అమెరికా..పారాహుషార్, విచ్చలవిడిగా కోళ్లు- పందుల పెంపకం ఆపాలి.. హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు.
కొవిడ్ మహమ్మారి సృష్టించిన విలయం ఎలాంటిదో మనందరికీ ప్రత్యక్ష అనుభవమే. నెలల తరబడి కొనసాగిన లాక్‌డౌన్ ఆంక్షలు… ఆస్పత్రులలో కనీసం ఆక్సిజన్ కూడా అందక, ఊపిరాడక పోయిన ప్రాణాలు.. అయినవాళ్లు మరణిస్తే కనీసం అంత్యక్రియలూ చేయలేని దారుణ పరిస్థితులు.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కొవిడ్ సోకి, అది తగ్గిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా నోటికి రుచి తెలియకపోవడం, జుట్టు రాలిపోవడం, ఊపిరితిత్తులు బలహీనపడటం, రక్తంలో గడ్డలు ఏర్పడటం, గుండె కవాటాల వ్యాధులు.. ఇలా చాలానే చూశాం.
ఇప్పుడు మరో మహమ్మారి మనపై దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. కరోనా మహమ్మారి చైనా నుంచి వస్తే.. కొత్తది అమెరికా నుంచి రాబోతోంది. ఈ విషయాన్ని ఏదో బయటి దేశానికి చెందిన పరిశోధకులు చెప్పారంటే అమెరికా మీద అక్కసుతో అన్నారని అనుకోవచ్చు. కానీ సాక్షాత్తు అమెరికాకే చెందిన హార్వర్డ్, న్యూయార్క్ యూనివర్సిటీల పరిశోధకులే ఈ విషయాలపై హెచ్చరించారు. తమ దేశంలో జంతువుల వాడకం విచ్చలవిడిగా ఉందని, ముఖ్యంగా కోళ్లు.. పందులనైతే తినేందుకు పెద్దసంఖ్యలో ఫారంలలో పెంచుతున్నారని, వీటి నుంచి మనుషులకు వైరస్‌లు వ్యాపించే ప్రమాదం చాలా ఎక్కువని చెబుతున్నారు. వాటితోపాటు.. పిల్లులు, వివిధ రకాల పక్షులను పెంచుకునే అలవాటు కూడా అమెరికాలో చాలామందికే ఉంది. ఇవన్నీ కూడా వైరస్ వాహకాలే. పైపెచ్చు, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా చట్టాలున్న అమెరికాలో జంతువుల పెంపకం, వాటి వాడకం లాంటి విషయాల్లో ఇప్పటివరకూ నియంత్రణలే లేవు. కోళ్లు, పందుల ఫారాల విషయంలోనూ కఠిన నిబంధనలు లేవు. దాంతో సమీప భవిష్యత్తులోనే వీటి నుంచి ఓ మహమ్మారి విజృంభించేందుకు అన్నిరకాలుగా అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమెరికాలో ప్రధానంగా 36 రకాల జంతుసంబంధ పరిశ్రమలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీటినుంచి భారీ స్థాయిలో ఆదాయం వస్తుండటంతో మరింతమంది ఔత్సాహికులు ఈ రంగంలోకి వస్తున్నారు. ఒక కోళ్ల ఫారం నుంచి నెలకు తనకు 18వేల డాలర్ల ఆదాయం (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.15 లక్షలు) వస్తోందని ఓ యువతి చెప్పింది. కానీ, ఇలాంటి ఫారాల వల్ల మనుషులకు జూనోటిక్ వ్యాధులు సంభవించే ప్రమాదం ఉంది. రాష్ట్రాల వారీగా వేర్వేరుగా ఉన్న చట్టాలు ఈ సంస్థలను దాదాపుగా పట్టించుకోవని హార్వర్డ్ యానిమల్ లా అండ్ పాలసీ ప్రోగ్రాంలో రీసెర్చ్ ఫెలోగా పనిచేస్తున్న ఆన్ లిండర్ వ్యాఖ్యానించారు. కొవిడ్ ఎలా మొదలైందన్న దానికి చాలా సిద్ధాంతాలు చైనాలోని వుహాన్‌లో ఉన్న గబ్బిలాల మార్కెట్లవైపే వేళ్లు చూపించాయి. ఇప్పుడు ప్రపంచంలో ఇతర దేశాలన్నింటి కంటే చాలా ఎక్కువ సంఖ్యలో అమెరికాలోనే జంతువుల వాడకం ఉంటోంది. ఈ విషయాన్ని లిండర్ గుర్తుచేశారు. ప్రస్తుతం పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, ఈ జంతువుల వల్ల మనుషులకు వ్యాపించే వ్యాధులు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయని హెచ్చరించారు. మరో మహమ్మరికి ప్రపంచం సిద్ధం కావాల్సిందేనంటూ ప్రమాదఘంటికలు మోగించారు. ఆమె చెప్పిన ప్రకారం కొన్ని విషయాలు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి.
మనుషులు జంతువులతో సన్నిహితంగా ఉంటున్న తీరు జూనోటిక్ వ్యాధుల వ్యాప్తికి కారణమవుతోంది. వాటినుంచి పాథోజెన్లు మనుషులకు వ్యాపిస్తాయి. కోళ్లు, పందుల్లాంటి పలు రకాల జీవాలను అమెరికాలో పెద్దసంఖ్యలో పెంచుతున్నారు. తర్వాత వాటిని నరికి.. కస్టమర్లకు ఆహారంగా అమ్ముతున్నారు. ఇలా వీటిని పెంచేటప్పుడు మనుషుల ప్రమేయం ఉంటోంది. అది జూనోటిక్ వ్యాధుల వ్యాప్తికి దారితీస్తోంది. పెంపకం మాత్రమే కాదు.. తర్వాత వినియోగం కూడా ఎక్కువ స్థాయిలోనే ఉండటంతో ఇది మరెంత దూరం పోతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
సాధారణంగా ఇలాంటి మహమ్మారులు వ్యాపించే అవకాశం ఎంతవరకు ఉంటుందో చెప్పలేం కాబట్టి, వీటిని ముందుగా అంచనా వేయలేమని.. ఆ పేరుతో ఆహార సరఫరా మీద నియంత్రణలు విధించలేమని అమెరికా పాలకులు అంటున్నారు. కానీ, జంతువుల నుంచే మహమ్మారులు వస్తాయనడానికి కచ్చితమైన నిదర్శనాలు ఉన్నాయి. ఇప్పటికే మనకు ఆ విషయం తెలిసినప్పుడు, భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ఆపడానికి మనం చేయాల్సిన ప్రయత్నాలు చేయాలి కదా అన్నది పరిశోధకులు వేస్తున్న సూటి ప్రశ్న. భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను అడ్డుకునేందుకు ఏం చేయాలో అది చేసే సంకల్పం మనకు ఉందా అని వారు అడుగుతున్నారు.
ఇప్పుడు రాబోయే మహమ్మారులు గతంలో వచ్చినవాటి కంటే మరింత దారుణంగా ఉండబోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అవి కూడా మనం అనుకునేదాని కంటే చాలా ముందుగానే రావచ్చు. ఈ భూగ్రహం మీద ఉన్న ఏ ఇతర దేశం కంటే అమెరికాలోనే ఎక్కువగా జంతువులను ఆహారంగా ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఈ భావి మహమ్మారి ప్రభావం ముందుగా అమెరికన్ల మీదే ఉండొచ్చు. అలాగే, ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ఉన్నత విద్య, మంచి ఉద్యోగాల కోసం అమెరికాకు వస్తుంటారు. అలాంటివారు చేసే ప్రయాణాల వల్ల ఈ కొత్త మహమ్మారి సైతం ప్రపంచం అంతటికీ చాలా తక్కువ సమయంలోనే వ్యాపిస్తుంది. ఏవియన్ ఫ్లూ అనే వ్యాధి వల్ల ఒక్క అమెరికాలోనే దాదాపు 6 కోట్ల కోళ్లు చనిపోయాయి. హెచ్5ఎన్1 లాంటి ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు భావి మహమ్మారులకు నిదర్శనాలు. హెచ్5ఎన్1 భవిష్యత్తులో మానవజాతి వినాశనానికి కారణమవుతుందా అని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో పరిశోధన జరిగింది. అయితే, దానివల్ల అంతస్థాయిలో ప్రమాదం లేదుగానీ, కొన్ని కోట్ల మంది మరణాలు సంభవించవచ్చని, బహుశా వందల కోట్లమందే మరణించవచ్చని ఆ పరిశోధన తేల్చింది.
అమెరికాలో ప్రతి సంవత్సరం ఆహారం కోసం 100 కోట్ల జంతువులను (కోళ్లు, గొర్రెలు, పందుల్లాంటివి) ఉత్పత్తి చేస్తారు. ఇవన్నీ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లకు వాహకాలే. అంటే వీటి నుంచి పెద్దస్థాయిలో మహమ్మారి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీనికితోడు కొన్ని అసాధారణమైన జంతువులను ఇళ్లలో పెంచుకోవడం కూడా అమెరికన్లకు బాగా అలవాటు. దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. సుగర్ గ్లైడర్ల లాంటి గబ్బిలం జాతి జంతువులనూ పెంచుతున్నారు. వీటితో వ్యాధులవ్యాప్తి ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. ఇక మింక్ లాంటి జంతువులను వాటి నుంచి వచ్చే ఉన్నికోసం, సౌందర్య లేపనాల్లో వాడే నూనె కోసం పెద్ద సంఖ్యలో పెంచుతారు. ఇటీవలే వాటితో వచ్చే వైరస్‌ను గుర్తించి న్యూజిలాండ్ లాంటి దేశాల్లో పెద్దసంఖ్యలో మింక్‌లను హతమార్చారు.
ప్రభుత్వం ఎటూ పెద్దగా పట్టించుకోవడం లేదు కాబట్టి, జూనోటిక్ ముప్పును కొంతవరకు తగ్గించుకునే ప్రయత్నాన్ని ప్రజలే చేయాలి. ముఖ్యంగా ఈ విషయం గురించి అవగాహన పెరగాలి. కనీసం ఇళ్లలో పెంపుడు జంతువుల విషయంలోనైనా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేటిని పెంచాలి, వేటిని పెంచకూడదనే విషయం తెలుసుకోవాలి. మరోవైపు ప్రభుత్వాలు కూడా ఎంతో కొంత స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టకపోతే, ఈసారి మహా మహమ్మారి మనల్ని పెద్ద సంఖ్యలో కబళించడం ఖాయం.