Pakistan Foreign Minister: నిషేధిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)ను అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థగా జాబితా చేసింది. ఇది జరిగిన కాస్త సమయంలోనే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్ ఆ సంస్థపై ఇస్లామాబాద్ వైఖరిని సమర్థించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది. భారత్, అమెరికా రెండు దేశాలు కూడా లష్కరే తోయిబాకి అనుబంధ సంస్థగా టీఆర్ఎఫ్ ని పాకిస్తాన్ కేంద్రంగా ఏర్పాటు చేసారని నమ్ముతున్నాయి.
వాషింగ్టన్ డీసీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇషాక్ దార్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను కలిశారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ని ఉగ్రవాద సంస్థగా నియమించడం అనేది అమెరికా యొక్క సార్వభౌమ నిర్ణయమని అందులో మాకు ఎటువంటి సమస్య లేదని ఇషాక్ దార్ అన్నారు.
Readmore: https://teluguprabha.net/international-news/india-china-border-talks-candid-discussions/
పాకిస్తాన్ కొన్ని సంవత్సరాల క్రితమే అంతమొందించిన లష్కరే తోయిబాతో టీఆర్ఎఫ్ ని లింక్ చేయటం తప్పని ఇషాక్ దార్ భావించారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులను అరెస్ట్ చేసి ఆ సంస్థను పూర్తిగా నాశనం చేసారు అని ఎపుడు చేసే వాదననే పునరావృతం చేసారు. అంతకుముందు, పహల్గామ్ దాడులను ఖండించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మాణంలో టీఆర్ఎఫ్ ప్రస్తావనను ఇస్లామాబాద్ అడ్డుకున్నట్లు ఇషాక్ దార్ పాకిస్తాన్ పార్లమెంటుకు తెలిపారు.
టీఆర్ఎఫ్ కార్యకలాపాల గురించి పాకిస్తాన్ మరిన్ని ఆధారాలు కోరుతుందని ఇషాక్ దార్ ఆ సమయంలో తెలిపారు. యూఎన్ఎస్సీ ప్రకటనలో టీఆర్ఎఫ్ ను చేర్చడాన్ని సమర్థించడానికి ఆ సమయంలో దానికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు అందుబాటులో లేవని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అన్నారు.
జనవరి 2023లో చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం కింద భారతదేశం టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. దక్షిణాసియా ఉగ్రవాద పోర్టల్ ప్రకారం, 2019లో సోషల్ మీడియా ప్రకటనల ద్వారా టీఆర్ఎఫ్ ఉద్భవించింది. అప్పటి నుండి, జమ్మూ కాశ్మీర్ అంతటా అనేక దాడులకు టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది. శ్రీనగర్‌లో గ్రెనేడ్ దాడి చేయటం.. అందులో ఏడుగురు పౌరులు గాయపడటం జరిగింది. అలాగే 2021లో హత్యలు చేయటమే లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది.
అంతర్జాతీయంగా టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని భారతదేశం నిరంతరం ఒత్తిడి చేసింది. 2024 మే, నవంబర్ నెలలలో యూఎన్ యొక్క 1267 ఆంక్షల కమిటీ పర్యవేక్షణ బృందానికి ఆధారాలు, ప్రాతినిధ్యాలను సమర్పించింది.


