Monday, November 17, 2025
Homeఇంటర్నేషనల్From Space To Isolation: కాలిఫోర్నియా తీరంలో ల్యాండింగ్.. భారత వ్యోమగామి శుభాంశుకు తప్పని క్వారంటైన్!

From Space To Isolation: కాలిఫోర్నియా తీరంలో ల్యాండింగ్.. భారత వ్యోమగామి శుభాంశుకు తప్పని క్వారంటైన్!

Astronaut Shubhanshu Shukla: మానవ అంతరిక్ష ప్రయాణంలో భారత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 18 రోజుల సుదీర్ఘ ప్రయోగాల అనంతరం ఆయన భూమికి తిరిగి రానున్నారు. అయితే, అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన వెంటనే శుక్లాకు ఎదురుచూస్తున్న సవాళ్లు ఏమిటి? భూమ్మీదకు అడుగుపెట్టాక ఆయనకు ఎలాంటి క్వారంటైన్ నిబంధనలు వర్తిస్తాయి? ఈ వివరాలు తెలుసుకోవాలంటే…

- Advertisement -


శుభాంశు శుక్లాకు క్వారంటైన్ – భూమ్మీదకు వచ్చాక వారం రోజులు అక్కడే : యాక్సియం-4 మిషన్​లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాములు 18 రోజుల యాత్ర అనంతరం జులై 15న భూమ్మీదకు తిరిగి రానున్నారు.

కాలిఫోర్నియా తీరంలో ల్యాండింగ్:

జులై 15న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని వీడి, క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా వ్యోమగాములు కాలిఫోర్నియా తీరం సమీపంలో మధ్యాహ్నం 3 గంటలకు ల్యాండ్ అవ్వనున్నారు. నాసా సమాచారం ప్రకారం, ఈ డ్రాగన్ వ్యోమ నౌక 580 పౌండ్ల కంటే ఎక్కువ కార్గోతో, నాసా హార్డ్ వేర్, మిషన్ అంతటా నిర్వహించిన 60 కి పైగా ప్రయోగాల డేటాతో తిరిగి వస్తుంది.

వారం రోజుల క్వారంటైన్ తప్పనిసరి:

భూమికి చేరుకోగానే నలుగురు వ్యోమగాములను వెంటనే వారం రోజుల పాటు క్వారంటైన్​కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. అంతరిక్ష వాతావరణం నుంచి భూ వాతావరణానికి వారి శరీరాలు అలవాటుపడేందుకు వీలుగా ఇది అత్యంత ఆవశ్యకం.

వైద్య పర్యవేక్షణ, పునరావాసం:

ఇస్రో ప్రకటన ప్రకారం, ల్యాండింగ్ తర్వాత, శుభాంశు శుక్లా సహా ఇతర వ్యోమగాములు భూ వాతావరణానికి వారి శరీరాలు అలవాటుపడేందుకు వీలుగా వైద్యాధికారుల పర్యవేక్షణలో సుమారు 7 రోజుల పాటు పునరావాసంలో ఉంటారు. ఈ సమయంలో ఇస్రోకు చెందిన వైద్యాధికారులు వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్‌నెస్​ను నిరంతరం పర్యవేక్షిస్తారు. అంతరిక్షం నుంచి బయల్దేరే ముందు కూడా వారికి పలు ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. శుభాంశు శుక్లా మంచి ఆరోగ్యంగా, ఉత్సాహంతో ఉన్నారని ఇస్రో వెల్లడించింది.

శుక్లా అంతరిక్ష యాత్ర విశేషాలు: 

ఖర్చు, భవిష్యత్ ప్రణాళికలు: శుభాంశు శుక్లా రోదసీ యాత్ర కోసం ఇస్రో సుమారు రూ. 550 కోట్లు ఖర్చు చేసింది. అతడి యాత్ర అనుభవం 2027లో మానవ అంతరిక్ష ప్రయాణ కార్యక్రమం ‘గగన్‌యాన్’ను ప్లాన్ చేయడంలో, అమలుకు ఎంతో ఉపయోగపడుతుందని ఇస్రో భావిస్తోంది.

 ప్రయోగాలు, పరిశోధనలు:

అంతరిక్ష కేంద్రంలో శుభాంశు శుక్లా తోటి వ్యోమగాములకు భారతీయ వంటకాలైన క్యారెట్ హల్వా, మామిడి తాండ్ర (ఆమ్రాస్)లను వడ్డించారు. అలాగే, మైక్రోఆల్గే అనే సూక్ష్మజీవులపై ప్రయోగం చేశారు. వీటికి జీరో గ్రావిటీలో ఆహారం, ఆక్సిజన్, జీవ ఇంధనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పరిశీలించారు.
 
వైద్య పరిశోధనలు:

వ్యోమగాముల బృందం వాయోజర్ డిస్ప్లేస్ అధ్యయనాన్ని చేపట్టింది. ఇది అంతరిక్ష ప్రయాణంలో కంటి కదలికలు, సమన్వయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వివరిస్తుంది. అలాగే, ISSలో మానవ రక్త ప్రవాహంపై పరీక్షలు జరిపారు. పెరిగిన కార్బన్ డయాక్సైడ్  స్థాయిలు, మైక్రోగ్రావిటీతో పాటుగా హృదయనాళ పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయో పరిశోధన చేశారు.
 
యాత్ర మైలురాళ్ళు:

యాక్సియం-4 మిషన్ ద్వారా శుభాంశుతో పాటు పెగ్గీ విట్సన్, స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ-విస్నియొస్కీ, టిబర్‌ కపు ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి జూన్ 25న అంతరిక్షంలోకి వెళ్లారు. 28 గంటల ప్రయాణం తర్వాత వారు ISSలోకి చేరుకున్నారు. అక్కడ దాదాపు 60కి పైగా ప్రయోగాలు నిర్వహించారు. దాదాపు గత 2 వారాలుగా ISSలో ఉన్న శుభాంశు శుక్లా ఏకంగా 96.5 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు యాక్సియం స్పేస్ ఇటీవలే వెల్లడించింది. ఇప్పటికీ వ్యోమగాములు  230 సార్లు భూమిని చుట్టి వచ్చారని వెల్లడించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad