Russia On Trump Warning: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధంపై ఎంత తీవ్రంగా మాట్లాడినా, రష్యా ఏమాత్రం భయపడటం లేదు.”50 రోజుల్లో శాంతి ఒప్పందం చేసుకోకపోతే భారీ సుంకాలతో మోత మోగిస్తా” అన్న ట్రంప్ హెచ్చరికలను తేలికగా కొట్టిపారేసింది. ఆంక్షలు తమకు కొత్తేమీ కాదని, దేనికైనా సిద్ధంగా ఉన్నామంటూ ధీమా వ్యక్తం చేసింది. అసలు ట్రంప్ గడువు వెనుక ఉన్న ఆంతర్యంపై రష్యా ఏమంటోంది? ఈ మాటల యుద్ధం దేనికి దారితీయనుంది..? ఈ పరిణామాలపై ప్రపంచ దేశాలు ఎందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి?
ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 రోజుల గడువుపై రష్యా తీవ్రంగా స్పందించింది. ట్రంప్ హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయమని, ఎలాంటి అదనపు ఆంక్షలకైనా తాము సిద్ధంగా ఉన్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ స్పష్టం చేశారు.
ఆంక్షలను ఎదుర్కొంటున్నాం:
చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) మంత్రుల సమావేశం అనంతరం లావ్రోవ్ మాట్లాడుతూ, “మా దేశంపై ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడా లేనన్ని ఆంక్షలు అమలులో ఉన్నాయి. వాటిని మేం సమర్థంగా ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు కొత్తగా విధించే వాటిని కూడా అంతే దీటుగా ఎదుర్కొంటాం” అని తేల్చిచెప్పారు. ట్రంప్ విధించిన గడువుల వెనుక ఆంతర్యాన్ని తెలుసుకోవాలని ఉందని, గతంలో కూడా 24 గంటలు, 100 రోజులు అంటూ ఇలాంటి గడువులు ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు.
పుతిన్‌పై ట్రంప్ ఫైర్:
మరోవైపు, రష్యా అధ్యక్షుడు పుతిన్ తీరుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నాటో సెక్రటరీ జనరల్‌తో భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పుతిన్ పగలు అందమైన కబుర్లు చెబుతారు, రాత్రయితే అమాయక ప్రజలపై బాంబులతో విరుచుకుపడతారు. ఆయన ప్రవర్తన ఏమాత్రం బాగోలేదు” అని తీవ్రంగా విమర్శించారు.
భారత్ వంటి దేశాలే లక్ష్యంగా:
యుద్ధాన్ని ఆపేందుకు రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడమే మార్గమని భావిస్తున్న అమెరికా, ఇప్పుడు రష్యాకు సహాయం చేస్తున్న దేశాలపై దృష్టి సారించింది. “రష్యా నుంచి చౌకగా చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తూ యుద్ధాన్ని ఆసరాగా చేసుకుంటున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై 500% వరకు సుంకాలు విధించాలి. పుతిన్‌ను శాంతి ఒప్పందానికి రప్పించడానికి ఇదే అంతిమ అస్త్రం” అని అమెరికన్ సెనేటర్లు లిండ్సే గ్రాహం, రిచర్డ్ బ్లూమెంటల్ స్పష్టం చేశారు. రాబోయే 50 రోజుల్లో శాంతి ఒప్పందం కుదరకపోతే రష్యాపై 100 శాతం సుంకాలు విధించాలనే ట్రంప్ నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని వారు తేల్చి చెప్పారు.
ఈ హెచ్చరికల పర్వం చూస్తుంటే, అమెరికా-రష్యా మధ్య ప్రత్యక్ష యుద్ధం జరగకపోయినా, ఆర్థిక యుద్ధం మాత్రం తీవ్ర స్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. ఈ ఒత్తిడికి రష్యా తలొగ్గుతుందా లేక ప్రపంచ వాణిజ్యం కొత్త సంక్షోభంలోకి జారుకుంటుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి.


