భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) కన్నుమూతపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సంతాప సందేశాన్ని విడుదల చేశారు. మన్మోహన్ సింగ్ వ్యూహాత్మక ముందుచూపు, రాజకీయ ధైర్యంతో భారత్-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరో స్థాయికి చేర్చారంటూ కొనియాడారు. అంకితభావం ఉన్న ప్రజాసేవకుడు, దయాగుణం, వినమ్రత కలిగిన వ్యక్తి అని కీర్తించారు.
ఆయనను కోల్పోయిన ఈ కష్టకాలంలో భారత ప్రజలతో పాటు తాము కూడా దుఃఖిస్తున్నాం. మన్మోహన్ సింగ్ దార్శనికతను గుర్తుచేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మన్మోహన్ భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు పిల్లలు, భారతదేశ ప్రజలందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని వెల్లడించారు. అమెరికా-భారత్ పౌర అణు ఒప్పందం నుంచి ఇండో-పసిఫిక్ భాగస్వామ్య దేశాల మధ్య క్వాడ్ కూటమిని ఏర్పాటు చేయడం వరకు ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. భవిష్యత్ తరాల కోసం ఇరు దేశాలను, ప్రపంచాన్ని పటిష్ఠం చేయడంలో పురోగతికి ఆయన బాటలు వేశారని గుర్తుచేశారు. ఈ మేరకు వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.