Netanyahu Nominates Trump for Nobel Peace Prize: ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ప్రతిపాదనలో మరో దేశం చేరింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించారంటూ గతంలో పాకిస్థాన్ ఆయన పేరును ప్రతిపాదించగా, తాజాగా పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు చేస్తున్న కృషికి గాను ఇజ్రాయెల్ కూడా ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. ఈ పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి.
నెతన్యాహు ప్రతిపాదన: పశ్చిమాసియా శాంతికి ట్రంప్ కృషి : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోమవారం వైట్‌హౌస్‌లో జరిగిన విందు కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన నోబెల్ బహుమతి కమిటీకి పంపిన లేఖ కాపీని ట్రంప్‌కు అందజేశారు. “అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే గొప్ప పనులు చేశారు. మీరు, నేను మాట్లాడుతుండగానే, ఆయన ఒక దేశంలో అనేక ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పుతున్నారు. అందుకే, నోబెల్ శాంతి బహుమతికి మిమ్మల్ని నామినేట్ చేస్తూ కమిటీకి పంపిన లేఖను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇది శాంతి బహుమతికి మిమ్మల్ని నామినేట్ చేస్తోంది. ఇది అర్హమైనది. తప్పనిసరిగా ఈ పురస్కారం మీకు దక్కుతుంది” అని నెతన్యాహు పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో శాంతి భద్రతల కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ఇజ్రాయెలీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభినందిస్తున్నారని నెతన్యాహు స్పష్టం చేశారు. సవాళ్లను ఎదుర్కోవడానికి, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని తాను భావిస్తున్నానని కూడా ఆయన తెలిపారు. ఈ నామినేషన్ లేఖను చూసి ట్రంప్ సంతోషించారు. తనకు ఈ విషయం తెలియదని, ట్రంప్‌కు ఈ విషయం నాకు తెలియదు, కానీ తన నామినేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విందులో, నెతన్యాహుతో కలిసి గొప్ప విజయం సాధించామని, భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తామని ట్రంప్ అన్నారు.
పాకిస్థాన్ మద్దతు: భారత్-పాక్ దౌత్యంలో ట్రంప్ పాత్ర : ఇజ్రాయెల్ ప్రతిపాదనకు ముందు, ఇటీవల పాకిస్థాన్ కూడా నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును ప్రతిపాదించింది. భారత్-పాక్ మధ్య ఏర్పడిన సంఘర్షణలను తన నిర్ణయాత్మక దౌత్యంతో నివారించి, గొప్ప నాయకత్వాన్ని ప్రదర్శించిన ట్రంప్ ఇందుకు అర్హుడని పాకిస్థాన్ పేర్కొంది. ట్రంప్ నిజమైన శాంతి నిర్మాత అని ప్రశంసలు కురిపించింది. పాక్ నోబెల్ శాంతి ప్రతిపాదనను వైట్‌హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ ధ్రువీకరించారు. అయితే నోబెల్ శాంతి బహుమతిని ప్రతిపాదించిన తర్వాతే పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్‌కు ట్రంప్ విందు ఇచ్చినట్లు తెలుస్తోంది.


