Monday, November 17, 2025
Homeఇంటర్నేషనల్Trump: రణరంగంలా లాస్ ఏంజిల్స్.. ట్రంప్ సంచలన నిర్ణయం

Trump: రణరంగంలా లాస్ ఏంజిల్స్.. ట్రంప్ సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. గత మూడు రోజులుగా నగరంలో ఇమ్మిగ్రేషన్ దాడులు, అరెస్టులు, సెంట్రల్ అమెరికన్ వలసదారులపై చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారుల తీరును నిరసిస్తూ లాస్ ఏంజిల్స్(Los Angeles)లో చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతంగా మారాయి. భద్రతా దళాలతో ఆందోళనకారులు ఘర్షణకు దిగడంతో పాటు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు తగలబడ్డాయి. పరిస్థితులు చేజారిపోవడంతో 2వేల మంది నేషనల్ గార్డ్ దళాలను ట్రంప్ రంగంలోకి దింపారు.

ట్రంప్ ఆదేశాలతో నేషనల్ గార్డ్ దళాలను లాస్ ఏంజిల్స్‌‌లో మోహరించడంతో రణరంగాన్ని తలపిస్తోంది. వేలాదిగా నిరసనకారులు రహదారులను దిగ్బంధించి.. పోలీసు వాహనాలకు నిప్పంటించారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు, ఫ్లాష్ బ్యాంగ్‌లను ప్రయోగిస్తున్నారు. దీంతో నిరసనల్లో ఎక్కువ శాతం మంది ముసుగులు, మాస్కులు ధరించి ఉన్నారు. ఈ నేపథ్యంలో మాస్కులు ధరించి నిరసనల్లో పాల్గొన్నవారిని అరెస్ట్ చేయాలని ట్రంప్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ముఖానికి ముసుగులు వేసుకున్న వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయండని తన ట్రూత్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు.

వలసదారుల తరలింపుపై ట్రంప్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టేయడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికా వ్యాప్తంగా అక్రమవలసదారులను అరెస్ట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా లాస్ ఏంజిల్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల్లో 118 మందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఘర్షణలు తలెత్తాయి.

మాజీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమ్మిగ్రేషన్ అరెస్టులు, నేషనల్ గార్డుల మోహరింపు భయాందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి చర్యలు దేశ విభజనకు దారి తీస్తాయన్నారు. ఇది క్రూరమైన చర్యగా అభివర్ణించారు. ప్రజల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను కాపాడే వారికి తాను మద్దతు ఇస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad