Wednesday, October 30, 2024
Homeఇంటర్నేషనల్China politics in Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ లో చైనా సరికొత్త పేర్లు

China politics in Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ లో చైనా సరికొత్త పేర్లు

రిప్లై గట్టిగా ఇవ్వాలన్న ప్రధాని

గిల్లికజ్జాలు పెట్టుకోవడంలో చైనా మొదటి స్థానంలో ఉంటుంది. ఎన్నికల వేళ భారతదేశంతో మరో వివాదానికి చైనా తెరతీసింది. ఏదో విధంగా పొరుగు దేశాలను ఇబ్బందుల్లో పెట్టడానికి, ఇరకాటంలో పెట్టడానికి చైనా శతధా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఒక పక్క భారతదేశం, మరోపక్క తైవాన్, మరో పక్క టిబెట్, ఫిలిప్పీన్స్ తదితర పొరుగు దేశాలను క్షణంగా ప్రశాంతంగా నిద్రపోనివ్వకూడదనేది దాని విధానం. కొత్తగా అది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ ఒక సమస్యను మొదలు పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ లోని 30 ప్రదేశాలకు చైనా మళ్లీ తమ పేర్లు పెట్టుకుంది. 2017 తర్వాత చైనా ఇటువంటి దుండగానికి, అక్రమానికి పాల్పడడం ఇది నాలుగవసారి. ఇక్కడి పేర్లను ప్రామాణికం చేస్తున్నట్టు చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారతదేశ భూభాగమైన అరు ణాచల్ ప్రదేశ్ మీద తమకు హక్కు ఉన్నట్టు చెప్పడానికే చైనా ఈ విధంగా పేర్లు పెడుతోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. చైనా యావత్ అరుణాచల్ ప్రదేశ్ ను ‘దక్షిణ టిబెట్’గా పరిగణిస్తోంది. చైనా తన దేశ పటంలో కూడా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తమ భూభాగం కిందే చూపించడం జరుగుతోంది. సేలా కనుమ కింద నిర్మించిన సేలా సొరంగాన్ని ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్లిన సమయంలోనే చైనా ఈ విధంగా రాష్ట్రంలోని ప్రాంతాలకు తమ పేర్లను పెట్టడం గమనించాల్సిన విషయం. వాతావరణం ఎలా ఉన్నప్పటికీ గువాహతి, తవాంగ్ ల మధ్య పౌరులు, సైనికులు ప్రయాణించడానికి వీలుగా ఈ సొరంగాన్ని నిర్మించడం
జరిగింది. ఈ ప్రాంతంలో సరిహద్దులను కాపలా కాయడంతో పాటు పౌరులకు భద్రత కూడా కల్పిస్తున్న భద్రతా దళాలకు ఈ సొరంగం ఎంతగానో వెసులుబాటు కల్పిస్తోంది.

- Advertisement -

ఈ సేలా సొరంగాన్ని నిర్మించడాన్ని చైనా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడాన్ని భారత ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండించింది. చైనా ప్రభుత్వం తమకు తోచినప్పుడల్లా ఇక్కడి ప్రాంతాలకు తమ పేర్లు పెట్టడం అసందర్భంగా, అనౌచిత్యంగా ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. ఇక్కడ పేర్లు మార్చినంత మాత్రాన ఆ ప్రాంతం చైనా ప్రాంతంగా మారిపోదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని కూడా తేల్చి చెప్పింది. పేర్లు మార్చినంత మాత్రాన అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలు చైనా భూభాగాలయిపోవని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. భారత, చైనా దేశాల మధ్య చాలాకాలంగా నలుగుతున్న సరిహద్దు వివాదం ఈ విధంగా అనేక సమస్యలకు దారితీస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకు తమ పేర్లు పెట్టడం, తమ దేశ పటంలో అరుణాచల్ ప్రదేశ్ ను చేర్చడం వంటి చర్యల ద్వారా చైనా తమకు సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడం మీద ఏమాత్రం ఆసక్తి లేదనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఒకవేళ సరిహద్దు వివాదం పరిష్కారమైనా అది తమకు అనుకూలంగా మాత్రమే పరిష్కారం కావాలని కూడా చైనా ప్రభుత్వం ఆశిస్తోంది.

ఉదాహరణకు, 2020లో చైనా సైన్యం తూర్పు లడఖ్ ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చింది. ఈ సైన్యాన్ని భారత సైన్యం నిరోదించింది. అయితే, ఆ తర్వాత ఉభయ దేశాల మధ్య కమాండర్ స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ రెండు దేశాల మధ్య కొంత భూభాగాన్ని ఎవరికీ చెందని ప్రాంతంగా పరిగణించాలని ఉభయ దేశాలు నిర్ణయించాయి. అయినప్పటికీ చైనా ఈ ప్రాంతాల్లో చొచ్చుకు వస్తూనే ఉంది. భారత్ మాత్రం ఈ ఎవరికీ చెందని ప్రాంతంలోకి ఇంత వరకూ ప్రవేశించ లేదు. తూర్పు లడఖ్ సమస్య చాలావరకు పరిష్కారమైపోయిందని, ఇక భారత్, చైనాలు ఇతర సమస్యల గురించి చర్చలు జరపాలని, తమ సంబంధాలను పునరుద్ధరించుకోవాలని చైనా భావిస్తోంది. నిజానికి చైనా పేర్లు మార్చడం, దేశ పటంలో కలుపుకోవడం వంటి తుచ్ఛమైన కార్యకలా పాలకు పాల్పడుతున్నంత కాలం ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం లేదు. తైవాన్ విషయంలో చైనా వ్యవహరిస్తున్న తీరును బట్టి, సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడం అన్నది చైనా ప్రాధాన్య అంశాల్లో ప్రధానమైంది కాదు. ఇటువంటి చౌకబారు వ్యూహాలు, చర్యలు చైనా స్థాయికి తగ్గవి కావు.

దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా చైనా సాగిస్తున్న అకృత్యాలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల తన చైనా పర్యటనలో ఖండించారు. చైనా ఆగడాలను నుంచి ఫిలిప్పీన్స్ సార్వభౌమత్వాన్ని, సరిహద్దులను కాపడడానికి తాము అండగా ఉంటామని, వీలైనంతగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా జైశంకర్ చెప్పారు. అయితే, తమ మధ్య ఉన్నది అసలు సిసలు సరిహద్దు సమస్య అని, తాము ఈ విషయంలో రాజీపడేది లేదని, తాము పాకిస్థాన్ వంటి వాళ్లం కాదని చైనా ఈ మధ్య భారత్ కు స్పష్టం చేయడం జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News