Office Work VS Knee Pains: ఇప్పటి పని వాతావరణంలో చాలామంది రోజులో ఎక్కువ సమయం డెస్క్ ముందు కూర్చునే పరిస్థితినే ఉంటుంది. ఆఫీసు పనులు, కంప్యూటర్ వర్క్, మీటింగులు ఇలా రోజు మొత్తం కుర్చీలో గడపడం అలవాటైపోతోంది. కానీ ఈ జీవనశైలి శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలు, ఎముకల బలంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
మోకాళ్ల చలనం తగ్గి..
గంటల తరబడి కదలిక లేకుండా కూర్చుంటే మోకాళ్లకు మద్దతు ఇచ్చే కండరాలు బలహీనపడతాయి. ఈ బలహీనత కారణంగా నడుస్తున్నప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు అసౌకర్యం పెరుగుతుంది. మోకాళ్ల చలనం తగ్గి, క్రమంగా నొప్పి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతీ గంటకోసారి అయినా కుర్చీ నుంచి లేచి కొద్దిసేపు నడవడం చాలా ముఖ్యం. కనీసం 50 అడుగులు నడిస్తే రక్తప్రసరణ మెరుగవుతుంది.
ఒకే భంగిమలో గంటల తరబడి..
కుర్చీలో వాలిపోవడం లేదా ఒకే భంగిమలో గంటల తరబడి కూర్చోవడం వల్ల వెన్నుపూస, నడుము మాత్రమే కాదు, మోకాళ్లపైనా ఒత్తిడి పెరుగుతుంది. పనిలో మునిగిపోయినా మధ్య మధ్యలో కాళ్లను సాగదీయడం, కూర్చున్నపుడు కాళ్లను ముందుకు చాపడం వంటి చిన్న వ్యాయామాలు మోకాళ్లకు ఉపశమనం ఇస్తాయి. ఈ మార్పులు పెద్దగా శ్రమ లేకుండానే చేయవచ్చు.
విటమిన్ డి లోపం..
ఆఫీసు పనివల్ల బయట ఎక్కువగా తిరగలేకపోవడం, సూర్యరశ్మి తక్కువగా అందుకోవడం వల్ల విటమిన్ డి లోపం వస్తుంది. విటమిన్ డి ఎముకల బలం పెంచే ముఖ్య పోషకం. దీని కొరత మోకాళ్ల నొప్పికి దారి తీస్తుంది. కాబట్టి తరచుగా విటమిన్ డి స్థాయిలను పరీక్షించుకోవడం, అవసరమైతే వైద్యుడి సూచనతో సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది.
హైహీల్స్ ఎక్కువసేపు..
మహిళల్లో హైహీల్స్ ఎక్కువసేపు ధరించడం మోకాళ్లపై అదనపు ఒత్తిడి కలిగిస్తుంది. ఇలాంటివి తరచుగా వాడటం వల్ల చీలమండ, మోకాళ్ల నొప్పి పెరుగుతుంది. కాబట్టి ఎక్కువసేపు ఆఫీసులో ఉండే రోజుల్లో సౌకర్యవంతమైన, పాదానికి సరిపడే ఫుట్వేర్ వాడటం అవసరం. పురుషులూ తమ పాదానికి సరిగ్గా సరిపడే, అడుగు భాగం మృదువుగా ఉండే షూస్‌ని ఎంచుకోవాలి.
అదేవిధంగా, ఎయిర్ కండీషన్డ్ గదుల్లో నిరంతరం కూర్చోవడం వలన కండరాలు గట్టిపడే అవకాశం ఉంటుంది. దీనికి పరిష్కారంగా మధ్య మధ్యలో చిన్న విరామాలు తీసుకుని కదలికలు చేయడం మంచిది. ఇది మోకాళ్ల కదలికను మెరుగుపరుస్తుంది.
Also Read: https://teluguprabha.net/lifestyle/how-to-make-temple-style-coconut-rice-at-home/
రోజువారీ పనుల్లో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మోకాళ్ల నొప్పి వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. క్రమం తప్పకుండా నడక, సూర్యరశ్మి పొందడం, సరైన భంగిమలో కూర్చోవడం, సౌకర్యవంతమైన ఫుట్వేర్ వాడటం వంటి పద్ధతులు అనుసరిస్తే మోకాళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి పనిలో బిజీగా ఉన్నా, శరీరానికి కావాల్సిన కదలిక ఇవ్వడం మరవకూడదు.


