Khalistani threats in Canada : భారత్-కెనడా మధ్య సన్నగిల్లిన సంబంధాలు మళ్లీ గాడిన పడుతున్న వేళ, ఖలిస్థానీ ఉగ్రవాదులు మళ్లీ విషం కక్కారు. కెనడాలోని వాంకోవర్‌లో ఉన్న భారత దౌత్య కార్యాలయాన్ని ముట్టడించి, ‘సీజ్’ చేస్తామంటూ నిషేధిత ‘సిఖ్ ఫర్ జస్టిస్’ (SFJ) ఉగ్రవాద సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భారత హై కమిషనర్ ఫొటోను టార్గెట్ చేస్తూ కరపత్రాలు విడుదల చేయడం, పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
‘సిఖ్ ఫర్ జస్టిస్’ (SFJ) సంస్థ ఓ కరపత్రాన్ని విడుదల చేస్తూ, గురువారం వాంకోవర్‌లోని భారత దౌత్య కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ప్రకటించింది.
హై కమిషనరే టార్గెట్: కెనడాలోని భారత హై కమిషనర్ దినిష్ పట్నాయక్ ఫొటోకు టార్గెట్ గుర్తు పెట్టి మరీ కరపత్రాన్ని విడుదల చేశారు.
ఇండో-కెనడియన్లకు హెచ్చరిక: ఆ రోజున దౌత్య కార్యాలయానికి రావొద్దని, తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని ఇండో-కెనడియన్లకు విజ్ఞప్తి చేశారు.
SFJ ఆరోపణలు: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని, భారత దౌత్య కార్యాలయం ఇప్పటికీ ఓ గూఢచార నెట్‌వర్క్‌ను నడుపుతోందని SFJ ఆరోపించింది. ఈ బెదిరింపులపై వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
గాడిన పడుతున్న వేళ.. మళ్లీ చిచ్చు : గత కొంతకాలంగా భారత్-కెనడా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ట్రూడో ఆరోపణలు: నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందంటూ అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
కొత్త ప్రధానితో సత్సంబంధాలు: కెనడాలో కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నికైన తర్వాత, ఆయన భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ఇటీవల జీ7 సదస్సులో ఇరు దేశాల ప్రధానులు సమావేశమై, దౌత్య సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని అంగీకరించారు. ఈ సానుకూల వాతావరణంలో, ఖలిస్థానీలు మళ్లీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం గమనార్హం.
కెనడా నుంచే ఉగ్ర నిధులు : ఇదిలా ఉండగా, ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలకు కెనడా నుంచే నిధులు అందుతున్నట్లు కెనడా ప్రభుత్వ నివేదికే స్వయంగా వెల్లడించడం సంచలనం సృష్టించింది. ‘2025 అసెస్‌మెంట్ ఆఫ్ మనీలాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్స్’ పేరుతో విడుదలైన ఈ నివేదిక, ‘బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్’, ‘ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్’ వంటి సంస్థలకు కెనడా నుంచే ఆర్థిక సాయం అందుతోందని స్పష్టం చేసింది.
ఈ తాజా పరిణామాల నేపథ్యంలో, కెనడా ప్రభుత్వం ఖలిస్థానీ శక్తులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందోనని అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది.


