార కూడా సోకుతుంది. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, నోరు ఎండిపోవడం, దాహం ఎక్కువ కావడం వంటివి అతిసార లక్షణాలు. వేసవిలో విరేచనాలు అయితే తప్పకుండా డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాల్సిందే. అలాగే, వేసవిలో కామెర్లతో కూడా జాగ్రత్తగా ఉండాలి. కామెర్లు వస్తే కాలేయ సమస్యలు తలెత్తుతాయి.
హైపర్‌దెర్మియాతో గుండెపోటు

మీ ఇంట్లో వేడి ఎక్కువగా ఉంటే.. హైపర్‌దెర్మియాకు గురయ్యే అవకాశాలున్నాయి. రేకుల షెడ్లు, అపార్టుమెంట్లలో పై అంతస్తుల్లో ఉండేవారి ఇళ్లు చాలా వేడిగా ఉంటాయి. ఆ వేడి వారికి అలవాటైనా.. శరీరం మాత్రం తట్టుకోలేదు. ఫలితంగా చర్మం హైపర్‌దెర్మియాకు గురై గుండెపోటు వ‌చ్చే అవకాశం ఉంది. గుండెపోటుకు గురైన వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించాలి. కాబట్టి.. మీ ఇల్లు ఎక్కువ వేడి కాకుండా జాగ్రత్తపడండి. ఇంటిపై పచ్చని కొబ్బరి ఆకులు, లేదా వై‌ట్‌వాష్ వేయించుకోవడం ద్వారా వేడిని నియంత్రించవచ్చు. ఏసీలో ఎక్కువ సేపు గడిపేవాళ్లు అకస్మాత్తుగా వేడిలోకి రాకూడదు.
డీ హైడ్రేషన్‌.. ప్రాణం తీస్తుంది
వేసవిలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య ఇదే. బయటి ఉష్ణోగ్రతలతోపాటే శరీర ఉష్ణోగ్రత కూడా బాగా పెరిగిపోతుంది. దీంతో చెమట రూపంలో శరీరం తననితాను చల్లబరుచుకొనే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో శరీరంలో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. చెమటతోపాటు శరీరంలో ఉండే పొటాషియం, సోడియం, క్లోరైడ్, పాస్పరస్‌ వంటి లవణాలు కూడా బయటకు పోతాయి. ఇవి తిరిగి శరీరంలోకి చేరాలంటే తప్పకుండా నీళ్లు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తాగాలి. శీతల పానీయలు తాగకూడదు. డీ హైడ్రేషన్ వడదెబ్బకు కార‌ణ‌మ‌వుతుంది. వడదెబ్బ లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే చక్కెర, ఉప్పు కలిసిన నీరు తాగాలి. వెంటనే డాక్ట‌ర్‌ని సంప్రదించాలి. డీహైడ్రేషన్‌కు గురైనవారికి వాంతులు, వికారం, జ్వరం, కడుపునొప్పి వస్తాయి. నీళ్ల విరోచనాలవుతాయి. చర్మం పొడిబారినా, చెమట పట్టకపోయినా, మూత్రం రాకపోయినా డీహైడ్రేషన్‌కు గురైనట్లే.
ఈ వైరస్‌లతో జాగ్రత్త

వేసవి వచ్చిందంటే.. రైనో, పారా ఇన్ ఫ్లూయెంజా వంటి వైరస్‌లు మరింత ప్రమాదకరంగా మారతాయి. ఇవి చలికాలంలో వచ్చే వైరస్‌ల కంటే ప్రమాదకరమైన వేసవిలో పిల్లలకు రోటా వైరస్ సోకే ప్రమాదం ఉంది. అధిక జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని డాక్ట‌ర్ల ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్లాలి. వేసవిలో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం కూడా ఎక్కువ. వేసవిలో వేడి వల్ల కిడ్నీల్లో రాళ్లు కూడా ఏర్పడతాయి. వేసవిలో ఎక్కడిపడితే అక్కడ నీళ్లు తాగకూడదు. బయట దుకాణాల్లో తయారు చేసే పండ్ల రసాల్లో ఏ నీరు వాడతారో చెప్పలేం. కాబట్టి.. ఇంట్లోనే పండ్ల రసాలను చేసుకుని తాగడం మంచిది.
గర్భిణులపై అధిక ప్రభావం
వేసవిలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఎప్పటికప్పుడు ద్రవ పదార్థాలు తీసుకోవాలి. సాధారణ వ్యక్తుల్లో నీరు కేవలం చెమట, మూత్రం రూపంలోనే బయటకు వెళ్తుంది. అయితే, గర్భిణీల్లో పిండానికి కూడా నీళ్లు అవసరమవుతాయి. లేకపోతే పిండం పెరగడం నిలిచిపోతుంది. పిండం చుట్టూ ఉండే ఉమ్మనీరు తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల శిశువు చనిపోయే ప్రమాదం ఉంది. మీ ఇంట్లో గర్భిణీ మహిళ ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు, ఎలక్టోరల్‌ ఫౌడర్‌, గ్లూకోజ్‌ తాగిస్తూ ఉండండి. ఈ సమయంలో ఎండలోకి అస్సలు తీసుకెళ్లకూడదు. ఏమైనా సమస్య తలెత్తితే సొంత వైద్యం కాకుండా డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించాలి.

కళ్లు జాగ్రత్త
వేసవి కాలంలో వీచే వడ గాలులు చాలా డేంజర్. వేడికి కళ్లల్లో ఉండే తేమ సైతం అవిరైపోతుంది. ఫలితంగా కళ్లల్లో ఇసుక వేసినట్లుగా ఉంటుంది. కంటి వద్ద చర్మం పొడిబారి దుమ్ము, ధూళి ఎక్కువగా రేగుతుంది. అవి కంట్లో పడడం వల్ల కళ్ల దురద, మంటలు వస్తాయి. వేసవిలో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా సన్ గ్లాసులు పెట్టుకోండి. ఇంటికి చేరిన వెంటనే చల్లని నీటితో ముఖం కడుక్కోండి. ఎండాకాలంలో ఆస్తమా బాధితులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు కాలుష్యం, దుమ్ము ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తిరగకపోవడం మంచిది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News