Generation Z protests Mexico : ఒక మేయర్ దారుణ హత్య.. పెరిగిపోతున్న హింసపై యువతలో కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలు.. ఏకంగా అధ్యక్ష భవనం ముట్టడి. మెక్సికో వీధుల్లో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘జెనరేషన్-జీ’ పేరిట వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. అసలు ఎవరీ ‘జెన్-జీ’? ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి గళం విప్పడానికి కారణాలేంటి? ఈ నిరసనల వెనుక ఉన్న అసలు కథేంటి?
నిప్పు రాజేసిన మేయర్ హత్య : ఈ నెల (నవంబర్) 1వ తేదీన, పశ్చిమ రాష్ట్రమైన మికోకాన్‌లోని ఉరుపాన్ నగర మేయర్, కార్లోస్ మంజో, నేర వ్యతిరేక విధానాలకు పేరుగాంచిన వ్యక్తి. ఆయనను ‘డే ఆఫ్ ది డెడ్’ బహిరంగ కార్యక్రమంలో దుండగులు కాల్చి చంపారు. ఈ దారుణ హత్య దేశవ్యాప్తంగా యువతలో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ప్రభుత్వాలు హింసను అరికట్టడంలో విఫలమయ్యాయంటూ ‘జెనరేషన్-జీ మెక్సికో’ అనే బృందం నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో శనివారం (నవంబర్ 15) మెక్సికో సిటీతో పాటు పలు నగరాల్లో వేలాది మంది యువత ప్రదర్శనలు చేపట్టారు.
రాజధానిలో హింసాత్మక ప్రదర్శనలు : మెక్సికో సిటీలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ నివసించే నేషనల్ ప్యాలెస్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను ముసుగులు ధరించిన కొందరు నిరసనకారులు కూల్చివేశారు. దీంతో అల్లర్లను అదుపుచేసే పోలీసులకు, ప్రదర్శనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. ఈ ఘర్షణల్లో 100 మంది పోలీసులకు గాయాలయ్యాయని, వారిలో 40 మంది ఆసుపత్రిలో చేరారని మెక్సికో సిటీ ప్రజా భద్రతా కార్యదర్శి పాబ్లో వాజ్‌క్వెజ్ తెలిపారు. మరో 20 మంది పౌరులు కూడా గాయపడినట్లు, 20 మందిని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. నిరసనకారులు ప్రస్తుత అధ్యక్షురాలి పార్టీకి వ్యతిరేకంగా “మోరెనా.. గద్దె దిగు” అంటూ నినాదాలు చేశారు. “కార్లోస్ చావలేదు, ప్రభుత్వమే చంపింది” అంటూ నేరాలను, హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఎవరీ జెన్-జీ : 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని ‘జెనరేషన్-జీ’గా పరిగణిస్తారు. “మేము ఏ పార్టీకి చెందినవారం కాదు. పెరిగిపోతున్న హింస, అవినీతి, అధికార దుర్వినియోగంతో విసిగిపోయిన మెక్సికన్ యువత గొంతుక మాది,” అని నిరసనలకు పిలుపునిచ్చిన ‘జెనరేషన్-జీ మెక్సికో’ బృందం సోషల్ మీడియాలో విడుదల చేసిన తమ మేనిఫెస్టోలో పేర్కొంది.
రాజకీయ కుట్రేనంటున్న ప్రభుత్వం : అయితే, ఈ నిరసనల వెనుక రాజకీయ కుట్ర ఉందని అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మితవాద రాజకీయ ప్రత్యర్థులు ఈ ప్రదర్శనలను వ్యవస్థీకృతంగా నిర్వహించారని, సోషల్ మీడియా బాట్‌ల ద్వారా ప్రచారం చేసి యువతను తప్పుదోవ పట్టించారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.


