Tariffs On India Over Russian Oil A “Big Blow” To Moscow: రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై అమెరికా విధించిన భారీ సుంకాలు, రష్యా ఆర్థిక వ్యవస్థకు ‘పెద్ద దెబ్బ’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రష్యా ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం సరిగా లేదని, ఈ నిర్ణయం ఆ దేశంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన చెప్పారు. భారత్‌పై విధించిన 50% సుంకాల వల్ల రష్యా ఆదాయానికి గండి పడిందని ఆయన పేర్కొన్నారు.
“ప్రపంచంలోనే అతిపెద్ద చమురు కొనుగోలుదారులలో ఒకటిగా ఉన్న భారతదేశం, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే 50% సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు చెప్పడం రష్యాకు పెద్ద దెబ్బ. నేను తప్ప మరెవరూ ఇంత కఠినంగా వ్యవహరించి ఉండేవారు కాదు” అని ట్రంప్ అన్నారు.
సుంకాలతో శత్రువులపై ఆధిపత్యం..
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను భారత్‌పై 25% సుంకాలను, అదనంగా రష్యా చమురుపై మరో 25% సుంకాలను అమెరికా విధించింది. దీంతో మొత్తం సుంకాలు 50%కి చేరాయి. ఈ సుంకాలను విధించడం ద్వారా అమెరికా ఆదాయాన్ని సంపాదించుకోవడమే కాకుండా, శత్రువులపై ఆధిపత్యం సాధించిందని ట్రంప్ వివరించారు.
అంతేకాకుండా, తన సుంకాల విధానం వల్ల ఐదు యుద్ధాలను పరిష్కరించామని, అందులో భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న సైనిక వివాదం కూడా ఒకటని ట్రంప్ వ్యాఖ్యానించారు. యుద్ధ మార్గం నుంచి రష్యా వైదొలిగి, వ్యాపారంపై దృష్టి పెడితే అమెరికా-రష్యా మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉంటాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.


