World First Aid Day awareness : రోడ్డు ప్రమాదం.. గుండెపోటు.. పాముకాటు.. ఇలాంటి ఆపదలు చెప్పిరావు. ఆ క్షణంలో అంబులెన్స్ వచ్చేలోపు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేలోపు జరిగే ప్రతి క్షణం విలువైందే. ఆ కీలక సమయంలో, సరైన అవగాహనతో మనం చేసే చిన్నపాటి ప్రథమ చికిత్స, ఒకరి ప్రాణాన్ని నిలబెట్టగలదు. ప్రథమ చికిత్సపై అవగాహన పెంచే లక్ష్యంతో, ప్రతి ఏటా సెప్టెంబరు రెండో శనివారం ‘ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం’ నిర్వహిస్తున్నారు.
ఎందుకు ముఖ్యం : రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో, బాధితుడిని ఆసుపత్రికి తరలించే ముందు చేసే చికిత్సనే ‘ప్రథమ చికిత్స’. ఇది బాధితుడి పరిస్థితి మరింత విషమించకుండా నిరోధించి, ప్రాణాలు నిలబడటానికి ఆస్కారం పెంచుతుంది.
“అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స చేయడం వల్ల ప్రాణాలు నిలిపేందుకు ఆస్కారం ఉంటుంది. సీపీఆర్ వంటి ప్రథమ చికిత్స రోగుల ప్రాణాలను కాపాడటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరూ వీటిపై కొంత అవగాహన పెంచుకోవాలి.”
– డాక్టర్ మువ్వా రామారావు, మిర్యాలగూడ
మీ ‘ఫస్ట్ ఎయిడ్ కిట్’ సిద్ధంగా ఉందా : ప్రతి ఇల్లు, వాహనం, కార్యాలయంలో ఓ ప్రథమ చికిత్స పెట్టె (First Aid Kit) ఉండటం అత్యవసరం. అందులో కనీసం ఈ వస్తువులు ఉండేలా చూసుకోవాలి.
గ్లౌజులు, శానిటైజర్, యాంటీసెప్టిక్ వైప్స్: గాయాలను శుభ్రం చేసే ముందు ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు. యాంటీ-బ్యాక్టీరియల్ ఆయింట్‌మెంట్, బ్యాండేజీ, వాటర్‌ప్రూఫ్ టేప్: గాయాలకు కట్టు కట్టడానికి.
కత్తెర, ఇన్‌స్టంట్ ఐస్ ప్యాక్స్: వాపులు, బెణుకుల కోసం.
సీపీఆర్ ఫేస్ షీల్డ్, బర్న్ హైడ్రోజెల్: గుండెపోటు, కాలిన గాయాల కోసం.
ఆస్పిరిన్, జ్వరం మాత్రలు: వైద్యుడి సలహా మేరకు వాడటానికి.
ఆపదను బట్టి.. ప్రథమ చికిత్స : ప్రతి ప్రమాదానికి ఒకే రకమైన ప్రథమ చికిత్స ఉండదు. పరిస్థితిని బట్టి స్పందించాలి.
గుండెపోటు: బాధితుడు స్పృహ తప్పితే, వెంటనే సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) ప్రారంభించాలి.
రోడ్డు ప్రమాదాలు: తీవ్ర రక్తస్రావం అవుతుంటే, శుభ్రమైన గుడ్డతో గాయంపై గట్టిగా అదిమిపెట్టి, రక్తం కారకుండా చూడాలి.
పాముకాటు: కాటు వేసిన ప్రదేశానికి కొంచెం పైభాగంలో కట్టుకట్టి, బాధితుడిని కదలకుండా ఉంచి, ఏ పాము కరిచిందో గుర్తించే ప్రయత్నం చేయాలి.
నీట మునిగితే: బాధితుడి కడుపులోంచి నీటిని బయటకు కక్కించి, శ్వాస సరిగ్గా ఆడేలా చూడాలి. ఏ రకమైన ప్రథమ చికిత్స చేసినా, వెంటనే ఆలస్యం చేయకుండా బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించడం అత్యంత ముఖ్యం. మనకున్న కొద్దిపాటి అవగాహన, ఆపద సమయంలో చూపించే చొరవ.. ఓ నిండు ప్రాణాన్ని కాపాడగలవని గుర్తుంచుకోండి.
గమనిక: కిట్‌లోని మందులు, ఇతర వస్తువుల గడువు తేదీని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.


