Rakhi Purnima 2025: సోదరుడు–సోదరి బంధానికి ప్రతీకగా పరిగణించే రాఖీ పండుగ, ప్రతి ఏడాది శ్రావణ మాస పౌర్ణమి రోజున జరుపుకునే హిందూ సంప్రదాయం. ఈ రోజు అక్కలు, చెల్లెళ్లు తమ అన్నలు, తమ్ముళ్లకు రాఖీ కట్టి, వారి ఆరోగ్యం, సంతోషం, సుదీర్ఘ ఆయుష్షు కోసం మనసారా ప్రార్థిస్తారు. అన్నదమ్ములు కూడా సోదరీమణులకు జీవితాంతం రక్షణగా ఉంటానని హామీ ఇస్తారు. ఈ పండుగలో చేతికి రాఖీ కట్టడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, కుటుంబ బంధాలను మరింత బలపరచే ఒక పవిత్ర సందర్భం.
రాఖీ కట్టడానికి..
ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి ఆగస్టు 8న ప్రారంభమై ఆగస్టు 9 మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. జ్యోతిష్యుల ప్రకారం, రాఖీ పండుగ ప్రధానంగా ఆగస్టు 9 ఉదయం జరుపుకోవడం శుభప్రదం. ఈ రోజు ఉదయం 5:39 గంటలకు శుభ ముహూర్తం మొదలై మధ్యాహ్నం 1:24 గంటలకు ముగుస్తుంది. ఈ సమయం రాఖీ కట్టడానికి అత్యుత్తమంగా పండితులు చెబుతున్నారు. అయితే ఈ ముహూర్తంలో కొన్ని ప్రత్యేక సమయాలు అనుకూలం కాదని చెబుతున్నారు. ఉదాహరణకు ఉదయం 8:52 నుంచి 9:44 వరకు దుర్ముహూర్తం, ఉదయం 11:07 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు రాహు కాలం ఉంటాయి. ఈ సమయంలో రాఖీ కట్టడం మంచిది కాదని పండితులు వివరిస్తున్నారు.
భద్రకాల సమయాన్ని..
భద్రకాల సమయాన్ని కూడా జ్యోతిష్యం ప్రకారం తప్పించుకోవాలి. ఈసారి భద్రకాలం ఆగస్టు 8 మధ్యాహ్నం 2:12 గంటలకు మొదలై ఆగస్టు 9 ఉదయం 1:52 గంటలకు ముగుస్తుంది. ఈ కాలంలో రాఖీ కట్టడం ప్రతికూల ఫలితాలను కలిగిస్తుందని నమ్మకం ఉంది. అందువల్ల పండుగ రోజున రాఖీ కట్టేటప్పుడు ఈ సమయాలను తప్పించి శుభ ముహూర్తాన్ని మాత్రమే అనుసరించడం మేలని పండితులు సూచిస్తున్నారు.
దిశలకూ ప్రాధాన్యం..
వాస్తు శాస్త్రం ప్రకారం రాఖీ కట్టేటప్పుడు దిశలకూ ప్రాధాన్యం ఉంది. సోదరుడు ఈశాన్య దిశగా కూర్చునేలా చూసుకోవాలి. సోదరి అతని ఎదురుగా ఉండాలి. రాఖీ కట్టే ముందు హారతి ప్లేట్‌ను కుంకుమ, గంధం, అక్షతలు, పూలు, స్వీట్లు వంటి పదార్థాలతో అలంకరించడం శుభసూచనగా భావిస్తారు. దీపాన్ని వెలిగించేటప్పుడు అది తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉండేలా అమర్చాలి.
రాఖీ కట్టేటప్పుడు…
చేతికి రాఖీ కట్టేటప్పుడు వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటిస్తే మరింత శుభం కలుగుతుందని విశ్వాసం ఉంది. రాఖీని కుడి చేతికి మాత్రమే కట్టాలి, ఎందుకంటే కుడిచేయి శక్తి, కర్మలకు సూచికగా పరిగణించబడుతుంది. రాఖీ కట్టేటప్పుడు మూడు ముడులు వేయడం సంప్రదాయంగా శుభప్రదం. ఈ మూడు ముడులు సోదరుడు–సోదరి బంధం, రక్షణ, శుభసమృద్ధికి సంకేతాలు.
Also Read: https://teluguprabha.net/lifestyle/money-plant-vastu-tips-for-prosperity-and-avoiding-losses/
ఈ ఆచారాలను పాటించడం ద్వారా కుటుంబంలో ఆనందం, ఐక్యత, శాంతి నెలకొంటుందని పెద్దలు చెబుతారు. రాఖీ కట్టిన తర్వాత అన్నదమ్ములు తమ అక్కచెల్లెళ్లకు బహుమతులు ఇచ్చి వారి పట్ల ప్రేమను వ్యక్తపరుస్తారు. ఇవి కేవలం బహుమతులు మాత్రమే కాకుండా, ఆప్యాయత, గుర్తింపు, మరియు సంబంధాల బలాన్ని ప్రతిబింబిస్తాయి.


