Iran Rejects Trump’s Ceasefire Announcement: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య గత 12 రోజులుగా కొనసాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన “పూర్తి స్థాయి కాల్పుల విరమణ” ఒప్పందాన్ని ఇరాన్ ఖరాఖండిగా తిరస్కరించింది. ఈ యుద్ధానికి కారణం ఇజ్రాయెలేనని, ప్రస్తుతం కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం కుదరలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి సోషల్ మీడియా వేదిక Xద్వారా స్పష్టం చేశారు.
ట్రంప్ ప్రకటన, ఇరాన్ ఖండన : సోమవారం రాత్రి తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ట్రంప్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్, ఇజ్రాయెల్ “12 గంటల కాల్పుల విరమణ”కు అంగీకరించాయని, ఇది “12 రోజుల యుద్ధాన్ని” అంతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం, ఇరాన్ మొదట దాడులను నిలిపివేస్తే, 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా దాడులను నిలిపివేసి, 24 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగుస్తుందని ట్రంప్ వివరించారు.
అయితే, ట్రంప్ చేసిన ఈ ప్రకటనను ఇరాన్ తక్షణమే ఖండించింది. అరాగ్చి తన ప్రకటనలో, టెహ్రాన్ కాలమానం ప్రకారం ఉదయం 4 గంటలలోపు (భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30) ఇజ్రాయెల్ దాడులను నిలిపివేస్తే, తాము కూడా సైనిక చర్యలను ఆపివేస్తామని స్పష్టం చేశారు. కానీ, ఒప్పందం మాత్రం లేదని ఆయన నొక్కి చెప్పారు.
ఉద్రిక్తతలకు కారణం, కొనసాగుతున్న దాడులు : ఈ వివాదం జూన్ 12న ఇజ్రాయెల్ ఇరాన్‌లోని అణు స్థావరాలపై దాడులతో ప్రారంభమైంది. ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేస్తోందన్న ఇజ్రాయెల్ ఆరోపణలే ఈ యుద్ధానికి దారితీశాయి. శనివారం అమెరికా కూడా ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సోమవారం ఖతర్‌లోని అమెరికా ఆధీనంలోని అల్ ఉదేద్ ఎయిర్ బేస్‌పై 19 క్షిపణులను ప్రయోగించింది. అయితే, ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ట్రంప్ తెలిపారు.
కొనసాగుతున్న హెచ్చరికలు, మరణాల సంఖ్య : ఇజ్రాయెల్ దాడులను ఆపకపోతే తమ సైనిక చర్యలు కొనసాగుతాయని అరాగ్చి హెచ్చరించారు. ఈ యుద్ధంలో ఇరాన్లో ఇప్పటివరకు 950 మంది, ఇజ్రాయెల్‌లో 24 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ యుద్ధం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ట్రంప్ ఒప్పందాన్ని ఖతర్ మధ్యవర్తిత్వంతో సాధించినట్లు వైట్ హౌస్ అధికారి తెలిపినప్పటికీ, ఇరాన్ దీనిని అంగీకరించకపోవడంతో ట్రంప్ ప్రకటన సందిగ్ధంలో పడింది. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొంటుందా, లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.
Iran Rejects Ceasefire Agreement : ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనను కొట్టిపారేసిన ఇరాన్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES