Thai Princess health condition: థాయ్‌లాండ్ యువరాణి బజ్రకితియభా ఆరోగ్యంపై నెలకొన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని రాయల్ ప్యాలెస్ చెబుతున్నప్పటికీ, అసలు వాస్తవమేమిటనే దానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ రాజకుటుంబం ప్రకటనలో నిజమెంత..? యువరాణికి అందిస్తున్న చికిత్స ఏంటి..? ఆమె తిరిగి కోలుకునే అవకాశాలు ఉన్నాయా..?
థాయ్‌లాండ్ రాచరిక వారసురాలిగా రేసులో ముందున్న యువరాణి బజ్రకితియభా ఆరోగ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. బ్యాంకాక్ సమీపంలోని ఖోవొ యై జాతీయ పార్కులో సైనిక శునకాలకు శిక్షణ ఇస్తున్న సమయంలో ఆమె అకస్మాత్తుగా కుప్పకూలిపోయిన విషయం విదితమే. గుండెపోటు కారణంగా ఆమె స్పృహతప్పి పడిపోవడంతో, హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సైనిక హెలికాప్టర్‌లో బ్యాంకాక్‌లోని కింగ్ చులాలాంగ్‌కార్న్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించి, ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
రాజకుటుంబం ప్రకటన.. అనుమానాల వలయం : యువరాణి ఆరోగ్యంపై రాయల్ ప్యాలెస్ విడుదల చేసిన ప్రకటన అనేక అనుమానాలకు తావిస్తోంది. “యువరాణి ఆరోగ్యం ఒక స్థాయిలో నిలకడగా ఉంది” అని ప్రకటనలో పేర్కొన్నప్పటికీ, ఆమె గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల పనితీరుకు కృత్రిమంగా మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. “యువరాణి హృదయ స్పందనలను మందుల సహాయంతో నియంత్రిస్తున్నామని, గుండె కొట్టుకునే ప్రక్రియలో భాగమైన సిస్టోల్ (గుండె సంకోచం) సరిగ్గా జరగడం లేదని” వైద్యులు తెలిపినట్లు ప్యాలెస్ పేర్కొంది. వైద్య పరిభాషలో చెప్పాలంటే, ఇది చాలా తీవ్రమైన పరిస్థితికి సంకేతం. అవయవాలు పనిచేయడానికి పూర్తిగా యంత్రాలపై ఆధారపడాల్సి రావడం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనడానికి నిదర్శనం. అయితే, రాజకుటుంబం మాత్రం “ఆమె మరణించింది, ఈ నిజాన్ని దాచిపెడుతున్నారు” అనే ప్రచారాన్ని ఖండిస్తోంది.
ALSO READ: https://teluguprabha.net/international-news/pakistan-pok-floods-death-toll-khyber-pakhtunkhwa/
వారసురాలిగా ప్రచారం.. ఇంతలోనే అనారోగ్యం : థాయ్‌లాండ్ రాజు మహా వజ్రిలాంగ్‌కార్న్ మొదటి భార్య సోమ్‌సావాలికి బజ్రకితియభా పెద్ద కుమార్తె. ఆమెను తదుపరి వారసురాలిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే ఆమె అనారోగ్యం బారిన పడటం అనేక చర్చలకు దారితీసింది. థాయ్ సమాజంలో యువరాణికి విశేషమైన గౌరవం ఉంది. ఆమెపై ఎలాంటి విమర్శలు చేసినా, పరువు నష్టం చట్టం కింద 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించేంత కఠినమైన చట్టాలు అక్కడ అమల్లో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ప్రార్థనలు : యువరాణి బజ్రకితియభా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ థాయ్‌లాండ్ వ్యాప్తంగా ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. బౌద్ధ ఆరామాల్లో భిక్షువులు ఆమె కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు, థాయ్‌లాండ్ రాజు వజ్రిలాంగ్‌కార్న్, ఆయన భార్య సుతిదాలకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, వారికి స్వల్ప లక్షణాలు ఉన్నాయని ప్యాలెస్ వర్గాలు తెలిపాయి.


