PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. నరేంద్ర మోదీ జూలై 23 నుంచి 26 వరకు బ్రిటన్, మాల్దీవుల్లో నాలుగు రోజుల అధికారిక పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఈ నెల 23, 24వ తేదీలలో యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) లో, అలాగే 25, 26వ తేదీలలో మాల్దీవులలో పర్యటిస్తారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, భద్రత, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది.
బ్రిటన్ లో ఇరు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై అధికారికంగా ప్రధాని సంతకం చేస్తారు. ఈ ఒప్పందం రెండు దేశాలలో ఉద్యోగ అవకాశాల సృష్టి, ఆర్థిక వృద్ధి రేటు పెంపుదల, ఎగుమతుల పెరుగుదలకు దోహద పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. యూకే మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులు, అలాగే భారత దేశంలో బ్రిటిష్ ఉత్పత్తులు, సేవల లభ్యత కూడా గణనీయంగా పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Readmore: https://teluguprabha.net/international-news/pakistan-heavy-rains-due-to-monsoon/
మోదీ యూకేలో పర్యటించడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికి మూడు సార్లు పర్యటించారు. ఇప్పుడు ఇది నాలుగవసారి. యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరపనున్నారు. ఇది భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ఈ పర్యటనలో భారత్-యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించడం జరుగుతుంది. ఈ పర్యటన భారత్, యూకే దేశాల వినియోగదారులకు లాభదాయకంగా మారుతుంది.
బ్రిటన్ లో పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని మోదీ మాల్దీవులకు వెళ్తారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఆహ్వానం మేరకు మోదీ అక్కడ జరగనున్న 60వ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
Readmore: https://teluguprabha.net/international-news/kai-trump-net-worth-golf-nil-deals/
గతేడాది మాల్దీవుల అధ్యక్షుడు మయిజ్జు తీసుకున్న భారత వ్యతిరేక నిర్ణయాలు ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచాయి. ఇరు దేశాల నడుమ విభేదాల అనంతరం ప్రధాని మోదీ మాల్దీవులలో పర్యటించడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఈ పర్యటన సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది.
2024 అక్టోబరులో ముయిజ్జు భారత్ పర్యటనలో ఆమోదించిన భారత్-మాల్దీవ్స్ సమగ్ర ఆర్థిక, సముద్ర భద్రతా భాగస్వామ్యం అమలు పురోగతిని ఇరు నాయకులు సమీక్షించనున్నారు. ఈ సందర్శన భారత్ నైబర్‌హుడ్ ఫస్ట్ విధానం, విజన్ మహాసాగర్ కింద మాల్దీవులతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ పర్యటన మొదటి అడుగుగా భావిస్తున్నారు.


