How to overcome loneliness : చదువు, ఉద్యోగం కోసం కన్నవారికి, సొంత ఊరికి దూరంగా ఉంటున్నారా? కుటుంబంతో కలిసే ఉన్నా, పని ఒత్తిడి, ఆందోళనల నడుమ ఒంటరితనం అనే చీకటి మిమ్మల్ని కమ్మేస్తోందా? అయితే మీలాంటి వారి కోసమే ఈ కథనం. మనసులోని భారాన్ని దించి, కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు సామూహిక కార్యకలాపాలు (గ్రూప్ యాక్టివిటీస్) దివ్యౌషధంలా పనిచేస్తాయని మానసిక నిపుణులు భరోసానిస్తున్నారు. అసలు ఒంటరితనాన్ని జయించే ఆ మార్గాలేంటి..? మనసుకు ప్రశాంతతను అందించే ఆ పనులేంటో చూద్దామా!
ఆధునిక జీవనశైలిలో ఒంటరితనం అనేది వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య. చదువులు, ఉద్యోగాల రీత్యా సొంతవాళ్లకు దూరంగా ఉండేవారే కాదు, అందరి మధ్యలో ఉన్నా ఒంటరిగా భావించేవారూ ఎందరో. ఈ భావన దీర్ఘకాలం కొనసాగితే మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే, నలుగురితో కలిసి కొన్ని పనుల్లో పాల్గొనడం ద్వారా ఈ ఒంటరితనాన్ని సులభంగా జయించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఒంటరితనాన్ని పారదోలే మార్గాలివే..
కళలతో స్నేహం: మీకు చిత్రలేఖనం, సంగీతం, నృత్యం వంటి లలిత కళలపై ఆసక్తి ఉందా? వెంటనే మీకు సమీపంలో ఉన్న శిక్షణా కేంద్రాల్లో చేరిపోండి. అక్కడ మీలాంటి ఆసక్తులు ఉన్న కొత్త మిత్రులు పరిచయమవుతారు. వారితో కలిసి నేర్చుకునే క్రమంలో ఒంటరిననే భావనే మీ దరిచేరదు. అప్పుడప్పుడు స్టాండప్ కామెడీ షోలు, సంగీత కచేరీలకు హాజరవడం వల్ల కూడా ఒత్తిడి తగ్గి మనసు తేలికపడుతుంది.
యాత్రలతో యాది: అప్పుడప్పుడు చిన్న చిన్న విహారయాత్రలకు ప్లాన్ చేసుకోండి. ఒంటరిగా వెళ్లడం ఇబ్బంది అనుకుంటే, అనేక టూరిజం ఏజెన్సీలు గ్రూప్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. మీలాంటి యాత్రికులతో కలిసి కొత్త ప్రదేశాలను చుట్టిరావడం వల్ల పరిచయాలు పెరిగి, ఒంటరితనం దూరమవుతుంది.
వ్యాయామంతో ఉల్లాసం: ఇంట్లో ఒంటరిగా వ్యాయామం చేయడం బదులు, సమీపంలోని జిమ్ లేదా పార్కుకు వెళ్లండి. అక్కడ మీలాగే ఆరోగ్య స్పృహ ఉన్నవారితో కలిసి వ్యాయామం చేయడం వల్ల కొత్త ఉత్సాహం వస్తుంది. టెన్నిస్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ వంటి క్రీడల కోసం స్పోర్ట్స్ అకాడమీల్లో చేరడం కూడా ఒక మంచి మార్గం.
సామాజిక మాధ్యమంతో బంధం: సామాజిక మాధ్యమాలను మంచికి కూడా వాడుకోవచ్చు. మీ అభిరుచులకు తగిన గ్రూపుల్లో చేరి, ఇతరులతో చర్చలు జరపండి. ఇది నలుగురితో మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా, కొత్త విషయాలు తెలుసుకునేందుకు దోహదపడుతుంది.
యోగాతో యోగం: శారీరక వ్యాయామం కుదరని వారు యోగా, ధ్యానం వంటివి ప్రయత్నించవచ్చు. ప్రత్యేక యోగా కేంద్రాలకు వెళ్లి పదిమందితో కలిసి సాధన చేయడం వల్ల ఒంటరితనం అనే భావన రాదు, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
గ్రూప్ మీటింగ్స్‌తో ధైర్యం: మీరు మానసికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మానసిక నిపుణులను సంప్రదించడం ఉత్తమం. వారు మీలాంటి సమస్యలతో బాధపడుతున్నవారితో కలిపి గ్రూప్ కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తారు. ఒకరి సమస్యలు ఒకరు పంచుకోవడం ద్వారా మానసిక ధైర్యం లభిస్తుంది.
సేవతో సంతృప్తి: సమాజ సేవ చేయాలనే ఆలోచన ఉంటే, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయండి. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పది మందితో కలిసి పనిచేస్తున్నామన్న భావనతో పాటు, సమాజానికి ఏదో చేస్తున్నామనే సంతృప్తి కూడా కలుగుతుంది.


