చాట్‌జీపీటీ (ChatGPT) మాతృ సంస్థ ఓపెన్ ఏఐ (OpenAI) మాజీ రీసెర్చర్ సుచిర్ బాలాజీ(Suchir Balaji) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న తన నివాసంలో ఆయన(26) విగతజీవిగా కనిపించారు. కొన్ని రోజులుగా బాలాజీ కనిపించకపోవడంతో ఆయన సన్నిహితులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయన ఇంట్లో సుచిర్ డెడ్ బాడీని గుర్తించారు. నవంబర్ 26నే అతడు మృతి చెందినట్లు గుర్తించినా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.
ప్రాథమిక విచారణ అనంతరం ఆయనది ఆత్మహత్య అని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఓపెన్ ఏఐ ఆపరేషన్లు, అనుసరిస్తున్న విధానాలు ఆందోళనకరంగా ఉన్నట్లు గతంలో తన రీసెర్చ్ ద్వారా బాలాజీ వెల్లడించారు. ఆ కంపెనీ పలు కాపీ రైట్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన అనుమానాస్పద రీతిలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు సుచిర్ మృతిపై పలువురు టెక్ దిగ్గజాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.