10 Maoists Encounter: మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది మార్చికల్లా దేశంలో మావోయిస్టులను పూర్తిస్థాయిలో ఏరి వేస్తామని కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా ఇది వరకు ప్రకటించిన నేపథ్యంలో.. ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది.
ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా మెయిన్పూర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు, వరంగల్ జిల్లా ఘన్‌పూర్‌కు చెందిన మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ(58), ఒడిశా కమిటీ సభ్యుడు ప్రమోద్ ఉరఫ్ పాండు సహా 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. రాయ్‌పూర్ రేంజ్ ఐజీ అమ్రేష్ మిశ్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. మొయిన్పూర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో తెల్లవారుజామున నుంచే సీఆర్పీఎఫ్కి చెందిన కోబ్రా బృందం, స్పెషల్ టాస్క్ ఫోర్స్, గరియాబంద్ పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టాయి.
ఈ క్రమంలో భద్రత దళాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎదురుకాల్పులు జరగగా, 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఘటన స్థలం నుంచి భద్రత దళాలు పెద్దఎత్తున ఆయుధాలు, నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌ను రాయ్‌పూర్ రేంజ్ ఐజీ అమ్రేష్ మిశ్రా ధ్రువీకరించారు. అటవీ ప్రాంతంలో ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆపరేషన్ ముగిసిన తర్వాత ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.
మోదెం బాలకృష్ణపై రూ.కోటి రివార్డు
ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణపై రూ. 1కోటి రివార్డు ఉన్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా గడిచిన నాలుగైదు నెలల్లో సుమారు 400 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. వారిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశరావు, సెంట్రల్ కమిటీ మెంబర్స్ భాస్కర్, సుధాకర్, చలపతి లాంటి అగ్రనేతలు ఉన్నారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం..??
మరికొంతమంది కీలకనేతలు కూడా ఈ ఎన్కౌంటర్లో మరణించి ఉంటారని సమాచారం. ఆపరేషన్ ముగిసిన తర్వాత పూర్తిస్థాయి వివరాలు వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు. గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా ఎన్‌కౌంటర్‌ని పర్యవేక్షిస్తున్నారు.


