Nimisha Priya : యెమెన్ గడ్డపై చావు అంచున నిలిచిన ఒక భారతీయ నర్సు కథ… ఆమె జీవితం చివరి క్షణాల వైపు దూసుకుపోతుండగా, భారత సర్వోన్నత న్యాయస్థానం ఊహించని విధంగా రంగంలోకి దిగింది. ఉరిశిక్ష అమలుకు కేవలం కొద్దిరోజుల సమయం మాత్రమే ఉండగా, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, దౌత్యపరమైన చర్యల కోసం కేంద్రాన్ని ఆదేశించే పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? ఒక నర్సు యెమెన్‌కు ఎందుకు వెళ్ళింది? ఆమెపై హత్యా నేరం ఎందుకు మోపబడింది? మృతుడికి మత్తు మందు ఎందుకు ఇచ్చింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే…
వివరాల్లోకి వెళితే…
కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌కు చెందిన నిమిష ప్రియ, మెరుగైన ఉపాధి అవకాశాల కోసం 2008లో యెమెన్ దేశానికి వలస వెళ్లారు. ఆమె ఒక నర్సుగా అక్కడ తన వృత్తిని కొనసాగించారు. ఆ తర్వాత సొంతంగా ఒక క్లినిక్‌ను ప్రారంభించాలనే ఆశయంతో, యెమెన్ పౌరుడైన తలాల్ అదిబ్ మెహదీని తన వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు. అయితే, కాలక్రమేణా వారి భాగస్వామ్యం చేదు అనుభవాలను మిగిల్చింది. మెహదీ నుంచి నిమిష ప్రియకు వేధింపులు ప్రారంభమయ్యాయి. ఆర్థికపరమైన మోసాలకు పాల్పడటం, ఆమె పాస్‌పోర్ట్‌ను తన వద్దే అట్టిపెట్టుకోవడం వంటి అకృత్యాలకు మెహదీ పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
మలుపు తిరిగిన ఘటన: 2017లో, తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందాలనే ఉద్దేశ్యంతో నిమిష ప్రియ ఒక తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. మెహదీకి మత్తుమందు ఇచ్చి, ఆ సమయంలో తన పాస్‌పోర్ట్‌ను తిరిగి తీసుకోవాలని ఆమె భావించారు. అయితే, అనుకోని రీతిలో ఆమె ఇచ్చిన మత్తుమందు మోతాదు ఎక్కువగా కావడంతో, అది మెహదీ మరణానికి దారితీసింది. ఈ ఘటన యెమెన్‌లో సంచలనం సృష్టించింది. నిమిష ప్రియపై హత్య కేసు నమోదు చేసి, యెమెన్ న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం, ఆమెకు మరణశిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై నిమిష ప్రియ అప్పీల్ చేసుకున్నప్పటికీ, కింది కోర్టు తీర్పునే ఉన్నత న్యాయస్థానాలు సైతం సమర్థించాయి.
కుటుంబ ప్రయత్నాలు నిష్ఫలం: నిమిష ప్రియను కాపాడుకునేందుకు ఆమె తల్లి ప్రేమకుమారి గత ఏడాది యెమెన్‌కు వెళ్లారు. మృతుడు తలాల్ అదిబ్ మెహదీ కుటుంబంతో చర్చలు జరిపి, ‘బ్లడ్ మనీ’ (రక్తపు డబ్బు) చెల్లించి క్షమాభిక్ష పొందాలని తీవ్రంగా ప్రయత్నించారు. షరియా చట్టం ప్రకారం, హత్య కేసులలో బాధితుల కుటుంబానికి నష్టపరిహారం (రక్తపు డబ్బు) చెల్లించడం ద్వారా దోషులకు క్షమాభిక్ష లభించే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. మెహదీ కుటుంబం క్షమాభిక్షకు నిరాకరించింది. ఈ పరిణామాలతో నిమిష ప్రియ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
సుప్రీంకోర్టు జోక్యం : నిమిష ప్రియకు ఉరిశిక్ష అమలుకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో, భారత సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం కీలకంగా మారింది. నిమిష ప్రియను కాపాడేందుకు దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 14న విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ప్రకటించింది. అయితే, ఈ నెల 16నే నిమిష ప్రియకు ఉరిశిక్షను అమలు చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, విచారణను మరింత త్వరగా చేపట్టాలని సీనియర్ న్యాయవాది రాజేంత్ బసంత్ కోర్టును అభ్యర్థించారు.
ఈ కేసులో భారత ప్రభుత్వం, ప్రత్యేకించి విదేశాంగ మంత్రిత్వ శాఖ పాత్ర అత్యంత కీలకమైనది. దౌత్యపరమైన ఒత్తిడి ద్వారా, మృతుడి కుటుంబంతో మరోసారి చర్చలు జరిపి, ‘రక్తపు డబ్బు’ చెల్లింపు ద్వారా క్షమాభిక్ష పొందే అవకాశాలను బలోపేతం చేయాల్సి ఉంది. నిమిష ప్రియ తల్లి ప్రేమకుమారి చేసిన ప్రయత్నాలకు భారత ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించడం ద్వారా ఈ సంక్లిష్ట పరిస్థితికి ఒక పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ నిమిష ప్రియ ప్రాణాలను కాపాడతాయో లేదో వేచి చూడాలి.


