Trump India-Pakistan Mediation Claim: “నేనే కనుక జోక్యం చేసుకోకపోయి ఉంటే, భారత్-పాకిస్తాన్‌లు భీకర యుద్ధంలో ఉండేవి,” అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశమయ్యాయి. అయితే, ఈ ఆర్భాటపు ప్రకటనల వెనుక ఉన్న నిజమెంత..? కేవలం వాణిజ్య ఒప్పందాల బెదిరింపుతో అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడం సాధ్యమేనా..? భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఈ వ్యాఖ్యలను ఎందుకు తీవ్రంగా ఖండించారు? అసలు ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో తెర వెనుక ఏమి జరిగింది..?
స్కాట్లాండ్‌లో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్, తాను ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రధాన యుద్ధాలను నివారించానని, అందులో భారత్-పాకిస్తాన్ ఘర్షణ అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. రెండు దేశాలు అణ్వస్త్ర శక్తి సంపన్నమైనవి కావడంతో, యుద్ధం జరిగి ఉంటే అణు ధూళి వ్యాపించి తీవ్ర పరిణామాలు ఉండేవని ఆయన అన్నారు. ఇరు దేశాల నాయకులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, యుద్ధానికి దిగితే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనని హెచ్చరించడంతోనే వారు కాల్పుల విరమణకు అంగీకరించారని ట్రంప్ తెలిపారు.
ALSO READ: https://teluguprabha.net/international-news/thailand-cambodia-border-dispute-resolution/
భారత్ ఖండన: జైశంకర్ స్పష్టత : ట్రంప్ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పార్లమెంటులో ‘ఆపరేషన్ సిందూర్’ పై జరిగిన చర్చలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ, ట్రంప్ వాదనల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 22వ తేదీ మొదలుకుని, జూన్ 17వ తేదీ వరకు గల వ్యవధిలో. ప్రధాని నరేంద్ర మోదీకి, డొనాల్డ్ ట్రంప్‌కు మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని ఆయన తేల్చిచెప్పారు. అమెరికాతో జరిగిన చర్చల్లో వాణిజ్య ప్రస్తావన రాలేదని, కాల్పుల విరమణ విషయంలో ఎలాంటి మధ్యవర్తిత్వం జరగలేదని జైశంకర్ పేర్కొన్నారు. నిజానికి, దాడులను ఆపాలని తొలుత పాకిస్తాన్ డీజీఎంఓ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్) నుంచే అభ్యర్థన వచ్చిందని ఆయన సభకు తెలిపారు.
ALSO READ: https://teluguprabha.net/international-news/operation-mahadev-srinagar-pahalgam-attackers-killed/
‘ఆపరేషన్ సిందూర్’: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ పాశవిక చర్యకు ప్రతిస్పందనగా, భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. మే 7న పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం లక్షిత దాడులు జరిపి, వాటిని ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ, భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. చివరికి పాకిస్తాన్ దిగివచ్చి కాల్పుల విరమణకు అంగీకరించింది. అయితే, ఉగ్రవాదంపై తమ పోరాటం ఆగదని, ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదని భారత్ పేర్కొంది.


