Operation Mahadev: దాచిగామ్ అడవుల్లో… పహల్గాం పాపాత్ములపై సైన్యం వేటు కశ్మీర్ గడ్డపై మరోసారి ఉగ్రవాదం నెత్తురోడింది. పవిత్ర అమర్‌నాథ్ యాత్రకు వెళ్తున్న భక్తులను పొట్టనబెట్టుకున్న పాపాత్ముల కథ ముగిసింది. దేశ భద్రతకే సవాలు విసిరిన పహల్గాం దాడి సూత్రధారులను భారత సైన్యం మట్టుబెట్టింది. శ్రీనగర్ శివార్లలోని దుర్భేద్యమైన దాచిగామ్ అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ‘ఆపరేషన్ మహాదేవ్’లో ముగ్గురు కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. నెల రోజులుగా భద్రతా దళాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ ముష్కరుల ఏరివేతతో లోయలో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపినట్లయింది. అయితే, పార్లమెంటులో ‘ఆపరేషన్ సిందూర్’పై మాటల తూటాలు పేలుతున్న వేళ… ఇక్కడ ‘ఆపరేషన్ మహాదేవ్’లో తుపాకులు గర్జించడం కేవలం యాదృచ్ఛికమేనా.. ? లేక పక్కా వ్యూహంలో భాగమా…?
నెల రోజుల వేట.. పక్కా వ్యూహం : హర్వాన్ ప్రాంతంలోని దాచిగామ్ అడవులు ఉగ్రవాదులకు అడ్డాగా మారాయని నిఘా వర్గాలకు నెల రోజుల క్రితమే విశ్వసనీయ సమాచారం అందింది. అప్పటి నుంచి భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ ఆపరేషన్ కోసం అత్యంత పకడ్బందీగా వ్యూహరచన చేశారు. రెండు రోజుల క్రితం అడవిలో అనుమానాస్పద కమ్యూనికేషన్ సిగ్నళ్లను పసిగట్టడం, స్థానిక గొర్రెల కాపరులు ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందించడం ఆపరేషన్‌కు కీలక మలుపునిచ్చింది.
అడవిలో మాటు.. కమాండోల వేటు : సోమవారం తెల్లవారుజామునే కార్యాచరణ మొదలైంది. 24 రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా (స్పెషల్ ఫోర్సెస్) కమాండోల బృందాలు దాచిగామ్ అడవిని చుట్టుముట్టాయి. ఉదయం 11:30 గంటల సమయంలో, లిడ్వాస్ ప్రాంతంలో ఓ లోతైన గొయ్యి తవ్వి, దానిపై టెంట్ వేసుకుని నక్కిన ముగ్గురు ఉగ్రవాదులను దళాలు గుర్తించాయి. భద్రతా దళాలను చూసి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో కమాండోలు మెరుపు వేగంతో ప్రతిదాడికి దిగారు. ముష్కరులు తేరుకునేలోపే వారిని తమ తుపాకులకు ఎరగా వేశారు. ఈ భీకర కాల్పుల మోతను సైన్యానికి చెందిన చినార్ కోర్ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ధ్రువీకరించింది.
హతమైనది పహల్గాం సూత్రధారులే : ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురిలో ఒకడు గత ఏడాది సోనామార్గ్ టన్నెల్‌పై దాడికి పాల్పడగా, మిగిలిన ఇద్దరు పహల్గాం యాత్రికులపై దాడిలో ప్రధాన నిందితులని భద్రతా వర్గాలు తేల్చాయి. వీరికి ఆశ్రయం కల్పించిన వారిని ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ జరిగిన ప్రాంతానికి సమీపంలోని ‘మహాదేవ్ పర్వతం’ పేరు మీదుగా ఈ ఆపరేషన్‌కు “ఆపరేషన్ మహాదేవ్” అని నామకరణం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
వ్యూహాత్మకమా..? యాదృచ్ఛికమా : పార్లమెంటులో ‘ఆపరేషన్ సిందూర్’పై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రవాదంపై తమ ప్రభుత్వ వైఖరిని, సైన్యం సత్తాను చాటేందుకే ఈ సమయం ఎంచుకున్నారా లేక యాదృచ్ఛికంగా జరిగిందా అన్న చర్చ మొదలైంది. ఏదేమైనా, ఈ విజయంపై నార్తర్న్ కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ భద్రతా దళాలను అభినందించారు. వారి సాహసోపేత చర్యలను కొనియాడారు.


