ఏసీ అంటే వేసవికాలంలో ఓ వరం లాంటిదే. గది చల్లగా మారిపోవడం, వేడి నుంచి ఉపశమనం కలగడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆటోమేటిక్ టెంపరేచర్ అడ్జస్టింగ్, ఇన్వర్టర్ టెక్నాలజీ వంటి ఫీచర్లతో ఏసీలు మరింతగా ప్రజలకు చేరువ అయ్యాయి. అయితే ఇదే సమయంలో, ఏసీ వాడకం వల్ల వచ్చే కరెంటు బిల్లు గురించి కూడా ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఏసీ కొనే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకోవడం అవసరం. ముఖ్యంగా గది పరిమాణానికి తగిన టన్నుల ఏసీ ఎంపిక చేసుకోవాలి. చిన్న గదులకు 1 టన్ను లేదా 1.5 టన్నుల ఏసీ సరిపోతుంది. పెద్ద గదులైతే 2 టన్నుల ఏసీ అవసరం. ప్రస్తుతం చాలామంది 1.5 టన్నుల ఏసీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇవి తక్కువ ధరకు లభించడమే కాక, గదికి సరిపడే చల్లదనాన్ని కూడా ఇస్తాయి.
అయితే ఏసీ కొనడమే కాదు, దానివల్ల నెలవారీ కరెంటు ఖర్చు ఎంత అవుతుందో ముందుగా అంచనా వేసుకోవడం కూడా అవసరం. ఉదాహరణకు, మీరు ఒక 1.5 టన్నుల LG ఇన్వర్టర్ ఏసీని రోజుకు 8 గంటల పాటు ఉపయోగిస్తుంటే, దాని విద్యుత్ వినియోగం సగటున 3.3 నుంచి 4 యూనిట్ల వరకు ఉంటుంది. మొదటి గంటలో సుమారు 700 వాట్స్, తర్వాత నాలుగు గంటలు 500 వాట్స్, చివరి మూడు గంటలు 200 వాట్స్ శక్తిని ఖర్చు చేస్తుంది. దీనివల్ల నెల చివరికి 120 నుంచి 150 యూనిట్ల వరకు కరెంటు వినియోగం జరిగే అవకాశం ఉంది. అంటే మీ బిల్లులో ఏసీ వాడకానికి గాను ముఖ్యమైన భాగం వెళ్తుంది.
పాత ఏసీల విషయంలో ఈ లెక్కలు మరింత భిన్నంగా ఉంటాయి. అవి ఎక్కువ శక్తిని వాడుతూ, గంటకు 2000-2500 వాట్స్ ఖర్చు చేస్తాయి. అలాంటి ఏసీను 8 గంటలు నడిపితే, దాదాపు 20 యూనిట్ల వరకు విద్యుత్ ఖర్చవుతుంది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో తక్కువ శక్తి వినియోగించే మోడల్స్‌నే అందిస్తున్నారు. అందువల్ల మీరు ఏసీ కొనేటప్పుడు అది ఏ ఏడాది మోడల్, ఎంత ఎనర్జీ రేటింగ్ కలిగిఉంది అనే విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి.
5 స్టార్ రేటింగ్ కలిగిన ఏసీలు తక్కువ కరెంటు వినియోగంతో పని చేస్తాయి. కానీ అవి సాధారణ ఏసీలతో పోలిస్తే రూ.5000 నుంచి రూ.10,000 వరకూ ఎక్కువ ఖర్చవుతాయి. అయినప్పటికీ దీర్ఘకాలికంగా చూస్తే వీటివల్ల వచ్చే కరెంటు బిల్లులో లాభమే ఉంటుంది. అలాగే, ఆటోమేటిక్ మోడ్ కలిగిన ఏసీలు గదిలో ఉష్ణోగ్రతకు అనుగుణంగా స్వయంచాలకంగా సర్దుబాటు అవుతాయి. ఇది కరెంటు వాడకాన్ని మరింత తగ్గిస్తుంది.
అందువల్ల ఏసీ కొనాలంటే గదిపరిమాణం, టన్నుల ఎంపిక, ఎనర్జీ రేటింగ్, ఆటోమేటిక్ ఫీచర్లు వంటి విషయాలన్నీ పూర్తిగా అర్థం చేసుకొని, సరైన మోడల్ ఎంపిక చేసుకోవాలి. అప్పుడే వేసవిలో చల్లదనం పొందడమే కాదు, కరెంటు బిల్లు విషయంలోనూ తలబోకుండ ఉండొచ్చు.