Saturday, November 23, 2024
Homeఇంటర్నేషనల్Kavitha in London: అంబేద్కర్ స్ఫూర్తితో కేసీఆర్ పథకాలు

Kavitha in London: అంబేద్కర్ స్ఫూర్తితో కేసీఆర్ పథకాలు

లండన్ లో అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించిన కల్వకుంట్ల కవిత

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే నెరవేరుస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో అనేక పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు.

- Advertisement -

లండన్ పర్యటనలో ఉన్న కల్వకుంట్ల కవిత శుక్రవారం నాడు అక్కడి అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించారు. ఫెడరేషన్ ఆఫ్ అంబేద్కర్ అండ్ బుద్ధిస్ట్ అసోసియేషన్ యూకే సంయుక్త కార్యదర్శి శామ్ కుమార్ ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ…. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని తెలిపారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ముందుగానే ఊహించి దూర దృష్టితో రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను చేర్చారని చెప్పారు. తనకు అంబేద్కర్ అంటే ఆదర్శమని అన్నారు. హైదరాబాదు నడిబొడ్డున సీఎం కేసీఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయించడమే కాకుండా కొత్తగా నిర్మించిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారని, అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు.

అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో తాను 48 గంటల పాటు నిరాహార దీక్ష చేశానని గుర్తు చేశారు. ప్రజల కోసం మరింత పనిచేయాలని ఆదర్శాన్ని ఇచ్చేటటువంటి ఆహార్యం అంబేద్కర్ దని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ మేధావిగా పేరు తెచ్చుకున్న అంబేద్కర్ కేవలం దళితుల కోసం మాత్రమే పాటుపడలేదని, మహిళల హక్కుల కోసం కూడా ఆయన కృషి చేశారని తెలిపారు. పలు దేశాల్లో ఓటు హక్కు కోసం మహిళలు పోరాటం చేస్తున్నారని, కానీ భారతదేశంలో దూర దృష్టి కలిగిన నాయకులు అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ వంటి వారి వల్ల రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచే మహిళలకు ఓటు హక్కు కలిగిందని వివరించారు.

అంబేద్కర్ అంతర్జాతీయంగా ప్రభావితం చేశారని, ముఖ్యంగా మహిళా హక్కుల పట్ల అండగా నిలబడ్డారని చెప్పారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పార్లమెంటులో కేవలం 15 శాతం మాత్రమే మహిళల ప్రాతినిధ్యం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని మహిళా రిజర్వేషన్ల కోసం తాను ఉద్యమించానని గుర్తు చేశారు. ఇటీవల పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని, పార్లమెంటులో రానున్న రోజుల్లో 181 మంది మహిళలను చూడబోతున్నామని చెప్పారు. సమ్మిళిత భారతదేశ నిర్మాణం కోసం అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు కోట కల్పించలేదని, ఓ బి సి మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ల అమలుతో కేంద్ర ప్రభుత్వం జనగణన, నియోజకవర్గాల పునర్విభజనకు ముడిపెట్టిందని, కాబట్టి రానున్న ఎన్నికల్లో ప్రయోజనం పొందాలన్న ప్రయత్నంలో భాగంగానే బిజెపి ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకొచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్లు పోస్ట్ డేట్ చెక్కులా ఉందని విమర్శించారు. చెక్కు పై తేదీ లేదు కాబట్టి రిజర్వేషన్లు ఎప్పుడు అమలు అవుతావన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉందని స్పష్టం చేశారు.

యూకే భారత్ సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని తెలిపారు. చట్టాలు, శాసనాలు, చరిత్ర సంస్కృతి వంటివి రెండు దేశాలు చాలావరకు పంచుకొని ఉన్నాయని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News