‘No Kings’ protests against Trump : “మా దేశంలో రాజులు లేరు.. నియంతలకు చోటు లేదు!” – ఈ నినాదంతో అగ్రరాజ్యం అమెరికా అట్టుడుకుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న ఏకపక్ష, వివాదాస్పద నిర్ణయాలపై ప్రజాగ్రహం పెల్లుబికింది. ‘నో కింగ్స్’ పేరుతో దేశవ్యాప్తంగా, 50 రాష్ట్రాల్లోని 2500కు పైగా ప్రదేశాల్లో భారీ నిరసనలకు పిలుపునివ్వడంతో, శ్వేతసౌధం ఉలిక్కిపడింది. అసలు అమెరికన్లలో ఇంతటి ఆగ్రహానికి కారణాలేంటి..? ట్రంప్ తీసుకున్న ఆ వివాదాస్పద నిర్ణయాలేంటి..?
రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన డొనాల్డ్ ట్రంప్, ‘సంస్కరణల’ పేరుతో వందలాది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేస్తూ, దేశ విధానాలను సమూలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఎలాన్ మస్క్ నేతృత్వంలో ‘డోజ్’: పాలనా సంస్కరణల కోసం, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ నేతృత్వంలో ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ’ (DOJ)ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రభుత్వ శాఖల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించారు.
వివాదాస్పద మార్పులు: జన్మతః పౌరసత్వం, ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ, అక్రమ వలసల నిరోధం వంటి అంశాల్లో కీలక మార్పులు చేశారు. ముఖ్యంగా, వలసదారులపై అధికారులు నిర్వహిస్తున్న సోదాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
‘నో కింగ్స్’.. ఎందుకీ పేరు : ట్రంప్ విధానాలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నాయని, ఆయన ఓ రాజులా, నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, నిరసనకారులు ఈ ఉద్యమానికి ‘నో కింగ్స్’ అని పేరు పెట్టారు. “అవినీతి, క్రూరత్వానికి వ్యతిరేకంగా మా పోరాటం ఆగదు,” అని వారు తమ అధికారిక వెబ్‌సైట్‌లో స్పష్టం చేశారు.
దేశవ్యాప్త ఆందోళనలు.. జాతీయ బలగాల మోహరింపు : ఈ నిరసనలకు సెనెట్ నేత చక్ షుమెర్, బెర్నీ సాండర్స్ వంటి ప్రముఖ రాజకీయ నాయకులు కూడా మద్దతు తెలిపారు. ఇటీవల అమెరికా ప్రభుత్వం ‘షట్‌డౌన్’ అవ్వడం, లక్షలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపడం, ప్రజల ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసింది. దీంతో, తాజా నిరసనల నేపథ్యంలో, ముందుజాగ్రత్త చర్యగా అనేక రాష్ట్రాల్లో జాతీయ బలగాలను (National Guard) మోహరించారు. అయితే, ఈ నిరసనలను రిపబ్లికన్లు “హేట్ అమెరికా” (అమెరికా ద్వేష) ర్యాలీలుగా అభివర్ణిస్తున్నారు. తాను రాజును కాదని, ప్రజల కోసమే పనిచేస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు.
కిమ్‌తో ట్రంప్ భేటీ : ఈ రాజకీయ గందరగోళం నడుమ, ట్రంప్ త్వరలో దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఏపీఈసీ (APEC) సదస్సులో పాల్గొననున్న ఆయన, ఈ సందర్భంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం.


