Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పెట్టినా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో...

Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పెట్టినా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేరు.. కారణం తెలుసా?

Elon Musk’s Presidential Ineligibility: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. అమెరికా రాజకీయాల్లో నూతన చరిత్రకు తెరలేపారు. ‘ది అమెరికా పార్టీ’ పేరుతో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించినట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఎన్నాళ్లో డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య సాగిన అగ్రరాజ్య రాజకీయాల్లో మస్క్ ఎంట్రీ ఎలాంటి మార్పులు తెస్తుంది? రెండు పక్షాల నడుమ మూడో శక్తిగా ఆయన పార్టీ నిలదొక్కుకుంటుందా? అగ్రరాజ్యంలో కొత్త పార్టీ సత్తా చాటగలదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్న వేళ, ‘ది అమెరికా పార్టీ’కి ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? 

- Advertisement -


‘ది అమెరికా పార్టీ’ ఆవిర్భావం – మస్క్ ప్రణాళికలు, చట్టపరమైన చిక్కులు :ట్రంప్ ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’కు ఆమోదం తెలిపితే కొత్త పార్టీ ప్రకటిస్తానని గతంలోనే ఎలాన్ మస్క్ సంకేతాలిచ్చారు. అన్నట్లుగానే, ఆ బిల్లుకు తన తీవ్ర వ్యతిరేకతను చాటుతూ ‘ది అమెరికా పార్టీ’ని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో ప్రజాస్వామ్యం కొరవడిందని, ప్రజలకు స్వేచ్ఛను అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని మస్క్ స్పష్టం చేశారు. గతంలో ఆయన తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో నిర్వహించిన ఓటింగ్‌లో 80 శాతం మంది కొత్త పార్టీ ఏర్పాటుకు అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం.

‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’పై మస్క్ వ్యతిరేకత: ట్రిలియన్ల డాలర్ల పన్ను మినహాయింపులతో పాటు, $1.2 ట్రిలియన్ల విలువైన మెడిక్‌ఎయిడ్, ఆహార కూపన్ల కోతకు ఉద్దేశించిన ఈ బిల్లుపై మస్క్ మొదటి నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు భద్రత, రక్షణ, అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసేందుకు భారీగా నిధులు పెంచడం, ఆదాయపు పన్నులో కోతలను భర్తీ చేసుకునేందుకు అనేక సంక్షేమ, సబ్సిడీలకు కోత విధించడం వంటి అంశాలు ఈ బిల్లులో ఉన్నాయి. ఈ బిల్లు ఆర్థిక బాధ్యతారాహిత్యానికి దారితీస్తుందని, అమెరికా రుణాలు పెరుగుతాయని మస్క్ వాదిస్తున్నారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ వంటి కీలక రంగాలకు సబ్సిడీలలో కోత విధించడం వల్ల ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లాపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు వల్ల లక్షలాది ఉద్యోగాలు కోల్పోతారని, అమెరికాకు వ్యూహాత్మకంగా హాని కలిగిస్తుందని మస్క్ అభిప్రాయపడ్డారు.

పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు: ప్రస్తుతానికి మస్క్ తన పార్టీ పేరు తప్ప, దానికి సంబంధించిన పూర్తి వివరాలు, పార్టీ సిద్ధాంతాలు, విజన్‌పై స్పష్టత ఇవ్వలేదు. అయితే, అమెరికా రుణ భారం తగ్గించడం, బాధ్యతాయుతంగా ఖర్చు చేయడం, మిలటరీని ఏఐ, రోబోటిక్స్‌తో ఆధునికీకరించడం, వాక్ స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించడం వంటివి ‘ది అమెరికా పార్టీ’ విధానాలుగా ఉండవచ్చని ‘ఎక్స్’లో ఒక యూజర్ చేసిన పోస్ట్‌ను మస్క్ రీపోస్ట్ చేయడం ద్వారా తెలుస్తోంది. అమెరికన్లు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని, పరిశ్రమల వృద్ధిలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకుండా ఉండాలని మస్క్ తరచుగా చెబుతూ వస్తున్నారు.

ఎన్నికల బరిలో ‘ది అమెరికా పార్టీ’: మస్క్ 2028 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే ప్రశ్నకు, వచ్చే ఏడాదే పోటీకి దిగనున్నట్లు మస్క్ సంకేతాలు ఇచ్చారు. సెనేట్‌లో 2 లేదా 3 సీట్లు, ప్రతినిధుల సభలో 8 నుంచి 10 సీట్లపై మస్క్ గురిపెట్టినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వివాదాస్పద బిల్లులు చట్టాలు కాకుండా అడ్డుకునేందుకు ఈ మాత్రం సీట్లు ఉంటే చాలని మస్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్త పార్టీకి ఎదురయ్యే సవాళ్లు – మస్క్ అర్హత సమస్య: అమెరికాలో ఎప్పటినుంచో రెండు ప్రధాన పార్టీల (డెమొక్రాటిక్, రిపబ్లికన్) హవా నడుస్తోంది. గతంలో గ్రీన్ పార్టీ, లిబర్టేరియన్ వంటి కొత్త పార్టీలు పెద్దగా విజయవంతం కాలేకపోయాయి. జాతీయ స్థాయి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ (FEC) వద్ద కొత్త పార్టీ రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. అప్పుడే ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలకు నిధులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. మస్క్ తన పార్టీని ఇప్పటివరకు FEC వద్ద రిజిస్టర్ చేయలేదు. అలాగే, అమెరికాలోని ప్రతి రాష్ట్రంలోనూ కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం వేర్వేరు నిబంధనలు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 50 రాష్ట్రాల్లోనూ పోటీ చేయాలంటే, అన్ని రాష్ట్రాల్లోనూ బ్యాలెట్‌పై తమ అభ్యర్థి పేరు ఉండేలా చూసుకోవడం చాలా కష్టం.

మస్క్ అర్హత – అసలు అడ్డంకి: పార్టీని ఏర్పాటు చేసినా, ఎలాన్ మస్క్ స్వయంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కాదు. ఎందుకంటే, అతను దక్షిణాఫ్రికాలో జన్మించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులు అమెరికాలో జన్మించాలి (Natural Born Citizen). అంటే, అమెరికాలో పుట్టి ఉండాలి లేదా అమెరికన్ పౌరుడిగా పుట్టి ఉండాలి (ఉదాహరణకు, విదేశాల్లో జన్మించినా, తల్లిదండ్రులకు అమెరికన్ పౌరసత్వం ఉండాలి). ఈ నిబంధన మస్క్‌కు వర్తించదు. ఈ క్రమంలో, ‘ది అమెరికా పార్టీ’ని ప్రకటించడమే కాదు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయగల సమర్థవంతమైన అభ్యర్థిని వెతకడం ఇప్పుడు మస్క్‌కు అతిపెద్ద సవాల్‌గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad