PM Modi visit to China for SCO summit: సరిహద్దుల్లో సైనికుల ఘర్షణతో గడ్డకట్టిన ఇరు దేశాల సంబంధాలు, అమెరికా వాణిజ్యపరమైన ఆంక్షలు, మారుతున్న అంతర్జాతీయ సమీకరణాల నడుమ భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు సిద్ధమయ్యారు. షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు కోసం డ్రాగన్ గడ్డపై అడుగుపెట్టనున్న మోదీకి చైనా సాదర స్వాగతం పలికింది. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత ఇదే తొలి చైనా పర్యటన కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పర్యటనతో భారత్-చైనా మధ్య ఉన్న అగాధం పూడుతుందా..? మోదీ, జిన్‌పింగ్‌ల భేటీలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి..? ఇదే వేదికపై పుతిన్‌తో జరపబోయే మంతనాలు అమెరికాకు ఎలాంటి సంకేతాలు పంపనున్నాయి..?
చైనా స్వాగతం.. అతిపెద్ద సదస్సు : చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సదస్సు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు తియాంజిన్ నగరంలో జరుగుతుంది. ఈ సదస్సు దేశాల మధ్య స్నేహాన్ని పెంచుతుందని చైనా ఆశాభావం వ్యక్తం చేసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి SCO సభ్య దేశాల అధినేతలతో పాటు, 10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు సహా 20కి పైగా దేశాల నాయకులు హాజరుకానున్నారు. SCO సంస్థాపన తర్వాత ఇదే అతిపెద్ద సదస్సు అని బీజింగ్ ప్రకటించడం దీని ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.
ALSO READ:https://teluguprabha.net/international-news/trump-india-trade-talks-dispute/
ఉద్రిక్తతల నీడలో పర్యటన : 2019లో చివరిసారిగా చైనాలో పర్యటించిన ప్రధాని మోదీ, ఇప్పుడు ఐదేళ్ల విరామం తర్వాత వెళ్తున్నారు. మధ్యలో 2020లో తూర్పు లద్దాఖ్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన భీకర ఘర్షణలతో ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిని చక్కదిద్దేందుకు సైనిక, దౌత్య మార్గాల్లో అనేక దఫాలుగా చర్చలు జరిపినా, పూర్తిస్థాయిలో సయోధ్య కుదరలేదు. గతేడాది రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో మోదీ, జిన్‌పింగ్ ముఖాముఖి మాట్లాడుకున్నప్పటికీ, పూర్తిస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. ఈ నేపథ్యంలో, ఈ పర్యటనలో ఇద్దరు నేతల మధ్య అధికారికంగా ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ALSO READ:https://teluguprabha.net/international-news/israel-gaza-city-takeover-plan-hamas/
భారత్ దృఢ వైఖరి : ఇటీవలి కాలంలో జరిగిన SCO సమావేశాల్లో భారత్ తన వైఖరిని నిర్మొహమాటంగా వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన రక్షణ మంత్రుల సమావేశంలో, పాక్ ప్రేరిత ఉగ్రవాదాన్ని ఉమ్మడి ప్రకటనలో ప్రస్తావించనందుకు నిరసనగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతకం చేసేందుకు నిరాకరించారు. దీంతో ఎలాంటి ఉమ్మడి ప్రకటన లేకుండానే ఆ సదస్సు ముగిసింది. ఈ దృఢమైన వైఖరి తర్వాత ఇప్పుడు ప్రధాని మోదీ పర్యటిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పుతిన్‌తో భేటీ.. అమెరికాకు సంకేతం : ఈ పర్యటనకు మరో కీలకమైన అంతర్జాతీయ కోణం కూడా ఉంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై కఠిన సుంకాలు విధించారు. ఈ ఒత్తిడి కొనసాగుతున్న తరుణంలో, ఇదే SCO సదస్సులో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. చైనా, రష్యా అధ్యక్షులతో ఒకే వేదికపై మోదీ చర్చలు జరపడం, అమెరికాకు వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని చాటి చెప్పే ప్రయత్నంగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


