China’s dual-language media strategy on India : డ్రాగన్ దేశం చైనా ఎత్తుగడలు ఎప్పుడూ ఓ మిస్టరీనే. పాము కరిచిన తర్వాతైనా మందుంటుందేమో కానీ, చైనా వేసే పన్నుగడలను అర్థం చేసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు ఆ దేశ మీడియా కూడా అదే బాటలో నడుస్తూ, భారత్‌పై ఓ కొత్త తరహా ‘మానసిక యుద్ధానికి’ తెరలేపింది. అంతర్జాతీయ సమాజం కోసం ప్రచురించే ఆంగ్ల పత్రికల్లో భారత్‌పై ప్రేమ ఒలకబోస్తూ, అదే సమయంలో తమ దేశ ప్రజల కోసం స్థానిక ‘మాండరిన్’ భాషలో మాత్రం విషం చిమ్ముతోంది.
ఒకే వార్త.. రెండు కథనాలు : భాష ఏదైనా వార్తలోని సారం ఒకటే ఉండాలి. కానీ చైనా ప్రభుత్వ నియంత్రణలో నడిచే మీడియా, ఈ ప్రాథమిక సూత్రాన్ని గాలికి వదిలేసింది. ప్రత్యేకించి భారత్‌కు సంబంధించిన సున్నితమైన అంశాలపై రెండు రకాల కథనాలను ప్రచురిస్తోంది.
ఆంగ్ల మీడియాలో సాఫ్ట్ టోన్: అంతర్జాతీయ సమాజం, దౌత్యవేత్తలు, విదేశాల్లోని చైనీయులు చదివే ఆంగ్ల పత్రికల్లో (ఉదా: గ్లోబల్ టైమ్స్, జిన్హువా ఇంగ్లిష్) భారత్‌తో స్నేహాన్ని కోరుకుంటున్నట్లు, ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు, సామరస్యపూర్వక వాతావరణాన్ని ఆశిస్తున్నట్లు వార్తలు రాస్తారు.
మాండరిన్ మీడియాలో హార్డ్ టోన్: అదే వార్తను, చైనా ప్రజలు చదివే మాండరిన్ భాషా పత్రికల్లో మాత్రం పూర్తి వ్యతిరేక కోణంలో, రెచ్చగొట్టే విధంగా ప్రచురిస్తారు. భారత్‌ను ఓ ప్రత్యర్థిగా, దురాక్రమణదారుగా చిత్రీకరిస్తూ, చైనా సైన్యం, ప్రభుత్వ పరాక్రమాన్ని కీర్తిస్తూ సొంత వ్యాఖ్యానాలను జోడించి కథనాలు వండి వారుస్తారు.
నిఘా విశ్లేషకుల హెచ్చరిక: “ఈ రెండు నాల్కల ధోరణి అత్యంత ప్రమాదకరమైనది. ప్రపంచం చైనా ఆంగ్ల మీడియాను చూసి, అంతా సవ్యంగా ఉందని భ్రమిస్తుంటుంది. కానీ, మాండరిన్ మీడియా ద్వారా చైనా తన ప్రజల్లో భారత వ్యతిరేక భావజాలాన్ని బలంగా నాటుతోంది,” అని ప్రముఖ భద్రతా విశ్లేషకులు బ్రిగేడియర్ రాకేష్ భాటియా హెచ్చరించారు.
కొన్ని సంచలన ఉదాహరణలు..
గల్వాన్ ఘర్షణ (2020): గల్వాన్ ఘర్షణల సమయంలో, మాండరిన్ మీడియా “భారత్‌కు బుద్ధి చెప్పాం” అంటూ చైనా సైన్యాన్ని (PLA) హీరోలుగా కీర్తిస్తూ కథనాలు రాసింది. అదే సమయంలో, ఆంగ్ల మీడియాలో మాత్రం “ఉద్రిక్తతలు తగ్గించడానికి భారత్‌తో చర్చలు జరుపుతున్నాం” అని చాలా మృదువైన స్వరంతో వార్తలు ప్రచురించింది.
డోక్లాం ప్రతిష్టంభన (2017): డోక్లాం వివాదం అప్పుడు, “దిల్లీకి 1962 కంటే చేదు పాఠం నేర్పించాలి” అని మాండరిన్ మీడియా విషం కక్కింది.
చైనా మంత్రి భారత పర్యటన: ఇటీవలి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటనపై, “చైనా సత్తాకు భారత్ తలొగ్గింది” అని మాండరిన్ మీడియా రాయగా, “భారత్‌తో నిర్మాణాత్మక చర్చలు” అని ఆంగ్ల మీడియాలో రాసుకొచ్చారు. అంతేకాదు, “వన్ చైనా పాలసీకి భారత్ మద్దతు తెలిపిందని” ఆంగ్ల మీడియాలో అబద్ధపు వార్తను ప్రచురించగా, భారత ప్రభుత్వం దానిని ఖండించాల్సి వచ్చింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
భారత్ ఏం చేయాలి : మాండరిన్ భాషపై పట్టున్న నిపుణులతో ఒక ప్రత్యేక పర్యవేక్షక వ్యవస్థను ఏర్పాటు చేయడమే దీనికి విరుగుడు అని నిపుణులు సూచిస్తున్నారు.
“తైవాన్‌కు చెందిన అకాడెమియా సినికా వంటి సంస్థలకు మాండరిన్ మీడియాను డీకోడ్ చేయడంలో అపారమైన అనుభవం ఉంది. వారి సహకారంతో, చైనా మీడియాలో వచ్చే ప్రతికూల కథనాలను ఎప్పటికప్పుడు అనువదించి, వాస్తవాలను వెలికితీసి, అంతర్జాతీయ వేదికలపై చైనా కుట్రలను ఎండగట్టాలి. తద్వారా డ్రాగన్ తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయవచ్చు,” అని బ్రిగేడియర్ రాకేష్ భాటియా సూచించారు.


