Indian Railway Big Alert to Passengers: దేశమంతా దీపావళి పండుగ జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలొనే ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, దీపావళి అంటేనే టపాసుల మోత. చిన్న పెద్ద తేడా లేకుండా టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, టపాసులను పెద్ద ఎత్తున తీసుకెళ్లడం వల్ల ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది. అందుకే, దీపావళి పండుగ నేపథ్యంలో రైల్వే ప్రయాణాలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు జారీ చేసింది. ట్రైన్‌లలో ప్రయాణించేప్పుడు ప్రయాణీకులు.. భద్రతకు, రైల్వే ఆస్తులకు నష్టం వాటించే మండే స్వభావం గల వస్తువులు ,పేలుడు పదార్దాలను తీసుకెళ్లొద్దని హెచ్చరించింది. నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత వస్తువును ట్రైన్‌లో తీసుకెళ్తే రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 164, 165 ప్రకారం రూ.1000 వరకు జరిమానా లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. రైళ్లలో లేదా స్టేషన్లలో పేలుడు పదార్థాలు, టాపాసులను క్యారీ చేయడం వల్ల భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తుందని.. ఇది చుట్టుపక్కల ఉన్న ప్రయాణీకులందరికీ అత్యంత ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు. అందుకే, రైలులో మండే, పేలుడు స్వభావం గల వస్తువులను తీసుకెళ్లకూడదని హెచ్చరిస్తోంది. ప్రజా భద్రత దృష్ట్యా, రైళ్లలో లేదా స్టేషన్లలో బాణసంచా లేదా ఏదైనా ఇతర అనుమానాస్పద, ప్రమాదకరమైన పేలుడు , స్వభావం గల పదార్థాలను గమనించినట్లయితే, రైల్వే శాఖ అధికారులకు తెలియజేయాలని ప్రయాణీకులకు రైల్వే శాఖ విజ్ఙప్తి చేస్తోంది. రైల్వే సిబ్బంది లేని యెడల హెల్ప్‌లైన్ -139 నంబర్‌కు కాల్ చేయగలరని దక్షిణ మధ్య రైల్వే కోరుతోంది.
Also Read: https://teluguprabha.net/technology-news/samsung-galaxy-m17-5g-price-and-features/
రైళ్లలో తీసుకెళ్లకూడని వస్తువులు!
రైళ్లలో గ్యాస్ సిలిండర్లు, స్టవ్ లు, మండే రసాయనాలు, బాణాసంచా, యాసిడ్స్, తోలు లేదంటే తడి చర్మం, గ్రీజు, సిగరెట్లు, పేలుడు పదార్థాలు, దుర్వాసన వచ్చే పదార్థాలను తీసుకెళ్లకూడదని రైల్వే నిబంధనలు చెబుతున్నాయి. రైళ్లలో కొన్ని రకాల పండ్లను కూడా తీసుకెళ్లడం నిషేధించారు. అంతేకాదు, ప్రయాణీకులు మద్యం సేవించడం పూర్తిగా నిషేధం. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, సిగరెట్ త్రాగడం, మత్తు పదార్థాలను సేవించడం వల్ల తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే, రైల్వే నిబంధనల ప్రకారం, మద్యం సేవించి , మాదకద్రవ్యాలు తీసుకొని రైలులో ప్రయాణించకూడదు. ఒకవేళ అలా చేస్తే, రైల్వే యాక్ట్ 1989లోని సెక్షన్ 165 కింద కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, వారి టికెట్ ను వెంటనే క్యాన్సిల్ చేసి, వారి పాస్‌ను కూడా రద్దు చేయవచ్చు. ఆ వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించే అవకాశమూ ఉంది.


