కోటి ఆశలతో అమెరికా వెళ్లి.. అక్కడ చదువుకుంటూనే ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవడం ఒక్క భారతీయులే కాదు.. చాలామంది ఇతర దేశాల వారికి అలవాటు. డాలర్ రోజురోజుకూ బలపడుతుండడంతో వివిధ దేశాల కరెన్సీ విలువలు తగ్గిపోతున్నాయి. మన రూపాయి విషయమే చూసుకుంటే ఒక్క డాలరుకు రూ.86.21 చొప్పున ఉంది. దాంతో, అక్కడ చదువుతో పాటు ఇంటి అద్దె, తినడానికి, యూనివర్సిటీకి వెళ్లి రావడానికి అయ్యే ఖర్చులు చూసుకున్నా ఒక్కొక్కరికి సుమారుగా నెలకు 700 డాలర్ల వరకు అవుతుంది. అంటే సుమారు రూ.60వేలు. యూనివర్సిటీ ఫీజుల వరకు ఎలాగోలా ఎడ్యుకేషన్ లోన్ సాయంతో పంపినా, ప్రతినెలా ఇలా ఖర్చులకు రూ.60వేల చొప్పున పంపడం అంటే ఇండియాలో ఉండే తల్లిదండ్రులకు కచ్చితంగా భారమే అవుతుంది. అందుకే చాలామంది అక్కడ చదువుకుంటూనే ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటారు. గ్రోసరీ స్టోర్లు, పెట్రోలు బంకులు, రెస్టారెంట్లలో పనిచేయడం దగ్గర నుంచి ఇళ్లు క్లీన్ చేయడం, ఇళ్లు సర్దడం, వంట చేసి పెట్టడం, బేబీ సిట్టింగ్.. ఇలా రకరకాల ఉద్యోగాలు చేస్తారు. గంటకి కనిష్ఠంగా 7 డాలర్ల నుంచి గరిష్ఠంగా 20 డాలర్ల వరకు ఇస్తారు. మంచి ఉద్యోగం వచ్చేవరకు అదే వారికి జీవనాధారం అవుతుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇమిగ్రేషన్ నిబంధనలను బాగా కఠినతరం చేసేశారు. అక్రమ వలసలపై కొరడా ఝుళిపిస్తున్నారు. నిజానికి పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం అక్కడి చట్టాల ప్రకారం తప్పు. ఇప్పుడు అలా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఎవరైనా అధికారుల కంటబడితే ఎక్కడ తమను అక్రమ వలసదారులుగా ముద్రవేసి తిరిగి పంపేస్తారోనన్న భయంతో.. ఇప్పుడు చాలామంది భారతీయ యువతీ యువకులు పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తున్నారు. ఎందుకంటే, ట్రంప్ సర్కారు ఇప్పటికే 538 మందిని అక్రమ వలసదారులుగా గుర్తించి, వారిని అప్పటికప్పుడు సైనిక విమానాలు పెట్టి మరీ వారి వారి దేశాలకు డిపోర్ట్ చేసేసింది.
“మా అమ్మానాన్న అప్పు చేసి మమ్మల్ని ఇక్కడిదాకా పంపారు. ఇప్పుడు చూస్తే ఇక్కడ రెసిషన్ అంటున్నారు. అందువల్ల మంచి ఉద్యోగం రావడానికి టైం పడుతుంది. అలాగని అప్పటివరకు ప్రతినెలా డబ్బులు పంపాలని అమ్మానాన్నలను అడగలేం కదా. అందుకే ఇక్కడ పార్ట్ టైం చేసుకుంటాం. నాకు గంటకు 7 డాలర్లు వస్తాయి. రోజుకు ఆరు గంటలు పనిచేస్తా. అలా వారానికి 5 రోజులు పని దొరుకుతుంది. దాంతో నెల ఖర్చులన్నీ వచ్చేస్తాయి. ఇన్నాళ్లూ ఇలా బాగానే సాగిపోయింది. కానీ, ఇప్పుడు అధికారులు చాలా స్ట్రిక్ట్‌గా చూస్తున్నారు. దాంతో నేను పని మానేశాను. ఎందుకంటే, నా చదువు కోసం 50వేల డాలర్లు.. అంటే సుమారు రూ.42 లక్షల అప్పు చేశారు. నేను మంచి ఉద్యోగం రాకముందే డిపోర్ట్ అయితే ఆ అప్పు తీర్చడం ఎవరివల్లా కాదు. అందుకే రిస్కు తీసుకోలేక ఊరుకుంటున్నా” అని గుడివాడకు చెందిన తేజ తెలుగుప్రభకు చెప్పాడు. అతడు టెక్సస్‌లో ఉంటూ మరో మూడు నెలల్లో మాస్టర్స్ పూర్తిచేసుకోబోతున్నాడు.
వీసా నిబంధనలు ఏమంటున్నాయి
విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించడానికి ఇచ్చే ఎఫ్-1 వీసా నిబంధనల ప్రకారం వాళ్లు తమ యూనివర్సిటీలో వారానికి 20 గంటలు ఏదో ఒక పార్ట్ టైం చేసుకోవచ్చు. అయితే, అందరికీ యూనివర్సిటీలోనే పార్ట్ టైంలు దొరకడం కష్టం. అందుకే బయటకు వెళ్తారు. కానీ ఇప్పుడు అధికారులు నిబంధనలు బిగించడంతో.. యూనివర్సిటీల్లో కూడా పార్ట్ టైంలు ఎవరూ చేయట్లేదు.
హైదరాబాద్‌కు చెందిన సంయుక్త న్యూయార్క్‌లో చదువుతోంది. ఆమె ఇదే విషయమై మాట్లాడుతూ, “నాతో పాటు చాలామంది స్నేహితులు పార్ట టైం చేయడం మానేశాం. మేం మా స్టూడెంట్ వీసా పోగొట్టుకోలేం. నా తల్లిదండ్రులు ఇప్పటికే నన్ను ఇక్కడివరకు పంపడానికి చాలా త్యాగాలు చేశారు. అమెరికా అధికారులు రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు, గ్రోసరీ స్టోర్లలో తనిఖీలు చేస్తున్నారని అందరూ అంటున్నారు. వాళ్లకు పట్టుబడితే ఇక అంతే సంగతి” అని ఆవేదన వ్యక్తం చేసింది.
రిటర్న్ టికెట్ లేదని.. రానివ్వలేదు!
భారతదేశానికి చెందిన ఒక జంట.. అమెరికాలో చదువుతున్న తమ కుమారుడి వద్దకు వెళ్దామని వీసా తీసుకుని మరీ విమానం ఎక్కారు. నెవార్క్ విమానాశ్రయంలో దిగిన తర్వాత.. అక్కడున్న ఇమిగ్రేషన్ అధికారులు వాళ్లను ఎందుకు వచ్చారు, ఎన్నాళ్లు ఉంటారని అడిగారు. సుమారు ఒక ఐదు నెలలు ఉండి, అమెరికా చూసి వెళ్లిపోతామని చెప్పారు. మరి రిటర్న్ టికెట్ ఉందా అని అడిగితే, లేదు.. కొనుక్కుంటామన్నారు. అది కుదరదని, రిటర్న్ టికెట్ ఉంటేనే అమెరికాలో ప్రవేశించాలి తప్ప.. అది లేకపోతే తిరిగి వెళ్లిపోవాలంటే విమానాశ్రయం నుంచే వారిని తిప్పి పంపేశారు! దాంతో లక్షలు పోసి తీసుకున్న టికెట్లు ఎందుకూ పనికిరాకుండా పోయాయని, వీసా కూడా ఉన్నా ఇవెక్కడి నిబంధనలని ఆ జంట ఉసూరుమంది.
భారతీయుల్లో భయాందోళనలు
హెచ్1-బి వీసాలు ఉండి, అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులు కూడా ఇమిగ్రేషన్ విధానాల్లో మార్పులు చూసి తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎందుకంటే చాలామంది ఈ వీసాల మీదే ఉద్యోగాలు చేస్తూ, పెళ్లి చేసుకుని, అక్కడే పిల్లల్ని కన్నారు. కొంతమంది అయితే అక్కడ ఇల్లు కూడా కొనుక్కున్నారు. దానికి ఇంకా ఈఎంఐలు కడుతూనే ఉన్నారు. అయితే, ఇప్పుడు ట్రంప్ రాకతో ఎప్పుడు ఎలా మారతాయో తెలియని ఇమిగ్రేషన్ నిబంధనలు చూసి హడలెత్తిపోతున్నారు. హెచ్1-బి వీసా పరిమితి మూడేళ్లు. దాన్ని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాలి. అలాగే వారి భాగస్వాములు డిపెండెంట్ వీసా మీద వచ్చి ఉంటే.. వారు ఎలాంటి పనులు, ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు. ఇవన్నీ చూసి అమెరికాలో ఉన్న వేర్వేరు దేశాల వారు.. ముఖ్యంగా భారతీయులు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు.
(తెలుగుప్రభ ప్రత్యేక ప్రతినిధి)