Monday, May 13, 2024
Homeనేషనల్Manmohan Singh: మార్గదర్శకుడు మన్మోహన్ సింగ్

Manmohan Singh: మార్గదర్శకుడు మన్మోహన్ సింగ్

తిరుగులేని దేశభక్తుడు

భారతదేశ చరిత్రలో మరచిపోలేని వ్యక్తి మన్మోహన్ సింగ్. దేశానికి దిశా నిర్దేశం చేసిన వ్యక్తి ఆయన. రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎగువ సభ కోసమే పుట్టిన వ్యక్తిలా కనిపిస్తారు. విద్యావంతుడు, ప్రజ్ఞావంతుడు, మేధావి, హుందాతనం మూర్తీభవించిన వ్యక్తి. బాగా ఆలోచించి గానీ ఏ పనీ చేయరు. ఎక్కడా తొణకరు, బెణకరు. నిబ్బరంగా, నిదానంగా ఉంటారు. అన్నిటికీ మించి మంచి వక్త. విషయ పరిజ్ఞానంలో ఆయనను మించినవారు లేరు. ఆయన రాజ్యసభలో ఉంటే చాలు, రాజ్యసభ గౌరవ మర్యాదలు ఇనుమడించేవి. ఆయన నిబద్ధత ఏ స్థాయిలో ఉండేదంటే, ఆయన ఏనాడూ సభకు గైర్హాజర్ అయిన పాపాన పోలేదు. సభకు క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. వృద్ధాప్యంలో కూడా ఆయన చక్రాల కుర్చీలో సభకు హాజరు కావడం చూస్తే ఆయన అంకితభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. సభలో ఆయన ఎన్నడూ అరుపులు కేకలు పెట్టలేదు. ఏనాడూ వెల్ లోకి దూసుకు వెళ్లలేదు. సభా నిబంధనలను ఏనాడూ ఉల్లంఘించలేదు. ఆయన మాట్లాడినా, మాట్లాడకపోయినా సభ్యతా సంస్కారాలు ఉట్టిపడేవి. పార్లమెంటులో సభ్యుల ప్రవర్తన నానాటికి దిగజారుతున్న సమయంలో, సభ్యుల కారణంగా పార్లమెంటు ప్రతిష్ఠే దిగజారుతున్న క్రమంలో ఆయన అత్యద్భుతమైన, సంస్కారవంతమైన నడవడికతో సభా గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేశారు. పార్లమెంటు ఉభయ సభలు ప్రజా సమస్యలను చర్చించడానికే తప్ప అరుపులు, కేకలు పెట్టడానికి, అసభ్యంగా వ్యవహరించడానికి ఉద్దేశించినవి కావని ఆయన పదే పదే చెబుతుండేవారు. ఏ విధంగా చూసిన ఆయన ఒక అరుదైన పార్లమెంటేరియన్.

- Advertisement -

ఆయన రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేయడంతో ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితానికి తెరపడింది. ప్రధానమంత్రిగా, ఆర్థికమంత్రిగా, రిజర్వు బ్యాంక్ గవర్నర్ గా, ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ప్రధానమంత్రికి సలహాదారుగా, ఆర్థిక నిపుణుడుగా, విద్యావేత్తగా దేశానికి అందించిన సేవలు అరుదైనవి, అపురూపమైనవి, చిరస్మరణీయమైనవి. ఆయన ఏ పదవిని నిర్వహించినా ఆ పదవి మీద తన ప్రత్యేక ముద్రను వేసేవారు. అటువంటి స్థాయి, హోదా, ప్రత్యేకత కలిగిన వ్యక్తి ప్రజా జీవితంలో లేకుండా పోవడమనేది దేశానికి తీరని వెలితి. ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు కొలువులో ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో ఆయన దేశాన్ని లైసెన్స్ రాజ్ ఊబి నుంచి బయటకు తీసుకు రావడానికి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడంతో దేశాభివృద్ధి ఒక కీలక మలుపు తిరిగింది. ఆర్థిక వ్యవస్థకు ఆయన చేసిన దిశానిర్దేశమే దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేసింది. అప్పటి దాకా అణగారిన స్థితిలో, నిద్రాణంగా ఉన్న స్థితిలో బాగా వెనుకబడి ఉన్న భారతదేశం ఒక్కసారిగా జూలు విదల్చుకుని ప్రగతి పథంలో పరుగులు పెట్టింది.

ఇక 2004లో ఆయన విచిత్ర పరిస్థితుల్లో ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత సుదీర్ఘకాలం దేశాన్ని పాలించినవారిలో ఒకరుగా మన్మోహన్ సింగ్ గుర్తింపు పొందారు. గ్రామీణ ఉపాథి హామీ పథకాన్ని చేపట్టడం, సమాచార హక్కు చట్టాన్ని తీసుకు రావడం, భారత-అమెరికా అణు ఒప్పందాన్ని కుదర్చుకోవడం, తాను తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణలను స్థిరీకరించడం ఆయన శక్తిసామర్థ్యాలకు అద్దం పట్టడంతో పాటు, ఆయన లోని జాతీయవేత్తను వెలుపలికి తీసుకు వచ్చాయి. ఆయన హయాంలోనే భారతదేశం ప్రపంచ దేశాల మధ్య ఒక ప్రత్యేక గుర్తింపును పొందడం ప్రారంభించింది. ఆయన రెండవ పర్యాయం ప్రధాని పదవిని చేపట్టినప్పుడు
అవినీతి, అసహనం, నిర్ణయరాహిత్యం వంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన పదవిలో ఉన్నంత కాలం అన్నీ సానుకూల పరిణామాలే చోటు చేసుకున్నాయనడంలో సందేహం లేదు. ఆయన చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన భారతదేశ చరిత్రలో చిరస్మరణీయుడిని చేశాయి.

నిజానికి, ఒక వ్యక్తి వైభవాన్ని, ప్రాధాన్యాన్ని, ప్రాభవాన్ని మదింపు చేయడానికి పదవీ విరమణ అనేది సరైన సందర్భం కాదు. ప్రజలు, చరిత్ర తన గురించి, తన పాలన గురించి మదింపు చేయడానికి, బేరీజు వేసుకోవడానికి పదవీ విరమణ ద్వారా మన్మోహన్ సింగ్ ఒక అవకాశ మిచ్చారు. ఆయన జీవితాన్ని అంచనా
వేయడానికి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. పదవీ విరమణ చేసిన మన్మోహన్ సింగ్ సాధారణ వ్యక్తి కాదని, తిరుగులేని దేశభక్తుడని, సమకాలీన భారతదేశంలో ఒక ప్రత్యేకమైన అధినాయకుడని దేశ ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. నెహ్రూతరం నాయకుల్లో చివరి వాడైన మన్మోహన్ సింగ్ విభిన్న ఆర్థిక సూత్రాలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. ఒక అత్యుత్తమ, అత్యంత శక్తివంతమైన దేశం కోసం పరితపించిన అరుదైన నాయకుల్లో ఆయన కూడా మొదటి స్థానంలోనే ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News