Health tips for winter season : రాష్ట్రంలో చలి పులి పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండటంతో, జనం గజగజ వణికిపోతున్నారు. ఈ మారుతున్న వాతావరణంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ శీతాకాలంలో సంపూర్ణ ఆరోగ్యంతో వెచ్చగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (DMHO) డా. చంద్రశేఖర్ వివరించారు.
ఎందుకీ సమస్యలు : చలికాలంలో వాతావరణం చల్లబడటంతో, మన శరీరంలోని రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల రక్త ప్రసరణ మందగించి, అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోగనిరోధక శక్తి కూడా తగ్గడంతో, ఇన్ఫెక్షన్లు సులభంగా సోకుతాయి.
వైద్యుల సూచనలు.. ఆరోగ్య సూత్రాలు : ఈ చలికాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలని డా. చంద్రశేఖర్ సూచిస్తున్నారు.
వ్యాయామం తప్పనిసరి: శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు, రోజూ కనీసం అరగంట పాటు వాకింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
ఆహారంలో మార్పులు: వేడి నీరు, వేడి ఆహారం: ఉదయం పూట వేడి నీరు తాగడం, వేడిగా, తాజాగా వండిన ఆహారాన్నే తినడం మంచిది. నిల్వ ఉంచిన పదార్థాలకు దూరంగా ఉండాలి.
‘సి’ విటమిన్‌తో రోగనిరోధక శక్తి: రోగనిరోధక శక్తిని పెంచేందుకు, నారింజ, బత్తాయి వంటి ‘సి’ విటమిన్ అధికంగా ఉండే పండ్లను, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి.
పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ: న్యుమోనియా ముప్పు: చలికాలంలో పిల్లలు, వృద్ధులు న్యుమోనియా బారిన పడే ప్రమాదం ఎక్కువ. కాబట్టి, ఉదయం, రాత్రి వేళల్లో మంచులో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. టీకాలు: పిల్లలకు న్యుమోనియా రాకుండా టీకాలు వేయించడం తప్పనిసరి.
ఇంటి వైద్యం వద్దు.. డాక్టర్‌ను సంప్రదించండి: ఈ కాలంలో జలుబు, దగ్గు వంటివి వస్తే, సొంత వైద్యం చేసుకోకుండా, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గుండె జబ్బులు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. రక్త ప్రసరణ తగ్గడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
వెచ్చగా ఉండండి: శరీరంలోని వేడి ఎక్కువగా చేతులు, కాళ్లు, చెవుల ద్వారా బయటకు పోతుంది. కాబట్టి, బయటకు వెళ్లేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు ఉన్ని టోపీలు, చేతి గ్లౌజులు, సాక్సులు ధరించడం మంచిది. ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, ఈ శీతాకాలాన్ని మనం ఆరోగ్యంగా, ఆనందంగా గడిపేయవచ్చు.


