Hairfall Tips: ఈరోజుల్లో జుట్టు రాలడం ఒక సాధారణ సమస్యగా మారింది. చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇక వర్షాకాలంలో జుట్టు రాలడం ఎక్కువగా పెరుగుతుంది. దీని కారణం వర్షాకాలంలో తేమ పెరుగుతుంది. ఇది చుండ్రు, తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఫలితంగా ఇది జుట్టు రాలడానికి కారణమవుతుంది. అయితే, చాలామంది జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య అని భావించి లైట్ తీసుకుంటారు. కానీ, జుట్టు రాలడాన్ని సకాలంలో జాగ్రత్తగా చూసుకోకపోతే, అది బట్టతలకి కారణమవుతుందని. ఈ నేపథ్యంలో జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సులభమైన మార్గాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఆయిల్ మసాజ్
కొబ్బరి, బాదం లేదా ఆలివ్ నూనెను కొద్దిగా వేడి చేసి,చల్లారిన తర్వాత తలపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల జుట్టు మూలాల్లో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో జుట్టు బలపడుతుంది. ఆయిల్ మసాజ్ రాత్రి పడుకునేముందు చేసుకోవచ్చు లేదా స్నానానికి 1-2 గంటల ముందు అప్లై చేసుకోవచ్చు.
Also read: Viral Video: ముంబై గణేశుడి దర్శనానికి 18 కిలోమీటర్ల క్యూ..!
ఆమ్లా
ఉసిరిలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. జుట్టు రాలడాన్ని తగ్గించాలంటే ఆమ్లా పౌడర్‌ను నీరు, పెరుగు లేదా కొబ్బరి నూనెతో కలిపి పేస్ట్‌గా తయారు చేసి జుట్టుకు అప్లై చేయాలి. దాదాపు 30 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి.
మెంతులు
మెంతులు జుట్టు మూలాలకు పోషణనిస్తాయి. వాటిని బలంగా కూడా చేస్తాయి. ఇందుకోసం రాత్రిపూట నీటిలో నానబెట్టిన మెంతులను ఉదయాన్నే వాటిని మెత్తగా పేస్ట్ లా చేసి తలపై పూసుకోవాలి. దాదాపు 30-45 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై జుట్టును కడగాలి.
ఉల్లిపాయ రసం
ఉల్లిపాయ రసాన్ని తీసి నేరుగా తలపై పూయాలి. సుమారు 20-30 నిమిషాలు అలాగే ఉంచి, షాంపూతో కడిగేయాలి. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
కలబంద
కలబంద జెల్‌ను నేరుగా తలపై అప్లై చేయవచ్చు. ఇది జుట్టును తేమ చేస్తుంది. అంతేకాదు ఇది తలపై చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


