Putin praises Trump : అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడిని నిజం చేస్తూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. అలస్కాలో దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన చర్చల్లో ఎలాంటి తుది ఒప్పందం కుదరకపోయినా, ట్రంప్ నాయకత్వ పటిమను, శాంతి కోసం ఆయన చేస్తున్న కృషిని పుతిన్ ఆకాశానికెత్తారు. ఉక్రెయిన్ గడ్డపై ఇంకా రక్తం ఏరులై పారుతుండగా, ప్రత్యర్థులుగా భావించే ఈ ఇద్దరు నేతల మధ్య కుదిరిన ఈ కొత్త స్నేహం దేనికి సంకేతం..? ట్రంప్‌లో పుతిన్‌కు అంతగా నచ్చిన విషయం ఏమై ఉంటుంది..?
ఆయనే ఉంటే యుద్ధమే లేదు: పుతిన్ సమర్థన : “2022లో నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఒక్క రోజు కూడా జరిగేది కాదు,” అని ట్రంప్ గతంలో అనేకసార్లు చేసిన వ్యాఖ్యలను పుతిన్ ఇప్పుడు బహిరంగంగా సమర్థించారు. “అవును, ట్రంప్ అప్పుడు అధ్యక్షుడిగా ఉండి ఉంటే, ఈ యుద్ధం వచ్చేదే కాదు. ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడానికి ట్రంప్ వ్యక్తిగతంగా చేస్తున్న కృషిని మేం నిశితంగా గమనిస్తున్నాం,” అని పుతిన్ వ్యాఖ్యానించారు. ఈ మాటలు దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ఉక్రెయిన్ భద్రతకు మేం సిద్ధం : చర్చల సందర్భంగా ఉక్రెయిన్ భద్రతకు కూడా హామీ ఇవ్వాల్సిన అవసరం ఉందని ట్రంప్ నొక్కి చెప్పిన విషయాన్ని తాను పూర్తిగా అంగీకరిస్తున్నట్లు పుతిన్ తెలిపారు. “ఉక్రెయిన్ మాకు సోదర సమానమైన దేశం. మా మూలాలు ఒక్కటే. కానీ ప్రస్తుత పరిస్థితి మా భద్రతకు పెను ముప్పుగా మారింది. జరుగుతున్నదంతా ఒక భయంకరమైన విషాదం, మానని గాయం. ఉక్రెయిన్ భద్రతకు మేము హామీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం,” అని ఆయన పేర్కొన్నారు.
ఐరోపాకు పరోక్ష హెచ్చరిక : ఐరోపాలో శాశ్వత శాంతి నెలకొనాలంటే, ఘర్షణకు మూల కారణాలను తొలగించాలని పుతిన్ అభిప్రాయపడ్డారు. “ట్రంప్‌తో కలిసి కుదుర్చుకునే ఒప్పందం ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో మాకు సహాయపడుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ శాంతి ప్రక్రియను ఐరోపా దేశాలు నిర్మాణాత్మకంగా అర్థం చేసుకుంటాయని, ఎలాంటి ఆటంకాలు కల్పించవని, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవని ఆశిస్తున్నాను,” అని పుతిన్ వ్యాఖ్యానించడం ఐరోపా యూనియన్‌కు పరోక్ష హెచ్చరికగానే విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ అత్యంత కీలక సమావేశంలో పుతిన్ వెంట విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, విదేశాంగ విధాన సహాయకుడు యూరీ ఉషకోవ్ ఉండగా, ట్రంప్‌తో పాటు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ పాల్గొన్నారు.


