Monday, November 17, 2025
Homeఇంటర్నేషనల్Alaska Summit: శాంతికి పుతిన్ షరతు.. దొనెట్‍స్క్ ఇస్తేనే చర్చలు - అలస్కా భేటీలో తేల్చిచెప్పిన...

Alaska Summit: శాంతికి పుతిన్ షరతు.. దొనెట్‍స్క్ ఇస్తేనే చర్చలు – అలస్కా భేటీలో తేల్చిచెప్పిన రష్యా!

Alaska Summit peace talks : అలస్కా వేదికగా జరిగిన అత్యంత కీలకమైన భేటీ ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసినా, యుద్ధ మేఘాల కింద ఓ కొత్త ప్రతిపాదనకు బీజం వేసింది. మూడేళ్లుగా రగులుతున్న  ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన చర్చలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపాయి. చర్చలు ఫలించలేదని ఇరు నేతలు ప్రకటించినప్పటికీ, శాంతి స్థాపనకు పుతిన్ పెట్టిన ఓ కఠినమైన షరతు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంతకూ పుతిన్ పెట్టిన ఆ డిమాండ్ ఏమిటి..? దానికి ఉక్రెయిన్ ఎందుకు ససేమిరా అంటోంది.? ట్రంప్ మధ్యవర్తిత్వం ఫలిస్తుందా..?

- Advertisement -

పుతిన్ పంతం.. జెలెన్‌స్కీ వ్యూహం : అలస్కాలోని జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్-రిచర్డ్‌సన్‌లో దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో, యుద్ధాన్ని ముగించాలంటే తూర్పు ఉక్రెయిన్‌లోని దొనెట్‍స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ సైన్యం బేషరతుగా, పూర్తిగా వైదొలగాలని పుతిన్ స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేవలం దొనెట్‍స్క్‌ మాత్రమే కాకుండా లుహాన్‌స్క్‌ ప్రాంతాన్ని కూడా తమకు అప్పగించాలని, ఆ తర్వాతే శాంతి చర్చలకు మార్గం సుగమం అవుతుందని పుతిన్ తేల్చిచెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి.

ఈ భేటీ అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పాటు పలువురు యూరోపియన్ నేతలతో ఫోన్‌లో సంభాషించారు. పుతిన్ పెట్టిన డిమాండ్‌ను వారికి వివరించగా, జెలెన్‌స్కీ దానిని తక్షణమే తిరస్కరించినట్లు తెలుస్తోంది. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పణంగా పెట్టి శాంతిని కోరుకోబోమని ఆయన స్పష్టం చేసినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

దొనెట్‍స్క్ ఎందుకంత కీలకం : రష్యా సరిహద్దుల్లో ఉన్న డాన్‌బాస్ ప్రాంతంలో దొనెట్‍స్క్, లుహాన్‌స్క్‌లు అంతర్భాగాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా, అపారమైన బొగ్గు నిల్వలు, ఉక్కు కర్మాగారాలకు ఇది కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంపై పట్టు సాధిస్తే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చని, అదే సమయంలో రష్యాకు వ్యూహాత్మకంగానూ, ఆర్థికంగానూ కీలకమైన పట్టు లభిస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం రష్యా ఆధీనంలోనే ఉంది. 2022లో మాస్కో ఈ ప్రాంతాలను ఏకపక్షంగా విలీనం చేసుకుంది. ప్రస్తుతం దొనెట్‍స్క్ మొత్తం ఉక్రెయిన్ నియంత్రణలో లేదు. ఆ ప్రాంతంలో కేవలం 30 శాతం మాత్రమే ఉక్రెయిన్ ఆధీనంలో ఉంది. మిగతా భూభాగంపై ఆధిపత్యం కోసం రష్యా సైనికులు తీవ్రమైన పోరాటాలు చేస్తున్నారు. పూర్తి దొనెట్‍స్క్ తమ వశం చేసుకోవాలని రష్యా సైన్యం పట్టుదలతో ఉంది.

ట్రంప్ తదుపరి అడుగులు : గత మూడేళ్లుగా సాగుతున్న ఈ భీకర యుద్ధానికి ఒక ముగింపు పలకాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేవలం కాల్పుల విరమణ కాకుండా, శాశ్వత శాంతి ఒప్పందం దిశగా ఇరు దేశాలను నడిపించడమే తన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. పుతిన్‌తో చర్చలు సానుకూలంగా జరిగాయని, అయితే కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ క్రమంలో, తదుపరి చర్చల నిమిత్తం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోమవారం వాషింగ్టన్‌కు రానున్నారు. ఈ సమావేశంలో ట్రంప్ ఏ విధంగా జెలెన్‌స్కీని ఒప్పిస్తారు, పుతిన్ డిమాండ్‌కు ప్రత్యామ్నాయంగా ఎలాంటి పరిష్కార మార్గాన్ని సూచిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad