ఆపిల్ తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే “రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ దూరం ఉంటాడు” అన్న మాట చాలా ప్రసిద్ధి. ఇందులో నిజం కూడా ఉంది. ఎందుకంటే ఆపిల్‌లో ఉండే విటమిన్లు, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. ఇవి హృదయ ఆరోగ్యం, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కీలకంగా పనిచేస్తాయి.
కానీ దీనిని అధికంగా తినడం వల్ల మాత్రం ఆరోగ్యానికి నష్టం కలగవచ్చు అంటున్నారు డాక్టర్లు.. ఎక్కువగా ఆపిళ్లు తింటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆపిల్‌లో అధికంగా ఉండే ఫైబర్ కారణంగా పేగుల్లో వాయువు, కబ్జం వంటి ఇబ్బందులు కలగొచ్చు. ఒక ఆపిల్‌లో సుమారు 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. రోజుకి రెండు మూడు ఆపిళ్లు తింటే శరీరంలో అధికంగా క్యాలరీలు చేరి బరువు పెరగవచ్చు. పైగా, ఆపిల్‌లో ఉండే ఫ్రుక్టోస్ అనే చక్కెర అధిక మోతాదులో తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణమవుతుంది.
ఇంకా, ఆపిల్‌లో ఉండే ఆమ్లత ఎక్కువగా తీసుకుంటే పళ్ళపై ఉండే ఎమెల్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కొంతమందికి ఆపిల్ అలర్జీని కలిగించవచ్చు. అలాంటి వారిలో మలబద్ధకము, వాంతులు, పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఏదైనా ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. రోజుకు ఒక ఆపిల్ తినడం సరిపోతుంది. దానికంటే ఎక్కువ తింటే మేలు కన్నా హానే ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.