World Mental Health Day: ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా దీన్ని జరుపుతున్నారు. ప్రజలకు మెంటల్ హెల్త్‌పై అవగాహన కల్పించడానికి దీన్ని నిర్వహిస్తున్నారు. అయితే, తరచుగా ఉండే కొన్ని లక్షణాల వల్ల ముందుగానే మానసిక ఆరోగ్యాన్ని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏయే లక్షణాల వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదనే విషయాన్ని తెలుసుకుందాం.
కారణం లేని కోపం
ఎదుటి వారు నచ్చిన పని చేయకపోతే కొందరి మీద కోపం వస్తుంది. అది కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. కానీ మరికొందరికి మాత్రం రోజుల తరబడి కోపం ఉంటుంది. ఈ కోపం చివరకు డిప్రెషన్‌కు దారితీస్తుంది. ఇలా రోజుల తరబడి కోపం ఉంటే మాత్రం తప్పకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు కోరుతున్నారు. వారి మానసిక ఆరోగ్యం సరిగా లేదని ఈ సంకేతం తెలియజేస్తుంది. ఏదైనా కోపం లేకుండా ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయాలి.
తీవ్ర ఆందోళన, భయం
కొందరు ప్రతీ చిన్న విషయానికి భయపడుతుంటారు. అన్నింటికి ఇలా భయపడి ఆందోళన చెందితే మాత్రం మానసికంగా ఇబ్బంది పడుతారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి.
నిద్ర, ఆకలిలో మార్పులు
మానసికంగా ఇబ్బంది పడుతున్న వారిలో ఎక్కువగా నిద్రలేమి సమస్య తీవ్రమవుతుంది. వీరికి పెద్దగా ఆకలి వేయదు. ఇలా నిద్ర, ఆకలి విషయంలో ఏవైనా మార్పులు కనిపిస్తే మాత్రం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. ఎక్కువ కాలం ఇలా జరిగితే శారీరక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అందరికి దూరంగా ఉండటం
కొందరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఇలాంటి వారు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని అర్థం. అందరితో కలిసి ఉంటే ఎలాంటి ఆలోచనలు రాకుండా సంతోషంగా ఉంటారు. అదే ఒంటరిగా ఉంటే మాత్రం అనేక ఆలోచనలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
జ్ఞాపకశక్తి తగ్గడం
మానసికంగా ఇబ్బంది పడుతున్న వారిలో జ్ఞాపకశక్తి భారీగా తగ్గిపోతుంది. ఎక్కువగా మతిమరుపు, ఆందోళన, ప్రతీ విషయంలో గందరగోళం ఏర్పడుతుంది.
కోపం, చిరాకు
ప్రతీ చిన్న విషయానికి చిరాకు పడుతుంటారు. కోపం, చిరాకు అధికంగా ఉంటే మాత్రం మానసిక సమస్యను ఎదుర్కొన్నట్లే చెప్పవచ్చు. ఇలా చీటికి, మాటికి చిరాకుగా ఫీల్ అవుతుంటే మాత్రం తప్పకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆత్మహత్య ఆలోచనలు
ఈ జీవితం వృధా.. ఆత్మహత్య చేసుకుంటా అనే ఆలోచనలు వస్తే మాత్రం తప్పకుండా మీరు డిప్రెషన్‌లో ఉన్నట్లే. పదే పదే ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తే మాత్రం ఆ ఆలోచనల నుంచి బయటకు రావాలి. మెంటల్‌గా స్ట్రాంగ్ కావడానికి ప్రయత్నాలు చేయాలి. అలాంటి ఆలోచనలు వస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.


