Job Interview VS Vastu: ప్రతి ఒక్కరూ మంచి ఉద్యోగం సంపాదించాలని కలలు కంటారు. చదువు పూర్తయిన తరువాత కష్టపడి ప్రయత్నించినా కొన్నిసార్లు ఫలితం అనుకున్నట్లుగా రాదు. అవసరమైన అర్హతలు ఉన్నా, సన్నాహాలు చేసినా ఇంటర్వ్యూలో విఫలం అవుతుంటారు. ఇలాంటి సమయంలో కేవలం ప్రతిభ, ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు, చుట్టూ ఉన్న శక్తులూ ప్రభావం చూపుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. మన చుట్టూ ఉన్న వాతావరణం, దిశలు, శుభశక్తి వంటి అంశాలు మన ఆలోచనలను, నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొంటారు. ముఖ్యంగా ఉద్యోగ ఇంటర్వ్యూ లాంటి కీలక సందర్భాల్లో కొన్ని వాస్తు పద్ధతులు పాటిస్తే శుభ ఫలితాలు రావచ్చని నమ్మకం ఉంది.
ఈశాన్య దిశ వైపు…
ఇంటర్వ్యూకు వెళ్ళే రోజున ఉదయం స్నానం చేసిన తరువాత ఈశాన్య దిశ వైపు ముఖం పెట్టుకుని నెయ్యి లేదా ఆవ నూనెతో దీపం వెలిగించడం శుభప్రదమని భావిస్తారు. ఈశాన్యం జ్ఞానానికి, సానుకూల శక్తికి చిహ్నంగా పండితులు చెబుతుంటారు. దీపం వెలిగించే సమయంలో మనసులో విజయం కోసం ప్రార్థిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ విధానం మనస్సులోని భయాన్ని తగ్గించి, ప్రశాంతతను కలిగించడంలో సహాయపడుతుంది. ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పే సమయంలో మనసు సాఫీగా పనిచేయడానికి ఇది సహాయం చేస్తుందని పండితులు భావిస్తారు.
ఎండిన తులసి ఆకులు, నల్ల నువ్వులు
ఇంకో ముఖ్యమైన సూచనగా, ఇంటర్వ్యూకు బయలుదేరే ముందు జేబులో ఐదు ఎండిన తులసి ఆకులు లేదా చిన్న ప్యాకెట్‌లో నల్ల నువ్వులు పెట్టుకోవడం మంచిదని చెబుతారు. తులసి పవిత్రతకు, శుభశక్తికి ప్రతీకగా చెబుతారు అలాగే నల్ల నువ్వులు ప్రతికూల ప్రభావాలను తొలగించడంలో సహాయపడతాయని నమ్మకం. ఈ రెండు వస్తువులు మిమ్మల్ని చెడు దృష్టి నుంచి కాపాడతాయని, అదృష్టాన్ని పెంచుతాయని చాలా మంది చెబుతుంటారు.
పసుపు రంగు లేదా క్రీమ్ కలర్..
ఇంటర్వ్యూకి బయలుదేరే ముందు ధరించే దుస్తులు కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఒక పాత్ర పోషిస్తాయని చెబుతారు. లేత పసుపు రంగు లేదా క్రీమ్ కలర్ దుస్తులు ధరించడం మర్యాదను, సౌమ్యతను చూపిస్తుందని చెబుతారు. అలాగే ఇంటి నుంచి బయలుదేరే ముందు కొద్దిగా పెరుగు, బెల్లం కలిపి తినడం శుభం అని పేర్కొంటారు పెద్దలు. ఇది శక్తినిచ్చి, సానుకూలతను పెంచుతుందని నమ్మకం ఉంది. బయలుదేరే సమయంలో దేవుడికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోకూడదని సూచిస్తారు.
వాస్తు చిట్కాలు ఎంత ముఖ్యమైనవైనా, మానసిక సన్నాహాలు లేకపోతే అవి పూర్తిగా ఫలితం ఇవ్వవని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్లే వారు ముందుగా పూర్తిస్థాయిలో సిద్ధమవ్వాలి. ఏ ప్రశ్న వచ్చినా సమాధానం ఇవ్వగలిగేంతగా విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ప్రతికూల ఆలోచనలను దూరం పెట్టి, ధైర్యంగా ఉండే మనస్తత్వం కలిగి ఉంటే మాత్రమే వాస్తు సూచనలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి.
Also Read: https://teluguprabha.net/devotional-news/polala-amavasya-2025-date-puja-timings-rituals/


