Jacinta Price Anti-Indian Remarks: ఆస్ట్రేలియాలో భారత సంతతి ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సెనెటర్ జసింటా నంపిజిన్పా ప్రైస్‌పై ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ తీవ్రంగా స్పందించారు. సెంటర్-రైట్ లిబరల్ పార్టీకి చెందిన ఈ సెనెటర్, దేశంలో జీవన వ్యయం పెరగడానికి భారత వలసదారులు కారణమని, అధికార లేబర్ పార్టీ ఓట్ల కోసం భారతీయులను పెద్ద సంఖ్యలో దేశంలోకి రప్పిస్తోందని ఆరోపించారు. “భారతీయ కమ్యూనిటీ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది లేబర్ పార్టీకి వచ్చే ఓట్లలో స్పష్టంగా కనిపిస్తోంది” అని ఆమె ఒక రేడియో ఇంటర్వ్యూలో అన్నారు. ఈ వ్యాఖ్యలు ఆస్ట్రేలియా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ALSO READ: Heart Attack: గుండెపోటుతో కుప్పకూలుతున్న యువత.. గణేష్ నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ కానిస్టేబుల్ మృతి
ఈ వ్యాఖ్యలపై ఆస్ట్రేలియాలోని భారత సంతతి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జసింటా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. లిబరల్ పార్టీ నాయకులైన జూలియన్ లీసర్, అలెక్స్ హాక్, బర్నబీ జోయిస్‌లు సైతం ఆమె వ్యాఖ్యలను ఖండించారు. లీసర్ తన స్వస్థలంలో హిందీ భాషా ఈవెంట్‌లో ఆమె తరపున క్షమాపణ చెప్పారు. అయితే, జసింటా క్షమాపణ చెప్పలేదు, కేవలం తన వ్యాఖ్యలను “స్పష్టంగా చెప్పలేదని” అన్నారు.
ప్రధాని ఆల్బనీస్ స్పందిస్తూ, “ఈ వ్యాఖ్యలు భారత సమాజాన్ని బాధించాయి. అవి నిజం కాదు, ఆమె క్షమాపణ చెప్పాలి. ఆమె సొంత పార్టీ నాయకులు, కమ్యూనిటీ నాయకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు” అని ABC రేడియోలో అన్నారు. 2023 లెక్కల ప్రకారం, ఆస్ట్రేలియాలో 8,45,800 మంది భారత సంతతి వ్యక్తులు ఉన్నారు, ఇది గత దశాబ్దంలో రెట్టింపైంది.
న్యూసౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్, భారత కమ్యూనిటీ గ్రూపులతో సమావేశమై, “ఇటీవలి రేసిస్ట్ వ్యాఖ్యలు, విభజన సృష్టించే ఆరోపణలకు మా రాష్ట్రంలో స్థానం లేదు” అని హామీ ఇచ్చారు. భారత విదేశాంగ శాఖ కూడా ఈ విషయంపై ఆస్ట్రేలియా ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఈ వివాదం ఆస్ట్రేలియా-భారత సంబంధాలపై చర్చను రేకెత్తించింది.


