పాకిస్థాన్ లో బాంబు పేలుడు (Pak Bomb Blast) కలకలం రేపింది. క్వెట్టా రైల్వేస్టేషన్లో శనివారం జరిగిన భారీ పేలుడులో దాదాపు 21 మంది మరణించారు. 46 మంది గాయపడినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం రైల్వే స్టేషన్ బుకింగ్ ఆఫీస్ వద్ద ఈ పేలుడు జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే ఇది ఆత్మాహుతి దాడిలా కనిపిస్తోందని అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.
Also Read : కాంగ్రెస్ కుట్రలను భగ్నం చేయండి -మోదీ
ఉదయం 9 గంటలకు క్వెట్టా రైల్వే స్టేషన్ నుంచి పెషావర్ కు జాఫర్ ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుండగా ఈ బాంబు పేలుడు (Bomb blast) సంభవించింది. పేలుడు ధాటికి ప్లాట్ఫామ్ పైకప్పు ధ్వంసమైంది. అలాగే ఆ శబ్దాలు సిటీలోని ఇతర ప్రాంతాల వరకు వినిపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బలూచిస్తాన్ ప్రభుత్వం దాడిని తీవ్రంగా ఖండించింది. మహిళలు, పోలీసులు, చిన్నారులు, సాధారణ పౌరులు లక్ష్యంగా పాకిస్థాన్ (Pak) లో ఉగ్రదాడులు పెరిగాయని బాధ్యులను విడిచిపెట్టబోమని హెచ్చరించింది. పేలుడు సమయంలో ఘటనా స్థలంలో వందమంది వరకు ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. పేలుడు జరిగిన వెంటనే స్పందించిన సహాయ సిబ్బంది గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.