Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Ken Griffin on H-1b: భారతీయ విద్యార్థులను అడ్డుకుంటే మనకే నష్టం.. అమెరికన్ బిలియనీర్ సంచలన...

Ken Griffin on H-1b: భారతీయ విద్యార్థులను అడ్డుకుంటే మనకే నష్టం.. అమెరికన్ బిలియనీర్ సంచలన వ్యాఖ్యలు

Ken Griffin on H-1b and Student Visas: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అన్ని రకాల వీసాలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌1, హెచ్-1బీ వీసాలపై అమెరికా వెళ్లాలనుకునే వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలు ప్రధానంగా విద్యార్థులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అమెరికా అంటేనే భారత్‌తో సహా ఇతర దేశాల విద్యార్థులు జంకుతున్నారు. అమెరికా బదులు ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి ప్రత్యామ్నాయ దేశాల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి యూనివర్సిటీలు కల తప్పాయి. అమెరికా వర్సిటీలకు ప్రధాన ఆదాయ వనరులుగా విదేశీ విద్యార్థులు తగ్గడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జులై, ఆగస్టు నెలల్లో అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు సగానికి పడిపోవడాన్ని బట్టి చూస్తే అక్కడి వర్సిటీల పరిస్థితి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆంక్షల నేపథ్యంలో ప్రముఖ అమెరికా ఇన్వెస్టర్, బిలియనీర్ కెన్ గ్రిఫిన్ అమెరికా ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు.

- Advertisement -

వీసా ఫీజు పెంపుతో అమెరికాకే నష్టం..

సిటాడెల్ సంస్థ సీఈఓ అయిన గ్రిఫిన్ తాజాగా బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను పంచుకున్నారు. హెచ్-1బీ వీసా పీజు పెంపు అమెరికాకు తీవ్ర నష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. వీసా ఫీజు పెంపు వల్ల భారత్ లేదా చైనా నుంచి నైపుణ్యం గల విద్యార్థులు అమెరికాకు రాకుండా ఇతర దేశాల వైపు చూసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మేధో వలస తగ్గడం ద్వారా అమెరికాకు అసలు నష్టం కలుగుతుందని జోస్యం చెప్పారు. ‘ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ స్థితి ప్రకారం, ఓ వ్యక్తిని నియమించుకునేందుకు అదనంగా లక్ష డాలర్లు చెల్లించడం పెద్ద విషయమేమీ కాదు. కానీ వీసా ఫీజుల కారణంగా భారత్ నుంచి బ్రిలియంట్ స్టూడెంట్స్ అమెరికాకు రారేమో అనేదే నా ఆందోళన. మ్యాథ్స్, ఫిజిక్స్‌లో అద్భుతమైన నైపుణ్యం గల యువత స్వదేశంలోనే ఉండిపోవచ్చని, లేదా ఇతర దేశాల వైపు చూడవచ్చని నా భయం’ అని ఆయన కీలక కామెంట్ చేశారు. అద్భుత ప్రతిభ కలిగిన విదేశీ విద్యార్థులు అమెరికాను కాక ఇతర దేశాలను ఎంచుకుంటే సృజనాత్మకతలో యూఎస్ వెనకబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మే నెలలో ఓ సందర్భంలో ఆయన దాదాపు ఇలాంటి కామెంట్స్ చేశారు. అమెరికా యూనివర్సిటీల్లో చదువుకునే విదేశీ విద్యార్థులకు చదువు పూర్తి కాగానే అమెరికా వీసా ఇచ్చేయాలని కామెంట్ చేశారు. ‘అమెరికాకు వెల్‌కమ్. ఇక్కడే ఉండండి.. మీ కెరీర్ నిర్మించుకోండి’ అనేలా విదేశీ విద్యార్థులకు స్వాగతం పలకాలని అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీకి పలుమార్లు ఎన్నికల నిధులు ఇచ్చిన గ్రిఫిన్.. అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కామెంట్స్‌ చేయడం ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad