Trump Warns BRICS Nations: అమెరికా ‘డాలర్’ సింహాసనాన్ని కదిలించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలపై నిప్పులు చెరిగారు. ప్రపంచ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేయాలని చూస్తున్న బ్రిక్స్ కూటమిని లక్ష్యంగా చేసుకుని, ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డాలర్‌కు ప్రత్యామ్నాయం కోసం చూస్తే సుంకాలతో వాత పెడతానని బెదిరించిన ట్రంప్, తన మాటలతో ఆ కూటమి సమావేశానికి హాజరే తగ్గిపోయిందని ఎద్దేవా చేశారు.
సుంకాలే నా ఆయుధం:
వైట్‌హౌస్‌లో క్రిప్టోకరెన్సీ చట్టాన్ని ఆమోదించిన సందర్భంగా మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్, తన ప్రసంగాన్ని బ్రిక్స్ కూటమిపై దాడికి వాడుకున్నారు. “డాలర్ మన కరెన్సీ. దాని పతనాన్ని నేను ఎప్పటికీ అనుమతించను,” అని స్పష్టం చేసిన ట్రంప్, డాలర్ ఆధిపత్యానికి గండి కొట్టాలని చూస్తున్న బ్రిక్స్ దేశాల ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.
“బ్రిక్స్ అనేది ఓ చిన్న సమూహం, అది వేగంగా పతనమవుతోంది. వారు డాలర్‌ను, దాని ప్రమాణాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. అలాంటివి నేను సహించను. నా సుంకాల హెచ్చరిక తర్వాత జరిగిన వారి సమావేశానికి హాజరు గణనీయంగా పడిపోయింది. ఎందుకంటే వారు సుంకాలు చెల్లించాలనుకోవడం లేదు, అందుకే రావడానికే భయపడుతున్నారు,” అని ట్రంప్ ఎద్దేవా చేశారు.
ట్రంప్ కోపానికి కారణం.. ‘డీ-డాలరైజేషన్’:
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో ఏర్పడిన బ్రిక్స్ కూటమి, గతేడాది ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాలను చేర్చుకుని మరింత విస్తరించింది. ఈ కూటమి కొంతకాలంగా ‘డీ-డాలరైజేషన్’ (డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం) అనే అంశంపై తీవ్రంగా చర్చిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో, ముఖ్యంగా ముడి చమురు వంటి కొనుగోళ్లలో డాలర్‌కు బదులుగా సభ్య దేశాల స్థానిక కరెన్సీలను వాడాలని ప్రతిపాదిస్తోంది. ప్రపంచ చెల్లింపుల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న డాలర్‌కు ఇది గట్టి దెబ్బ. ఈ చర్చలే అమెరికాకు, ముఖ్యంగా ట్రంప్‌కు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. డాలర్ బలహీనపడితే అది అమెరికా ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలకు హాని చేస్తుందని ఆయన భావిస్తున్నారు. ఆ కారణం చేతనే బ్రిక్స్ దేశాలపై సుంకాల పేరుతో ఒత్తిడి తెస్తున్నారు.
డాలర్‌ను దెబ్బతీయడం మా ఎజెండా కాదు:
అయితే, ‘డీ-డాలరైజేషన్’ విషయంలో భారత్ వంటి దేశాలు ఆచితూచి అడుగులేస్తున్నాయి. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ ఇటీవల స్పష్టతనిచ్చింది. “స్థానిక కరెన్సీల వినియోగంపై బ్రిక్స్ దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయన్నది వాస్తవం. కానీ, డాలర్‌ను తగ్గించడం లేదా దెబ్బతీయడం మా ఎజెండా కాదు,” అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ జులై 17న స్పష్టం చేశారు.
అయితే, ట్రంప్ బ్రిక్స్ దేశాలను బెదిరించడం ఇది మొదటిసారి కాదు. 2024లో డాలర్‌కు పోటీగా సొంత కరెన్సీని సృష్టిస్తే ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తానని గతంలోనే హెచ్చరించారు. తాజా హెచ్చరికలతో పాటు, వాణిజ్య ఒప్పందాలు చేసుకోని దేశాలపై ఆగస్టు 1 నుంచి సుంకాలు విధిస్తానని ట్రంప్ ఇప్పటికే గడువు విధించడం గమనార్హం.


