Warning signs of high salt intake : వంటకు రుచినిచ్చే ఉప్పు, మోతాదు మించితే మన ఆరోగ్యానికి చేటు చేస్తుందని తెలుసా? బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు.. ఇలా ఎన్నో అనారోగ్యాలకు అతి ఉప్పే మూలమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ, మనం రోజూ ఎంత ఉప్పు తింటున్నామో మనకు తెలియదు. అయితే, మీ శరీరం కొన్ని స్పష్టమైన సంకేతాల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తుందని మీకు తెలుసా? ఆ హెచ్చరికలను విస్మరించకుండా, వెంటనే మేల్కొనకపోతే ముప్పు తప్పదు.
మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నారని చెప్పే 5 సంకేతాలు : మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయేమో గమనించుకోండి. ఇవి మీ ఆహారంలో ఉప్పు మోతాదు పెరిగిందనడానికి సంకేతాలు.
పదేపదే మూత్ర విసర్జన: డయాబెటిస్ లేకపోయినా, తరచుగా, ముఖ్యంగా రాత్రిపూట మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తోందా? అయితే, మీరు ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారని అర్థం. అధిక ఉప్పు వల్ల కిడ్నీలు ఎక్కువ నీటిని బయటకు పంపాల్సి వస్తుందని ‘ఇంటర్నేషనల్ కాంటినెన్స్ సొసైటీ’ (International Continence Society) అధ్యయనాలు చెబుతున్నాయి.
అంతులేని దాహం: ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి, నీటి సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా, మెదడు దాహం సంకేతాలను పంపి, శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేసుకోమని చెబుతుంది.
శరీర భాగాల్లో వాపు: ఉప్పు అధికంగా తీసుకుంటే, శరీరం నీటిని నిలుపుకుంటుంది (Water Retention). దీనివల్ల కాళ్లు, పాదాలు, చేతుల్లో వాపులు వస్తాయి.
ఉప్పగా ఉంటేనే రుచి: ఉప్పు ఎక్కువగా తినే వారికి, కాలక్రమేణా నాలుకపై ఉండే రుచి మొగ్గలు మొద్దుబారిపోతాయి. దీనివల్ల, సాధారణ ఆహారం చప్పగా అనిపిస్తుంది, ఉప్పు ఎక్కువగా ఉండే ఊరగాయలు, చిప్స్ వంటి వాటిపైనే మనసు లాగుతుంది.
తిమ్మిర్లు, ఎముకల నొప్పులు: అధిక సోడియం, శరీరం నుంచి కాల్షియంను బయటకు పంపేలా చేస్తుంది. దీనివల్ల ఎముకలు బలహీనపడి, కండరాల తిమ్మిర్లు, నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఉప్పును తగ్గించుకోవడం ఎలా : ఆహారంలో ఉప్పును తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. ప్యాక్ చేసిన మాంసం, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు బదులుగా, తాజాగా దొరికే వాటిని ఎంచుకోండి. కొనుగోలు చేసే ముందు, ఫుడ్ లేబుల్‌పై సోడియం స్థాయిలను తనిఖీ చేసుకోండి. రెస్టారెంట్లలో తినేటప్పుడు, ఉప్పు తక్కువగా వేయమని చెప్పండి.
సాస్‌లు, ఊరగాయలు, అప్పడాల వాడకాన్ని తగ్గించండి.
“అధిక సోడియం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్‌కు ప్రధాన కారణం,” అని యూఎస్ ఫుడ్ & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US Food & Drug Administration) హెచ్చరిస్తోంది. కాబట్టి, ఉప్పు విషయంలో ఆ తప్పు చేయకుండా, మితంగా తీసుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది.


