Friday, November 22, 2024
Homeహెల్త్Tired eyes: అలసిన కళ్లకు రిలాక్సేషన్ ఎలా?

Tired eyes: అలసిన కళ్లకు రిలాక్సేషన్ ఎలా?

యాంటాక్సిడెంట్ రెటినాల్ కళ్ల క్రీము వాడచ్చు

అలసిన కళ్లకు సహజమైన సాంత్వన ఇద్దాం ఇలా.. కళ్లు బాగా అలసిపోయాయా? కళ్ల కింద ఉబ్బినట్టున్నాయా? కళ్ల కింద సంచులు ఏర్పడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. జీవనశైలితో పాటు, వయసు మీద పడే కొద్దీ చర్మం యొక్క సహజసిద్ధమైన కొలాజిన్, ఎలాస్టిన్ ఉత్పత్తి తగ్గుతూ వస్తుంది. దీంతో చర్మం ఎలాస్టిసిటీ గుణాన్ని కోల్పోయి సాగినట్టు అవుతుంది. దానివల్ల కళ్ల కింద సంచుల్లా ఏర్పడతాయి. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఫ్లూయిడ్ రిటెన్షన్ ఏర్పడుతుంది. ఫలితంగా శరీరంలో పలు భాగాలతో పాటు కళ్ల కింద కూడా వాస్తాయి.  

- Advertisement -

  నిద్రలేమి వల్ల కళ్ల కింద నల్లటి వలయాలతో పాటు, వాపు కూడా వస్తుంది. అలర్జిక్ రియాక్షన్ల వల్ల కూడా కళ్ల చుట్టూ వాచినట్టు అవుతుంది.  ఈ సమస్యలను పరిష్కరించే సహజసిద్ధమైన చిట్కాలు కొన్ని ఉన్నాయి.  గోరువెచ్చటి నీళ్లల్లో శుభ్రంగా ఉన్న చిన్న టవల్ ని తడిపి దాన్ని కళ్ల మీద వేసుకుని అలాగే ఐదు నుంచి పది నిమిషాలు  ఉంచుకోవాలి. ఇలా చేస్తే కళ్ల నొప్పులు తగ్గుతాయి. వేడి నీళ్లల్లో గుడ్డను తడిపి కళ్ల మీద వేసుకోవడం వల్ల కళ్లకు కావలసిన తేమ అందుతుంది. ఆ ప్రదేశంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కళ్ల కండరాలు రిలాక్స్ అవుతాయి.    

  ఇంకో చిట్కా ఏమిటటే డిజిటల్ స్క్రీన్స్ బ్రైట్ నెస్ ను గదిలోని లైటింగ్ కు సమంగా ఉండేలా సరిచేసుకుంటే కళ్లు అలసిపోవు. కంప్యూటర్ మీద పనిచేసేటప్పుడు తప్పనిసరిగా కళ్ల నిపుణులు సూచించిన ఐ గ్లాసెస్ పెట్టుకొని పనిచేయడం వల్ల కళ్లు తొందరగా అలసిపోవు. అయితే మీ ముఖం నుంచి కంప్యూటర్ స్క్రీన్ 20 నుంచి 26 అంగుళాల దూరంలో ఉండాలి. అరచేతులను కళ్ల మీద పెట్టుకోవడం వల్ల కళ్ల స్ట్రెయిన్ బాగా తగ్గుతుంది. ఈ పద్ధతి ద్వారా కళ్లు రిలాక్సేషన్ పొందుతాయి.  అలాగే బాగా అలసిన కళ్లు రిలాక్స్ కావడానికి టీ బ్యాగ్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఛమోమైల్ లేదా రెగ్యులర్ టీ తాగిన తర్వాత ఆ టీ బ్యాగ్స్ ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో ఉంచి కాసేపు ఫ్రిజ్ లో పెట్టాలి. చల్లగా అయిన ఆ టీ బ్యాగ్స్ ను కనురెప్పల మీద కాసేపు ఉంచితే కళ్ల వాపు తగ్గడంతో పాటు కళ్లకు ఎంతో సాంత్వననిస్తుంది కూడా.    

కళ్ల వ్యాయామాలు కూడా అలసిన నేత్రాలకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి.   కళ్ల దగ్గర కూడా కండరాలుంటాయి. వీటికి నిత్యం వ్యాయామాలు ఇవ్వడం వల్ల బెటర్ ఫలితాలు చూస్తారు. ఉదాహరణకు మీ కళ్లకు కొన్ని అంగుళాల దూరంలో వేలు ఉంచి దానిపైనే మీ దృష్టిని నిలపాలి. ఆ తర్వాత మరికొంత దూరంలో వేలును ఉంచి దానిపై చూపు నిలపాలి. ఆ తర్వాత మళ్లీ వేలును వెనక్కి తీసుకురావాలి. ఇలా కొన్నిసార్లు ఈ వ్యాయామం చేయాలి. ఇంకొకటేమిటంటే మీ కళ్లను గుండ్రంగా తిప్పుతూ సీలింగ్ పై, దాని నుంచి నేలపై కదిలించాలి. కుడి ఆ తర్వాత ఎడమ వైపులకు మెల్లగా చూడాలి. ఈ వ్యాయామాలు కంటి అలసటను పోగొట్టడంలో ఎంతగానో సహాయపడతాయి కానీ మీ కంటి కండరాలను ఈ వ్యాయామాలు బలోపేతం చేయవు. అలాగే డిజిటల్ డివైస్ ఉపయోగిస్తున్నప్పుడు ఆ పని నుంచి రెగ్యులర్ బ్రేక్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతి రెండు గంటల తర్వాత స్క్రీన్ నుంచి పదిహేను నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. కళ్లు పొడిబారడం వల్ల కూడా కళ్లు బాగా అలసిపోతాయి.  

  హ్యుమిడిఫైయ్యర్ వాడడం వల్ల గాలిలో తేమ చేరడంతో పాటు కళ్లకు కూడా తేమ అందుతుంది. నేచురల్ టియర్స్ రావాలంటే నిమిషానికి పదిహేను సార్లు కళ్లను అర్పి తెరుస్తుండాలి.  అందులోనూ డిజిటల్ డివైజ్ చూసేటప్పుడు దీనిని తప్పనిసరిగా  అనుసరించాలి. లేకపోతే కళ్ల అలసట తీవ్రమైన కళ్ల కింద భాగంలో నల్లటి వలయాలు ఏర్పడతాయి. బాగా అలసి వాచినట్టు ఉన్న కళ్లకు సాంత్వన నిచ్చే నాలుగు నేచురల్ చిట్కాలు కూడా ఉన్నాయి.

    కళ్ల కింద ఏర్పడ్డ సంచులను తొలగించాలంటే సన్నగా , గుండ్రంగా తరిగిన కీర ముక్కలను అరగంట సేపు ఫ్రిజ్ లో ఉంచాలి. ఆతర్వాత వాటిని కళ్ల మీద పెట్టుకోవాలి. అనంతరం కళ్ల కింద భాగంలో వాటిని పది నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. కోల్డ్ టీ బ్యాగ్స్ కూడా అలసిన కళ్లపై బాగా పనిచేస్తాయి. ఉపశమనాన్ని అందిస్తాయి. వాడిన టీబ్యాగ్స్ ను నీళ్లతో కడిగి ఒక గిన్నెలో ఉంచి అరగంట సేపు ఫ్రిజ్ లో ఉంచాలి. ఆ తర్వాత వాటిని వాచిన కళ్ల మీద పదినిమిషాలు ఉంచుకోవాలి. అనంతరం కళ్ల కింద ఉన్న ప్రదేశాన్నికూడా చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. వాడిన గ్రీన్ టీ బ్యాగ్స్ ని కళ్లపై , కింద భాగంలో పెట్టుకోవడం వల్ల అందులోని యాంటాక్సిడెంట్లలో ఉండే యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు కళ్ల కింద భాగానికి ఎంతో ఉపశమనాన్ని అందిస్తాయి. రోజ్ వాటర్ కూడా వాచిన కళ్లకు ఇచ్చే సాంత్వన ఎంతో. ఎక్కువసేపు పనిచేయడం, నిద్ర లేకపోవడం, జన్యు సంబంధిత కారణాల వల్ల కళ్లు వాస్తాయి.

 కళ్లు బాగా అలసినట్టు కనిపిస్తాయి. వాచిన కళ్లను సాధారణ స్థితికి తేవడంతో పాటు వాటికి సాంత్వన అందివ్వడంలో రోజ్ వాటర్ బాగా పనిచేస్తుంది. ఫ్రిజ్ లో కొంతసేపు ఉంచి బయటకు తీసిన చల్లటి రోజ్ వాటర్ లో కాటన్ బాల్స్ ముంచి కళ్ల మీద పది నుంచి ఇరవై నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇలా చేస్తే కళ్ల వాపు ఇట్టే తగ్గుతుంది. కళ్ల వాపులను తగ్గించే మరో సహజమైన చిట్కా అలొవిరా ఆకు నుంచి తాజా గుజ్జును తీసి ఐస్ ట్రేలో పోయాలి. దాన్ని ఫ్రీజర్ లో ఉంచాలి. సుదీర్ఘమైన పనిగంటల తర్వాత అలసిన కళ్లతో ఇంటికి వచ్చినపుడు ఈ అలొవిరా ఐస్ క్యూబ్స్ ను కళ్ల మీద సున్నితంగా అప్లై చేసుకోవాలి. ఇది కళ్లపై మంచి ఫలితాన్ని చూపిస్తుంది. ఈ క్యూబ్స్ ను ముఖంపై, శరీరంపై ఏర్పడ్డ మొటిమలు, సన్ బర్న్స్, యాక్నే, రెడ్ నెస్ వంటి వాటిపై కూడా అప్లై చేయొచ్చు. కళ్ల కింద ఏర్పడ్డ నల్లటి వలయాలు పోగొట్టాలన్నా, వాచిన కనులను సాధారణ స్థితికి తేవాలన్నా కూడా శక్తివంతమైన యాంటాక్సిడెంట్ రెటినాల్ ఉన్న కళ్ల క్రీమును రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. రాత్రి సమయాలలో బ్రైటనింగ్ ఏజెంట్స్ అయిన విటమిన్ సి, లికురైస్, కోజిక్ యాసిడ్, నియాసినమైడ్ లను వాడొచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News