Greece General Strike: గ్రీస్ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకురావడానికి సిద్ధమైన నేపథ్యంలో.. దేశం మెుత్తం అగ్గిమీద గుగ్గిలాం అయింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల పని గంటలను 13కు పెంచాలని యోచిస్తున్న గ్రీస్ సర్కార్ కు ప్రజలు షాకిచ్చారు. రాజధాని ఏథెన్స్ లో వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు.
స్తంభించిన సేవలు..
బుధవారం జరిగిన ఈ సమ్మెలో కార్మిక యూనియన్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. దీని కారణంగా ఓడరేవుల్లో ఫెర్రీ సేవలు నిలిచిపోగా..ప్రభుత్వ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. నిరసనకారుల్లో కొంత మంది పాలస్తీనా జెండాలను పట్టుకుని.. గాజా యుద్ధం పట్ల వ్యతిరేకత తెలియజేశారు. అంతేకాకుండా “ఫ్రీ పాలస్తీనా” అంటూ నినాదాలు చేశారు. ప్రజలు చేపట్టిన ఈ నిరసన కారణంగా.. ఏథెన్స్ నగరంలో రవాణా స్తంభించిపోయింది. టాక్సీలు లేదా రైళ్లు నడవలేదు. రాజధానిలో బస్సులు, సబ్వే, ట్రామ్, ట్రాలీ సేవలు పరిమితంగా నడిచాయి. దీని ప్రభావం పాఠశాలలు, ఆస్పత్రులు, మున్సిపాలిటీ, కోర్టులపై కూడా పడింది.
Also Read: Nepal – నేపాల్ లో దేవతగా 2 సంవత్సరాల 8 నెలల బాలిక!
తమ హక్కులను కాలరాయడమే..
దేశంలో కొత్తగా తీసుకొస్తున్న కార్మిక చట్టాల వల్ల అనేక సమస్యలు వస్తాయని కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ చట్టాల వల్ల తాము రోజుకు 13 గంటల వరకు పని చేయాల్సి వస్తుందని కార్మికులు అంటున్నారు. న్యూ రూల్స్ ప్రకారం, ఓవర్ టైమ్‌తో సహా వారానికి గరిష్ఠంగా 48 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. అంతేకాక ఏడాదికి గరిష్ఠంగా 150 గంటల ఓవర్ టైమ్‌కే అనుమతి ఉంది. దీని కారణంగానే కార్మిక సంఘాలు ఈ కొత్త నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ రూల్స్ వల్ల తాము దోపిడీకి గురయ్యే అవకాశం ఉందని కార్మికులు అంటున్నారు. తాము 13 గంటల షిఫ్ట్ కు పూర్తిగా వ్యతిరేకం.. అంటూ ప్రైవేట్ రంగ కార్మికుల సంఘాల సమాఖ్య అయిన ది జనరల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ వర్కర్స్ ఆఫ్ గ్రీస్ ఒక ప్రకటనను రిలీజ్ చేసింది. వీక్ కు ముప్పై ఏడున్నర గంటలను(37½)ను తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది.


