అంతరిక్షం నుంచి అప్పుడప్పుడు భారీ గ్రహశకలాలు భూమి వైపు దూసుకొస్తాయి. వీటిని చూసి శాస్త్రవేత్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆశ్చర్యం, భయం చెందుతారు. తాజాగా, అలాంటి ఒక గ్రహశకలం భూమి వైపు వేగంగా దూసుకొస్తోంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ NASA ఈ గ్రహశకలం గురించి హెచ్చరిక జారీ చేసింది. దీని పేరు 2014 TN17. ఇది గంటకు 77,282 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది. ఇది గంటలో దాదాపు రెండుసార్లు భూమి చుట్టూ తిరిగేంత వేగంతో ఇది భూమివైపు తిరుగుతోంది.
ఈ గ్రహశకలం దాదాపు 165 మీటర్ల వెడల్పు ఉంటుంది. అంటే ఇది ఒక చిన్న గ్రామం కంటే రెండింతలు పెద్దది. భారీ సైజుతో భయంకరమైన వేగంతో వస్తున్నా, 2014 TN17 భూమిని ఢీకొట్టదని నిపుణులు చెబుతున్నారు. ఇది 2025 మార్చి 26న సాయంత్రం 5:04 గంటలకు భూమికి అత్యంత దగ్గరగా వస్తుంది. కానీ, అప్పుడు కూడా ఇది సురక్షితంగా 50 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోతుంది. అంటే, భూమికి చంద్రుడికి మధ్య దూరం కంటే 13 రెట్లు ఎక్కువ దూరం ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.
2014 TN17 భూమిని ఢీకొట్టకపోయినా, NASA దీన్ని ‘ప్రమాదకరంగా మారగల గ్రహశకలంగా భావిస్తోంది. ఎందుకంటే దీని పరిమాణం, భూమికి దగ్గరగా రావడం భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఇలాంటి గ్రహశకలాలు భూమిని ఢీకొంటే, అవి వినాశకరమైన నష్టాన్ని కలిగిస్తాయి. భారీ పేలుళ్లు, సునామీలు, వాతావరణ మార్పులు సంభవించే ప్రమాదం ఉంది. ఈ ఆస్టరాయిడ్ అపోలో గ్రూప్ అనే కుటుంబానికి చెందినది. ఈ కుటుంబంలోని గ్రహశకలాలు భూమికి దగ్గరగా తిరుగుతూ ఉంటాయి. వాటి కక్ష్యలు భూమి కక్ష్యను దాటుకుంటూ వెళ్తాయి. చాలా గ్రహశకలాలు భూమిని తప్పించుకుని వెళ్లినా, గురుత్వాకర్షణ శక్తులు లేదా ఇతర ఖగోళ ప్రభావాల వల్ల వాటి కక్ష్యలు ఎప్పుడైనా మారవచ్చు. భవిష్యత్తులో అవి భూమికి మరింత దగ్గరగా వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు.
NASA సెంటర్ ఫర్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ (CNEOS), ఇతర అంతరిక్ష సంస్థలు 2014 TN17 లాంటి గ్రహశకలాలను నిరంతరం ట్రాక్ చేస్తూనే ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ టెలిస్కోపులు, రాడార్ సిస్టమ్స్, ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తల డేటాను ఉపయోగించి, ఈ వస్తువులను పర్యవేక్షిస్తూ, ఏవైనా ప్రమాదాలు ఉన్నాయా అని కనిపెడుతున్నారు. 2014 TN17 ఈసారి ప్రమాదం కాకపోయినా, ఇలాంటి పరిమాణం ఉన్న గ్రహశకలం భూమిని ఢీకొంటే తీవ్ర విధ్వంసం సృష్టిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.